close

ఆంధ్రప్రదేశ్

యుద్ధం మొదలైంది

ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి
తెదేపా గెలుపును ఆపలేరు
‘మీ భవిష్యత్తు-నా బాధ్యత’ నినాదం మార్మోగాలి
జగన్‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని తెరాసకు తాకట్టు పెట్టినట్టే
టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి

జగన్‌ కరడుగట్టిన నేరస్థుడు. తనకు 22 ఎంపీ సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. అందర్నీ జైలుకు తీసుకెళ్లడానికి, తన కేసుల మాఫీ కోసం కేంద్రానికి, తెరాసకు తాకట్టు పెట్టడానికి తనకు ఒకసారి ఓటు వేయాలని అడుగుతున్నారు.
‘ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. మన కృషి వల్ల హైదరాబాద్‌ అభివృద్ధి చెందితే... దాన్ని దొంగతనంగా అనుభవిస్తూ దుర్మార్గంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. తాను సంపాదించిన అవినీతి డబ్బుతో జగన్‌కు మద్దతిచ్చి సామంతరాజుగా చేసుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్‌ నోరు మూయించే సత్తా మనకుంది.’
- ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్నికలకు తక్కువ సమయం ఉండటాన్ని అవకాశంగా భావించి కసితో పని చేయాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు  సూచించారు. ‘యుద్ధం మొదలైంది. యుద్ధంలో గెలుపే సిపాయిల లక్ష్యం. ప్రతి కార్యకర్తా ఒక సిపాయిలా పని చేయాలి’ అని పేర్కొన్నారు. ‘మీ భవిష్యత్తు- నా బాధ్యత’ నినాదం ఈ 30 రోజులు ప్రజల్లో మారుమోగాలని సూచించారు. అదే సమయంలో వైకాపాకు ఓటేస్తే... ‘మీ జైలుకు- నా భరోసా’ అని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులతో సోమవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘సాధారణంగా మే 7న జరగాల్సిన పోలింగును ఏప్రిల్‌ 11కి తెచ్చారు. మార్చి, ఏప్రిల్‌లో ఎండలు తక్కువగా ఉంటాయి. తాగునీటి సమస్యలూ ఉండవు. తక్కువ సమయంలోనే సమర్థంగా పని చేయాలి’అని సూచించారు.

రోజూ 5 సమావేశాలు... రోడ్డు షో
రెండు మూడు రోజుల్లో అభ్యర్థులపై ఒక స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం పార్టీ కేడర్‌ను సంసిద్ధం చేసేందుకు వారితో సమావేశమవుతానన్నారు. తిరుపతితో ప్రారంభించి 4 రోజుల్లో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు పూర్తి చేస్తామని తెలిపారు.
జగన్‌ గతంలో తండ్రిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించి దొరికిపోయి అందర్నీ జైలుకు తీసుకెళ్లారని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అందరూ జైలు పాలవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి కావాలన్న కల తప్ప, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదని ధ్వజమెత్తారు. తెరాస, భాజపాలతో కుమ్మక్కై బందిపోట్లలా రాష్ట్రం మీదకు వస్తున్నారన్నారు. ఐదేళ్లలో అమరావతికి వచ్చి ఒక్క రాత్రి కూడా ఉండని జగన్‌ ఈ రాష్ట్రంపై ఏం శ్రద్ధ చూపుతారని ప్రశ్నించారు.

2, 3 రోజుల్లో మేనిఫెస్టో
‘ఎన్నికల యుద్ధం ఆరంభమైంది..అభ్యర్థుల ఎంపిక పూర్తి కావొచ్చింది. రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తాం. తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఉండవల్లి ప్రజా వేదికలో విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలతో ఆయన మాట్లాడారు. ‘అభ్యర్థుల సమాచారం మీ ముందే పెడుతున్నాం. మీరు చెబితే మరోసారి విచారిస్తాం. ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టినా గెలిపించాల్సిన బాధ్యత మీదే’అని సూచించారు. రాష్ట్రంలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.  25 ఎంపీ సీట్లు, 150కిపైగా అసెంబ్లీ స్థానాల్లో తెదేపా విజయం సాధించాలని ఆకాంక్షించారు. వేలంలో ఎవరెక్కువ పాడితే వారికే టికెట్లు ఇచ్చే పరిస్థితి వైకాపాలో ఉందని ఆరోపించారు. ‘గాలికి వచ్చిన వాళ్లు గాలికి పోతున్నారు. అక్కడికి వెళ్లి దిక్కుతోచకుండా ఉన్నారు. మళ్లీ తెదేపాలోకి వస్తామంటున్నా తిరస్కరించా’ అని పేర్కొన్నారు.

జగన్‌కు ఈ గడ్డపై నమ్మకం లేదు
‘జగన్‌కు ఈ గడ్డపై నమ్మకం లేదు.. ఇక్కడి ప్రజలపై విశ్వాసంలేదు. అమరావతిపై అభిమానం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘పాదయాత్ర సమయంలో తప్పితే ఎప్పుడూ రాష్ట్రంలో ఆయన బస చేయలేదు. గత అయిదేళ్లలో ఆయన రాష్ట్రంలో ఎన్నాళ్లున్నారు’ అని నిలదీశారు. సోమవారం చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించిన ఆయన ఇప్పుడు నీతి నిజాయతీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

2 పంటలకు నీరిచ్చే బాధ్యత నాది..
జులై నాటికి పోలవరం పూర్తి చేసి నీటిని గ్రావిటీతో సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.5వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం తెచ్చామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తానికి రెండో పంటకు నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

వేలంలో చింతలపూడి టికెట్‌ అమ్ముతున్న జగన్‌
వేలం వేసి చింతలపూడి టికెట్‌ను వరుసబెట్టి నలుగురికి అమ్మిన చరిత్ర జగన్‌దని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషికి సంఘీభావంగానే తెదేపాలో చేరానన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ప్రణాళిక!

* మొదటి రోజు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శనం.
* అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం.
* శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సమావేశాలు ఒక రోజులో పూర్తి.
* రెండో రోజు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల సమావేశాలు.
* మూడో రోజు విశాఖలో సమావేశం.
* నాలుగో రోజు కర్నూలు, అనంతపురం, కడప సమావేశాలు.

ప్రజల్లోకి సీఎం ఇలా...

* ప్రతి రోజూ నాలుగైదు  నియోజకవర్గాల్లో ప్రచార సభలు.
* సాయంత్రం ఐదో సభ పూర్తయ్యాక రోడ్‌షోలు.
* వీలైన చోట రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకే సభ.
* రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు