close

ఆంధ్రప్రదేశ్

దిల్లీకి ఉత్తర ద్వారం

కేంద్రంలో అధికార నిర్ణాయక రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌
  ఈసారి సమరం త్రిముఖం

ఉత్తర్‌ప్రదేశ్‌... దిల్లీకి చెంతనే ఉండడమే కాదు, హస్తినలో పాగా వేయడానికి దగ్గరదారి అనేది జగమెరిగిన సత్యం.
దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద రాష్ట్రం.

అదొక్కటే కాదు...
యూపీ అంటే ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌.
యూపీ అంటే పవిత్రమైన గంగానది.
యూపీ అంటే హస్తకళల ఖిల్లా.
సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుడే కొలువైన దివ్యధామం.
యోగులు-సాధుపుంగవులు, పీఠాధిపతుల నిలయం.

సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు... ఇలా ఏ రంగంలో చూసినా అనేకమంది ఉద్దండులు యూపీ మూలాలున్నవారే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వస్థలం గుజరాత్‌ అయినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఇక్కడిదే.
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రాష్ట్రానికి చెందినవారే.

సోనియాగాంధీ (రాయ్‌బరేలీ), రాహుల్‌గాంధీ (అమేఠీ) వంటి అగ్రనేతల నియోజకవర్గాలు యూపీలోనే ఉన్నాయి.
నిఖార్సయిన రాజకీయాలు, సం‘కుల’ సమరాలు, వివాదాలు, నేరాలు-ఘోరాలు... ఇలా దేనిలో చూసినా ఈ రాష్ట్రానిదే పైచేయి.
ఏడుగురు ‘భారతరత్న’లను అందించిన ‘ఉత్తమ’ప్రదేశ్‌ ఇది.

అందుకే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తగినంత ముందుగానే యూపీపై దృష్టి కేంద్రీకరించాయి. ఇక్కడ సింహభాగం స్థానాలు గెలుచుకుంటే అధికార పీఠాన్ని చేరుకోవడం సులువవుతుందనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాయి. గతంలో ప్రత్యర్థులుగా వ్యవహరించిన సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఈసారిఒక్కటయ్యాయి. భాజపా విడిగా బరిలో దిగనుంది. అప్నాదళ్‌కు కాంగ్రెస్‌ రెండు స్థానాలు కేటాయించింది.

కమలమా... ప్రియాంకమా... కొత్త కూటమా...

దేశం మొత్తంమీద 29 రాష్ట్రాల్లో 543 లోక్‌సభ స్థానాలు ఉంటే ఒక్క యూపీలోనే 80 ఉండడం ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ రాజకీయ రణక్షేత్రంలో అగ్రపథానే నిలబెడుతోంది. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో సొంతంగా 71, మిత్రపక్షాల ద్వారా మరో రెండు... వెరసి 73 ఎంపీ స్థానాలను కమలదళం ఇక్కడ కైవశం చేసుకోవడంతో కేంద్రంలో సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు సాధించడం సులువయింది. ఈసారి సార్వత్రిక సమరంలోనూ అదే దూకుడు కనపరచాలని ఆ పార్టీ ఆరాటపడుతోంది. ఉప ఎన్నికల్లో భాజపాకు ఎదురైన ఓటములతో ఈ రాష్ట్రంపై కాంగ్రెస్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవడం లక్ష్యంగా... పార్టీకి తురుపుముక్క ప్రియాంక గాంధీకి యూపీలో తూర్పు భాగాన్ని పర్యవేక్షించే బాధ్యతను అప్పగించింది. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి, భాజపా, కాంగ్రెస్‌ కూటమి ఈ మూడింటి మధ్య ఈసారి గట్టిపోరు తప్పదు. ఈ త్రికోణ సమరంలో యూపీ ఓటరు ఎవరికి పట్టం కడతాడనేది ఆసక్తికరంగా మారింది. ములాయం సోదరుడు శివపాల్‌సింగ్‌ యాదవ్‌ సొంతంగా ‘ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ లోహియా’ (పీఎస్‌పీఎల్‌)ను ఏర్పాటుచేసి, లోక్‌సభ స్థానాలన్నింట్లో అభ్యర్థుల్ని నిలబెడతానని ప్రకటించారు.

బీఎస్పీ-ఎస్పీ కూటమి

భాజపా కంచుకోటల్లోనే ఆ పార్టీని ఉప ఎన్నికల్లో ఓడించిన ఉత్సాహం ఎస్పీలో ఉంది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు బలమున్న గోరఖ్‌పుర్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ఖాళీ చేసిన ఫూల్‌పుర్‌, మతపరంగా అత్యంత సున్నితమైన కైరానా లోక్‌సభ స్థానాల్లోనూ భాజపాను ఓడించగలగడం కొత్త శక్తినిచ్చింది. విపక్షాలు చేతులు కలిపితే భాజపాని ఓడించవచ్చనే సంకేతాన్ని ఈ ఫలితాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతాయి. దళితుల్లో పట్టు ఉన్న బీఎస్పీతో జత కట్టడం పలు సామాజిక వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా రాబడుతుందనే అంచనా ఈ కూటమిలో ఉంది. 2012లో మాయావతి ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆశాజనకంగా ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఆచితూచి అడుగేస్తున్నారు.

కాంగ్రెస్‌

పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం కావడం, ప్రియాంక తొలిసారిగా రాజకీయ పర్యవేక్షణ బాధ్యతల్ని చేపట్టడంతో యూపీపై కాంగ్రెస్‌ అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది.

భాజపా

అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అమలు చేసిన పథకాల వల్ల వ్యక్తిగతంగా లబ్ధిపొందినవారి సంఖ్య భారీగా ఉందని, అదే తమను విజయతీరాలకు చేరుస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న లుకలుకలు పరోక్షంగా కలిసి వస్తాయని అంచనా. దేశంలో ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేనప్పుడే యూపీ తమకు పెట్టని కోట అని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. బాహాటంగా అంగీకరించకపోయినా హిందుత్వ అంశం కలిసివస్తుందని భావిస్తున్నారు.

 ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు

* పుల్వామా ఉగ్రదాడి
* గో సంరక్షణ
* రైతు సమస్యలు, గిట్టుబాటు ధరలు, ఆత్మహత్యలు
* నోట్ల రద్దు, జీఎస్టీ
* తలాక్‌ చట్టం
* అయోధ్య
* ప్రభావిత కులాలు:  క్షత్రియ (రాజ్‌పుట్‌), ఠాకూర్‌, ముస్లింలు, బ్రాహ్మణులు, దళితులు

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు