close

ఆంధ్రప్రదేశ్

భారత భాగ్యవిధాతలు మీరే!

 

ఒక భాషంటూ లేదన్నారు
ఒక మతమంటూ లేదన్నారు
ఎక్కడ చూసినా విద్వేషాలు, వైషమ్యాలు...
ఇక జాతిని సమైక్యంగా పట్టి ఉంచే శక్తేముందని సందేహించారు!
పేదరికం తాండవించే చోట...
ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందని ప్రశ్నించారు!!

కానీ...
‘భిన్నత్వంలో ఏకత్వమే’ భరత జాతి ఆత్మనీ...
ప్రజాపాలనే మనందరి ఆశయమనీ...
ఓటే దాని జీవశక్తి అనీ...
చాటిచెప్పిన దేశం మనది.

మన కోసం...  మన పాలకులను...
మనమే ఎన్నుకొనే... ఓట్ల పండగ మళ్లీ వచ్చింది!
మన భవితను నిర్ణయించుకునే అవకాశం
మన చేతికి తెచ్చింది!!

ఇప్పుడు...  నిర్ణేతలం మనమే!
ఓటు మీట నొక్కి... గొంతు వినిపించాల్సింది మనమే!!
ఎన్నికల భారతంలో... గెలుపు సాధించాల్సిందీ మనమే!!

సుదీర్ఘ సంగ్రామం తర్వాత సిద్ధించిన స్వతంత్ర భారతావని భవిష్యత్తుపై నాడెన్నో అనుమానాలు! భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు... ఎక్కడికక్కడ భాషా వైరుధ్యాలు, కులమత విద్వేషాలు! ఇన్ని ప్రతికూలతల నడుమ పురుడుపోసుకున్న దేశం ఎంతకాలం ఏకతాటిపై నడవగలదు? జనమంతా ఎన్నాళ్లు కలిసికట్టుగా ఉండగలరు? అని ప్రపంచం సందేహించింది. భారత్‌లో అంతర్యుద్ధం చెలరేగడానికి ఎంతోకాలం పట్టదనీ, ఛిన్నాభిన్నం కావడం తథ్యమని భావించింది. కానీ ‘భారతదేశం నా జన్మ భూమి, భారతీయులంతా  నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా’నంటూ ప్రతి గొంతూ నినదించింది.  ప్రజాస్వామ్యం పట్ల తిరుగులేని విధేయత చూపుతూ ఐక్యతను చాటుతూనే ఉంది.

ఎన్నో పరిమితుల నడుమ జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును  వినియోగించుకున్నది కేవలం 17 కోట్ల మందే! మొత్తం ఓటర్లలో వీరు 45% మాత్రమే. అయితే కాలం గడుస్తున్నకొద్దీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకంతకూ వేళ్లూనుకుంటూ, మరింత పారదర్శకతతో ప్రజా విశ్వాసాన్ని పొందుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారి శాతం పెరుగుతూనే ఉంది. 2014 సార్వత్రికంలో ఏకంగా 66.4% మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. త్వరలో ఏడు దశల్లో జరిగే 17వ లోక్‌సభ ఎన్నికల్లో 90 కోట్ల మందికి పైగా ఓటు మీట నొక్కి దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నారు.

* ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీసం ఒక పోలింగ్‌ స్టేషన్‌ను పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే  నిర్వహిస్తారు.
* సర్వీసు ఓటర్ల కోసం తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్లు అందుబాటులోకి రానున్నాయి.

 

ఇవి బాహుబలి ఎన్నికలు

మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ. 90 కోట్ల   పైచిలుకు ఓటర్లున్న భారీ జనస్వామ్య దేశం. ఇక్కడ ఎన్నికల నిర్వహణ అనగానే యావత్‌ ప్రపంచం మనవైపే చూస్తోంది.
బాహుబలి తరహాలో భారీగా జరగబోతున్న ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మండు వేసవికి రాజకీయ వేడి తోడై వాతావరణం సెగలు కక్కుతోంది. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో దేశంపై రాజకీయ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతకీ ఈ ఎన్నికలకు ఎందుకింతటి ప్రాధాన్యం? ఏయే అంశాలు ఈ ఎన్నికల్ని కీలకంగా మార్చాయి?

యువ తరంగం

2019 ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయబోయే (18, 19 ఏళ్ల) ఓటర్ల సంఖ్య 1.5 కోట్లు. రోజురోజుకీ అందివస్తోన్న సాంకేతిక పరిజ్ఞానం కూడా యువ ఓటర్లను ఎన్నికల దిశగా వెన్నుతడుతోంది.

హైటెక్‌ ప్రచారం

ఒకప్పుడు ప్రచారం కరపత్రాలు, మైకులకు పరిమితం అయ్యేది. అప్పుడది రకరకాల మార్పులను దాటుకుని.. సామాజిక మాధ్యమాల వరకూ వచ్చింది. కారణం ప్రస్తుతం మనదేశంలో 43 కోట్ల మంది భారతీయులు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. అందులో సగం మంది కంటే ఎక్కువే ఇంటర్నెట్‌ వాడుతున్నారు. అంతేనా 30 కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారులు, 20 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లు, 3 కోట్ల మంది ట్విటర్‌ ఖాతా దారులున్నారు. వాటికి అనుగుణంగా ఆయా పార్టీలు ఈ పాటికే ప్రచారాస్త్రాలు సంధించాయి.

సాంకేతికత

ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి రకరకాల యాప్‌లు, వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ సమీక్షలు, నాయకుల వివరాలను ప్రజలు తెలుసుకుంటున్నారు.

మహిళా ఓటర్ల వెల్లువ

ఓటు వేసేందుకు పురుషులతో సమానంగా మహిళలూ వెల్లువలా కదలి వస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గత లోక్‌సభ ఎన్నికల్లో వారి ఓట్లు 65.63% నమోదయ్యాయి. కానీ ఇప్పటికీ పార్లమెంట్‌లో మహిళలకు సమ ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం లోక్‌సభలో వారి వాటా 11.42 శాతమే. కాగా ఈసారి మరింత మంది మహిళల్ని పోలింగ్‌ కేంద్రాలకు నడిపించడానికి ప్రత్యేకంగా ‘పింక్‌ పోలింగ్‌ బూత్‌’ ఏర్పాటు చేస్తున్నారు.

సంక్లిష్టం

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తిమీద సామే. కిక్కిరిసిన నగరాల దగ్గర్నుంచి.. భిన్న భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల వరకూ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇందుకోసం లక్షల మంది అధికారులు, భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగిస్తున్నారు. విమానాలు, పడవలు, రైళ్లు హెలికాప్టర్లు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు.. ఇలా రకరకాల రవాణా సౌకర్యాల ద్వారా సిబ్బందిని చేరవేస్తారు. వాహనాలు వెళ్లలేని చాలా చోట్లకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎన్నికలు నిర్వహించే అధికారులకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, స్లీపింగ్‌ బ్యాగులు, ఆహారం, టార్చి లైట్లు.. అందిస్తున్నారు. గుజరాత్‌లో ఒకే ఓటరున్న గిర్‌ అటవీ ప్రాంతంలో, తేనెటీగల బెడద ఉన్న ఛత్తీస్‌గడ్‌లో ప్రత్యేకంగా వైద్య బృందాల్ని ఏర్పాటుచేస్తున్నారు.

ఈసారి కొత్తగా

ప్రతి ఓటుకూ 100% భరోసా కల్పిస్తారు. ఈవీఎంపై మీట నొక్కిన తర్వాత... ఓటరు ఎవరికి ఓటు వేశారు, కోరుకున్న అభ్యర్థికే అది నమోదైందా? తదితర వివరాలను వీవీప్యాట్‌లు చూపిస్తాయి. ఆ తర్వాత యంత్రం ఆ వివరాలను ప్రింట్‌ చేస్తుంది. ఆ రసీదులను అధికారులు భద్రపరుస్తారు.
* ఆకస్మిక తనిఖీ బృందాలతో పాటు ప్రతి ఈవీఎంనూ జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.
* అభ్యర్థులు తమ ఆస్తులతో పాటు గత ఐదేళ్లుగా ఎంత సంపాదించారన్నది తప్పకుండా వెల్లడించాలి.
* పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్ర గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థుల గుర్తు, పేరుతో పాటు ఫొటో కూడా అన్ని బ్యాలెట్‌ బాక్సులపై ప్రదర్శిస్తారు. బ్రెయిలీలోనూ వారి పేర్లుంటాయి.

మనది గుండె ధైర్యం

ప్రజాస్వామ్యం దేశానికే కాదు.. మన ఆరోగ్యానికీ మంచిది. ముఖ్యంగా మన గుండెకు మరీ మంచిదట. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు, సాక్షాత్తు విఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ఆరోగ్య పరిశోధన విభాగం. 1980 నుంచి 2016 మధ్య ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు.. ప్రజాస్వామ్యంలోకి మారిన దేశాల్లోని ప్రజల ఆయుర్దాయం పెరిగిందని గుర్తించారు. గుండె జబ్బులు తగ్గడంతోపాటు, రవాణా సంబంధ మరణాలు గణనీయంగా తగ్గినట్లు తేల్చారు. దీనికి ఆయా దేశాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటం ముఖ్యమనేది శాస్త్రవేత్తల ఉవాచ.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు