close

ఆంధ్రప్రదేశ్

మూడు సెకన్లు.. మూడు ప్రాణాలు 

కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు 
రహదారి పక్కన నిలుచున్న యువకులు మృతి

వనస్థలిపురం, న్యూస్‌టుడే: రహదారి పక్కన నిలుచున్న ముగ్గురు యువకుల జీవితాలను కారు చిదిమేసింది. వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌ వనస్థలిపురం సమీపంలోని నాగార్జునసాగర్‌ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్‌కు చెందిన కేతావత్‌ గణపతి(21) హస్తినాపురంలోని తిరుమలకాలనీలో నివాసం ఉంటూ అక్షర ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మిర్యాలగూడ మండలం జంకుతండాకు చెందిన దనావత్‌ సాయికుమార్‌(21) బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎల్బీనగర్‌లోని కాకతీయకాలనీలో నివాసముంటున్నాడు. అదే తండాకు చెందిన దనావత్‌ వంశీ(19) ల్యాబ్‌ టెక్నీషియన్‌. ఇతను సరస్వతీనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. ముగ్గురూ కలిసి శనివారం రాత్రి గుర్రంగూడలోని బంధువుల గృహప్రవేశానికి ఎల్బీనగర్‌ నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. గుర్రంగూడ ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ సమీపంలో జ్యూస్‌, టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ద్విచక్రవాహనాన్ని పక్కకు ఆపారు.

కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం వీరు రోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుకుంటున్నారు. అంతలోనే అతివేగంగా వనస్థలిపురం వైపు నుంచి వచ్చిన కారు వీరిపైకి దూసుకుపోయింది. అటుగా వెళ్లేవారు ఏమైందో తెలుసుకునేలోపు ముగ్గురు యువకులు రక్తమోడుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అతివేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొని రోడ్డుకు సమీపంలో ఉన్న గోడకు తగిలి బోల్తా పడింది. కారు డ్రైవర్‌ అందులోంచి బయటపడి పరారయ్యాడు. పోలీసులు వచ్చి చూసే సరికి ముగ్గురు యువకులు మృతి చెంది ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య పేర్కొన్నారు. కాగా ప్రమాదం జరిగిన తీరు అక్కడి దుకాణం ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ సంఘటన అర్ధరాత్రి 12గంటల 21నిమిషాల 15 సెకన్లకు జరిగింది. కేవలం మూడు సెకన్లలోనే ప్రమాదం జరిగి, యువకులు మృతి చెందారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు