close

ఆంధ్రప్రదేశ్

ఉల్లంఘనుల గుండెల్లో ‘విజిల్‌’ 

నేటి నుంచి సి-విజిల్‌ యాప్‌ సేవలు ప్రారంభం 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే నేరుగా ఫిర్యాదు 
రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల  అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడి 
ప్రచార అనుమతుల కోసం  ‘న్యూ సువిధా’ యాప్‌ 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

న్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ‘‘సి-విజిల్‌’’ యాప్‌ అందుబాటులోకి రానుంది. ఉల్లంఘనకు పాల్పడిన ఘటనకు సంబంధించిన ఫొటో, వీడియోను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సోమవారం నుంచి ఈ యాప్‌ సేవల్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. ఆదివారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులు, ఎన్నికల సంఘం నోడల్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు స్పందించాలని, నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని సూచించారు. వారు స్పందించకపోతే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో వాటిని తొలగించి అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. 

నమూనా పోలింగ్‌ పూర్తి చేయాలి 
నమూనా పోలింగ్‌, ఇతరత్రా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వివేక్‌యాదవ్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని, సాంకేతిక అంశాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సర్వీసు ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేసే సదుపాయం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఉందని వివరించారు. 

అనుమతుల కోసం ‘‘న్యూ సువిధా’’ యాప్‌ 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం న్యూ సువిధా యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని వివేక్‌యాదవ్‌ వివరించారు. దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయో మొబైల్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ దరఖాస్తులను రవాణా, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సమన్వయం చేసుకొని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నామినేషన్లు, ప్రచారానికి సంబంధించిన అనుమతులు, ఓట్ల లెక్కింపు, ఫలితాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన వివరాల్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు న్యూ సువిధా యాప్‌కు అనుసంధానించాలన్నారు.

102 మంది వ్యయ పరిశీలకులు 

ఈనాడు, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి 102 మంది వ్యయ పరిశీలకులను  నియమించింది. వీరిలో ఆదాయపు పన్ను, కస్టమ్స్‌ శాఖల ఉన్నతాధికారులే ఎక్కువుగా ఉన్నారు. వ్యయ పరిశీలకులంతా సోమవారం రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు 25 మంది, శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిశీలనకు మరో 77 మందిని కేటాయించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని అనుసరించి వ్యయ పరిశీలకులకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు