close

ఆంధ్రప్రదేశ్

ఉగాదికి వస్తే.. వెళ్లేది ఓట్ల పండగయ్యాకే..!

వేడుకలా దిగి వచ్చాయి
ఈనాడు - అనంతపురం, ఈనాడు డిజిటల్‌- ఒంగోలు

గాది.. తెలుగువారి తొలిపండగ..పచ్చని మామిడి తోరణాలు..తీపివగరు రుచుల పచ్చడితోపాటు మమతానురాగాలు కలగలిపి జీవిత సత్యాలను తెలియజెప్పే గొప్ప పండగ..అలాంటి  ఉగాది..ఈసారి ఓట్ల పండగను తోడు తెచ్చింది.  పొట్టకూటికోసం సొంత ఊరుని, రాష్ట్రాన్ని వదలి పొరుగు రాష్ట్రాలకు వలసబాట పట్టిన కూలీలు ఉగాదికి తప్పకుండా  సొంత ఊళ్లకు వస్తారు. ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతోపాటు ఆ తర్వాత వచ్చే ఓట్ల పండగలోనూ పాలుపంచుకునే వెళ్తామని నిర్ణయించుకుంటున్నారు.
కరవు ప్రాంతమైన రాయలసీమ నుంచి లక్షలాది మంది పక్క రాష్ట్రాలకు పనులకోసం వలస వెళతారు. ఎక్కడ ఉన్నా ప్రతిసంవత్సరం ఉగాదికి సొంత గ్రామాలకు వస్తారు. పండగకు వచ్చిన వీరంతా ఒక వారంపాటు ఇక్కడే గడుపుతారు. ఈసారి ఏప్రిల్‌ 6న ఉగాది, 11న శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండటం ఈ కూలీలకు కలసివచ్చింది.

కరవు ప్రాంతంగా పేరున్న రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి దాదాపు నాలుగు లక్షలమంది పక్క రాష్ట్రాలకు పనుల కోసం  వలస వెళతారు. ఎక్కువగా కర్ణాటక, తెలంగాణలకు, కొద్దిమంది, ఛత్తీస్‌గఢ్‌, కేరళలకు  వెళతారు. బెంగళూరు, మైసూరు, మంగుళూరుతోపాటు,హైదరాబాద్‌, పుణె తదితర ప్రాంతాల్లో భూగర్భ కేబుల్‌ ఏర్పాటు, పైపులైన్‌, భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటారు. కొందరు ప్రైవేటు సంస్థల్లో భద్రతా సిబ్బందిగా, తోట పనివాళ్లుగా ఉంటారు. ఇటీవల అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాలకు కూడా వలస వెళ్తున్నారు. సాధారణంగా మేస్త్రీలు (గుత్తేదార్లు) బడా కాంట్రాక్టర్ల వద్ద పనులు ఒప్పుకొని గ్రామాలనుంచి ఈ కూలీలను తీసుకెళతారు. ఈ మేస్త్రీలు ఒక్కో గ్రామం నుంచి 50 మొదలు 100మంది వరకు ఓ బృందంగా ఎంపిక చేసుకుని తమ వెంట నగరాలకు తీసుకెళతారు.

వలస ఓట్లకోసం పాట్లు..

వివిధ జిల్లాల నుంచి వలస వెళ్లినవారి ఓట్ల కోసం నాయకులు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈసారి పండగకి ఊరికి వచ్చి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, పై ఖర్చులు  భరిస్తామంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, లేదా వారి కుటుంబీకులు వలసలు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి వారితో సంప్రదింపులు సాగిస్తున్నారు.. ముఖ్యంగా కూలీలను తీసికెళ్లే మేస్త్రీలకు ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌ ఉంది. నేతలు వారిని సంప్రదించి, ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీటు ఖాళీ లేదోయ్‌...

ట్ల పండగరోజు సొంత ఊళ్లకు రావాలని ఇతర ప్రాంతాల్లో ఉండేవారంతా ఆసక్తి చూపుతున్నారు. అధికారులు ఊహించని విధంగా ఆర్టీసీ, రైల్వేలో ఓ రోజున అత్యధికంగా టికెట్లు అమ్ముడయ్యాయి. అసలు ఖాళీలే లేవు. రైలులో వెయిటింగ్‌ లిస్టులో చూడాలన్నా టికెట్టు లేదు. బస్సులో అయితే సంక్రాంతి, దసరా సీజన్‌ను మించి డిమాండు పెరిగింది. సీటు రిజర్వు చేయాలంటే సర్వర్లు పనిచేయనంతగా గిరాకీ పెరిగింది. ఏప్రిల్‌-10న హైదరాబాద్‌, బెంగళూరుల నుంచి ఒంగోలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు రావాలంటే రైళ్లూ, బస్సులు ఖాళీ లేవు. రైళ్లలో చార్మినార్‌, సింహపురి, శబరి, హౌరా-చెన్నై మెయిల్‌, యశ్వంత్‌పూర్‌ రైళ్లలో సీట్లన్నీ వెయిటింగ్‌ లిస్టుకి చేరిపోయాయి. బస్సులు ఇది వరకే నిండిపోగా, ఆర్టీసీ అదనంగా 50 బస్సులను వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు బస్సులు అదనంగా నడిపించే సన్నాహాలు సాగుతున్నాయి.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు