close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
లాండ్రీ స్పా ఓ సవాలే!

స్వశక్తి

ఒకప్పుడు ఆమె టీచర్‌. కానీ అక్కడితోనే ఆగిపోవాలను   కోలేదు. లక్ష్యాన్ని మార్చుకుంది. కష్టాన్ని నమ్ముకొంది.  ఇప్పుడు తన లాండ్రీస్పా ద్వారా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది.  ఆమే ప్రతిభా వనంబతిన.

ప్రతిభది విజయవాడ. ఎంఎస్సీ పూర్తి చేసింది. లాండ్రీ స్పా ప్రారంభించడానికి ముందు ఇంగ్లిష్‌, బయాలజీ టీచర్‌గా చేసేది. అయితే ఆమె కల వ్యాపారవేత్త కావడం. పెళ్లయ్యాక హైదరాబాద్‌ వచ్చిందామె. ఆ తరువాతే వ్యాపారం చేయాలనే ఆలోచన పెరిగింది. కానీ ముగ్గురు పిల్లల తల్లిగా బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు అడ్డం పడేవి. ఆ సమయంలోనే స్నేహితురాలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో ఆమె ఏదో సాహసం చేయడానికి సిద్ధమైంది. ‘స్నేహితురాలు తోడుంటాను అన్న వెంటనే వ్యాపారం మొదలుపెట్టేయలేను కదా! కాబట్టి ఏం చేస్తే బాగుంటుందనే స్పష్టత తెచ్చుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. నాకు వంటలంటే ఇష్టం. అందుకే ఫుడ్‌ అండ్‌ బెవరేజస్‌ రంగంలోకి వెళ్లాలనుకున్నా. అయితే ఈ వ్యాపారం చెఫ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎప్పుడయినా వాళ్లు మానేస్తే ఆ రోజు వ్యాపారం కష్టమే కాబట్టి వద్దనుకున్నా. అలాగే మరికొన్ని ఆలోచనలు చేశా. అప్పుడే స్నేహితుల ద్వారా లాండ్రీ సర్వీసెస్‌ గురించి తెలిసింది. నాకు దుస్తులను చక్కగా మడతలు పెట్టడం, భద్రపరచుకోవడం ఇష్టం. కాబట్టి ఆ రంగంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యా. పైగా ఈ రోజుల్లో ఒత్తిడితో కూడుకున్న జీవితం, మారుతోన్న అవసరాల దృష్ట్యా లాండ్రీ సేవలు పెరుగుతున్నాయని అర్థమైంది. అందుకే బ్యాంకురుణం కొంత, స్నేహితురాలి సాయంతో పదిలక్షల రూపాయలు పెట్టుబడిగా లాండ్రీ స్పా సేవల్ని ఫ్రాంచైజీ తీసుకున్నా. ఆ సంస్థ డిపాజిట్‌ కట్టించుకుంది తప్ప ఎలాంటి మార్కెటింగ్‌ సాయం చేయలేదు. దాంతో మూడునెలలకే చేయలేక దాన్నుంచి బయటపడ్డా. చివరకు నేనే సొంతంగా ఓ బ్రాండ్‌ తీసుకురావాలనుకున్నా. అలా ఎంఎస్‌ఎంఈ వారి సాయంతో మరో లోన్‌ తీసుకుని మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ‘లాండ్రీస్పా’ పేరుతో సంస్థను ప్రారంభించా’ అని చెబుతుందామె.
ఏం చేస్తారంటే...
అప్పటికే కొన్ని లాండ్రీసర్వీసెస్‌ మార్కెట్‌లో ఉన్నాయి. కానీ తమదైన ప్రత్యేకత చూపించాలిగా.. అందుకే డోర్‌మ్యాట్‌ల నుంచి పరదాల వరకూ... సాక్సుల నుంచి డ్రెస్‌ల వరకూ ప్రతిదీ ఉతికించి ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రతిభ.  మరకలు పోగొట్టడమే కాదు...డార్నింగ్‌ నుంచి డైయింగ్‌ వరకూ అన్ని ఒక్కచోటే ఉండేలా  సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ‘మేం ప్రత్యేకంగా జర్మన్‌ కెమికల్స్‌ని ఉపయోగిస్తాం. నీళ్లల్లో పీహెచ్‌ స్థాయులు ఎక్కువ ఉంటే వాటిని తగ్గించేందుకు ఫిల్టర్‌ చేసి వాటితోనే దుస్తులను ఉతుకుతాం. అయితే మా ప్రత్యేకతల్ని చెప్పడం నాకు సవాలుగా మారింది. పైగా నాకు మార్కెటింగ్‌పై పెద్దగా అవగాహన కూడా లేదు. మొదట్లో పేపర్లలో పాంప్లెట్లు పెట్టేదాన్ని.   ఫ్లైయర్స్‌ కూడా చేయించా. అలా వినియోగదారుల సంఖ్య పెరిగింది. అయితే అది సరిపోదనిపించింది. అందుకే నన్నునేను అప్‌డేట్‌ చేసుకుని వెబ్‌డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ చేశా. వారం మొత్తం మా సేవలు అందుబాటులో ఉంటాయి. అలానే కేవలం మూడురోజుల్లోనే వినియోగదారులు అందించిన దుస్తుల్ని శుభ్రపరిచి తిరిగి ఇస్తాం. ప్యాకేజ్‌ వరకూ జాగ్రత్తగా ఉండేలా చూస్తాం. ఇలా ఇప్పుడు నెలకు సుమారు ఐదువేల జతల్ని శుభ్రం చేసి ఇస్తున్నాం... అని చెబుతుంది ప్రతిభ.
సమస్యలూ ఉన్నాయి...
ఏ వ్యాపారంలో అయినా కూడా ప్రాథమికంగా ఉండే సమస్య మానవవనరులే. ఈ పనికి చదువూ, సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండదు. కానీ సిబ్బంది పని నేర్చుకుని కుదురుకుంటున్నారు అనుకునేసరికి వెళ్లిపోయేవారు. దాంతో ప్రతిభ మొదట్లో చాలా  ఇబ్బంది పడింది. ఆర్థిక సమస్యలూ తప్పలేదు. ఎప్పటికప్పుడు వివిధ దశల్లో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఒక్కో సమస్యనూ అధిగమిస్తూ వచ్చింది. ఇవన్నీ చూసిన చాలామంది....‘గౌరవప్రదమైన టీచర్‌ వృత్తిలో ఉన్నారు. ఇలా విడిచిన బట్టలు తీసుకోవడం ఎందుకండీ’ అని అనేవారట. ప్యాషన్‌తో చేసేటప్పుడు ఏ పనైనా ఆసక్తిని పెంచుతుంది. ఇంట్లో వాళ్లు కూడా ప్రారంభంలో పెట్టుబడి, మార్కెటింగ్‌ రిస్క్‌ వంటివన్నీ చూసి భయపడినా ఇప్పుడు అంతా ఆమెను ప్రోత్సహిస్తున్నారు. లక్షల్లోనే టర్నోవర్‌ అందుకుంటోందామె.


మరిన్ని