close

ఆంధ్రప్రదేశ్

కన్నయ్యకు లాలూ మోకాలడ్డు!

కన్నయ్య కుమార్‌.. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. మూడేళ్ల క్రితం దేశద్రోహం కేసులో అరెస్టవ్వడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై పదునైన విమర్శలు కొనసాగించిన కన్నయ్య క్రమంగా రాజకీయాలకు చేరువయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బిహార్‌లో ‘మినీ మాస్కో’గా పిలుచుకునే బెగూసరాయ్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున బరిలో దిగాలని యోచిస్తున్నారు. సీపీఐకి ఇక్కడ గట్టి పట్టుంది. కన్నయ్య అభ్యర్థిత్వానికి పార్టీ అంగీకరించింది కూడా. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. బిహార్‌ మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ భాగస్వాములుగా ఉన్నాయి. సీట్ల పంపకాల్లో భాగంగా బెగూసరాయ్‌ని తమకు కేటాయించాలని సీపీఐ చేస్తున్న విన్నపాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ గెలిచే సత్తా సీపీఐకి గానీ, కన్నయ్యకు గానీ లేదని ఆయన వాదిస్తున్నారు. లాలూ బయటకు ఆ మాటలు చెప్తున్నా.. కన్నయ్యకు మొండిచేయి చూపుతుండటం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఎదుగుదలకు యువ నేత కన్నయ్య పోటీ కాకూడదన్న ఉద్దేశంతోనే ఆయనకు టికెట్‌ దక్కకుండా చేస్తున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు