close

ఆంధ్రప్రదేశ్

అవసరమైతే జాతీయ పార్టీ 

ప్రజలు దీవిస్తే కాంగ్రెస్‌, భాజపాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తా 
భారత దేశం తలరాత మార్చేందుకు ప్రధాన పాత్ర పోషిస్తా 
మోదీ, రాహుల్‌ఇద్దరూ ఇద్దరే 
కరీంనగర్‌ సభలో కేసీఆర్‌

నన్ను దేశ రాజకీయాల్లోకి వెళ్లమంటారా.. వెళ్లమంటే పిడికిలి బిగించి దీవించండి. దేశ రాజకీయాల్లో తెలంగాణ పెద్దపాత్ర పోషించాలి. పెనుమార్పులు రావాల్సి ఉంది. మీ బిడ్డగా కరీంనగర్‌ దీవెనతో దేశాన్ని దుర్మార్గులనుంచి విముక్తి చేసి అద్భుతమైన భారతదేశాన్ని నిర్మిస్తానని మాటిస్తున్న ఈసారి సమాఖ్య ప్రభుత్వం, ఫెడరల్‌ ప్రభుత్వం రావాలె. ఈ దద్దమ్మలు పోవాలె.. దేశం బాగుపడాలంటే.. ఎవడో ఒక్కడు పూనుకోవాల. మొగోడు పుట్టాలె.. పొలికేక పెట్టాలె.. ఆనాడు కూడా నన్ను ఇట్లనే అన్నరు. తెలంగాణ ఎట్ల తెస్తవన్నరు. ఇప్పుడుగట్లనే అనుకుంటున్నరు. కాని నా ప్రయత్నంల నేనున్న. ఇప్పటికే ఇరవైమందిని జమకట్టిన’’ 

-కరీంనగర్‌ ప్రచార సభలో కేసీఆర్‌ 

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: దేశం గతిని మార్చేందుకు.. భారతావనిని ప్రగతి పథాన నడిపేందుకు ఈ ఎన్నికల తరువాత త్వరలోనే అవసరాన్నిబట్టి జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల వైఖరి వల్లనే అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నామని.. మోదీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారే తప్ప.. అసలైన అభివృద్ధి కోసం ఆలోచించడంలేదని ఆయన దుయ్యబట్టారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో తెరాస ఎన్నికల శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. 16 స్థానాల్లో గెలుపొందడంతోపాటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామని చెప్పారు.  ‘‘ఇదే కరీంనగర్‌ గడ్డమీద నుంచి 20 ఏండ్ల కిందట తెలంగాణ తెస్త అని ఒక మాట మాట్లాడిన. ఈ బక్కోడితో ఏమైతదని ఎక్కిరించిండ్రు. గిదే చంద్రబాబు అయితే ‘మగల పుట్టి.. పుబ్బల పోతదని’ ఉద్యమం గురించి ఎగతాళిగా మాట్లాడిండు. మీరే చూస్తున్నరు కదా.. ఈ మూడు నెలల్లోనే మూడు వేల తిట్లు నన్ను తిట్టిండు. కానీ పరిస్థితి ఎట్లమారిందంటే.. తెలంగాణ వచ్చుడు కాదు.. దేశానికి ఒక మోడల్‌గా.. మార్గదర్శకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినం. మనతో పాలన చేతగాదన్నోళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నరు. కరెంటు విషయంలో మనం దేశంలోనే ఆదర్శంగ నిలబడ్డం. 

నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ స్పీచ్‌లు వింటే మైకులు పగిలిపోతున్నయి. అసలు దొంగలు ఈ ఇద్దరే. దేశాన్ని ఈ గతి చేసింది ఈ ఇద్దరే. ఈ మాట కఠినంగా ఉన్నా ఇది సత్యం. భారతదేశానికి భగవంతుడు ప్రసాదించిన వరం.. 70,000 టీఎంసీల నీళ్లు. ఇన్ని నీళ్లు మనకుంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న 40 కోట్ల ఎకరాల భూమికి అందించలేకపోతున్నరు. ప్రధానమంత్రి చౌకీదార్‌ కాదు దొంగ అని రాహుల్‌గాంధీ అంటడు.. తల్లికొడుకులు జమానాత్‌మీద బయట తిరుగుతున్నరని ప్రధానమంత్రి అంటడు. ఇది చీప్‌ దందా.  ఇప్పటికీ సగం భారతదేశం చీకట్లనే ఉంది. దేశానికి ఇదేమి దౌర్భాగ్యం? 18 రాష్ట్రాల్లో భయంకరమైన పరిస్థితి. ఈ దిక్కుమాలిన పార్టీలకు సంపాదన పెంచే తెలివిలేదు. ఈ దిక్కుమాలినోళ్ల చేతుల్లో నుంచి దేశం బాగుపడాలంటే భాజపా, కాంగ్రెస్‌లను తరిమికొట్టాలె. ఇవన్నీ జరగాలంటే ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ కావాలె. 
ఈ దేశం తలరాత మార్చేందుకు ప్రధానపాత్ర పోషిస్త. 150 మంది ఎంపీలను జమచేసి దేశ రాజకీయాల్లో తెలంగాణ చోదక శక్తిగా, దిక్సూచిగా మారాల్సిన అవసరముంది. అవసరమైతే జాతీయ పార్టీని పెట్టి అందరిని ఒక్కటి చేస్త. దేశానికి నా సేవలు అవసరం కాబట్టి దేశాన్ని ప్రభావితం చేయడానికి నా చివరి రక్తం బొట్టు వరకు కష్టపడత. కాంగ్రెస్‌, భాజపా ముక్త భారత్‌ కావాలె’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు