close

ఆంధ్రప్రదేశ్

సాక్ష్యాలు తారుమారు చేయించింది జగనే 

గొడ్డలితో నరికారని తెలిసినా సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం 
ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య,  తెదేపా అధికార ప్రతినిధులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతంలో సాక్ష్యాలను తారుమారు చేయాలని కుటుంబ సభ్యులను ఆదేశించింది జగనేనని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య, తెదేపా అధికార ప్రతినిధులు లంకా దినకర్‌, సాదినేని యామినీశర్మ ఆరోపించారు. వివేకా ఎందుకు హత్యకు గురయ్యారో తెలిసీ కుటుంబ పరువు పోతుందని వాస్తవాలు దాచేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. నిజాలు కప్పిపుచ్చి సీఎం చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో వీరు ఆదివారం వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
‘వివేకా హత్యను రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం దారుణం. ఆయన సెల్‌ఫోన్‌కు అర్ధరాత్రి మేసేజ్‌ వచ్చిన విషయం తెలిసీ దాచేందుకు ప్రయత్నించారు. గొడ్డలితో ఏడుచోట్ల నరికారని గుర్తించినా సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నీవు ఈ మెసేజ్‌ విషయం చెప్పావా? సొంత చిన్నాన్న హత్యకు గురైతే శవాలపై రాజకీయాలు చేస్తావా’ అని విరుచుకుపడ్డారు. ‘వివేకా మృతదేహాన్ని మొదట చూసిన శివప్రకాశ్‌రెడ్డి నీతో ఏం చెప్పారు. శివప్రకాశ్‌రెడ్డి వివేకాకు ఏమవుతారు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌లతో వివేకాకు ఉన్న ఆర్థిక లావాదేవీలేంటి? ఈ ఘటనలో వివేకా పీఏ కృష్ణారెడ్డి పాత్ర ఏంటీ?  కృష్ణారెడ్డితో నీవేం మాట్లాడావో బయటపెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘నిన్ను చూసేందుకు వివేకా చంచల్‌గూడ జైలుకు వస్తే అనుమతించని విషయం నిజం కాదా? గతంలో ఆయన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించలేదా?’ అని ప్రశ్నించారు. 
రక్తం రుచి మరిగిన జగన్‌... 
‘జగన్‌ మనిషి రక్తం రుచి మరిగిన తోడేలు వంటి వ్యక్తి. తాత రాజారెడ్డి నుంచి జగన్‌ వరకు హత్యా రాజకీయాల్లో ఆరితేరినవారే. 300 మంది తెదేపా కార్యకర్తలను చంపిన నేర చరిత్ర మీది. మీ మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు’ అని స్పష్టంచేశారు. ‘విశ్వసనీయతకు చంద్రబాబు మారుపేరైతే...జగన్‌ వంచనకు మారుపేరు. సాక్షి పత్రికను అడ్డుపెట్టుకుని సీఎంను నరహంతకుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి పోకడలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని’ అన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు