close

ఆంధ్రప్రదేశ్

ప్రథమ లోక్‌పాల్‌గా జస్టిస్‌ పి.సి.ఘోష్‌!

దిల్లీ: దేశ ప్రథమ లోక్‌పాల్‌గా నియామకానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ పేరు పరిశీలనలో ఉందని అధికారవర్గాలు తెలిపాయి. 
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017లో పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యునిగా కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎంపిక సంఘం ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 
ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. 
పి.సి.ఘోష్‌ కోల్‌కతాలో పేరు ప్రఖ్యాతులు ఉన్న దివాన్‌ బనారసీ ఘోష్‌ కుటుంబానికి చెందిన అయిదో తరం న్యాయవాది. ఆయన పూర్వీకుడు హరచంద్ర ఘోష్‌ కోల్‌కతాలో బ్రిటిష్‌ వారు నెలకొల్పిన సదర్‌ దివానీ అదాలత్‌కు 1876లో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తండ్రి శంభు చంద్ర ఘోష్‌ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1976లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్‌ పి.సి.ఘోష్‌ 1997లో ఆ హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యారు. 2012లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయి, అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2013 మార్చిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడ దాదాపు  నాలుగేళ్లు పనిచేసిన అనంతరం 2017 మే నెలలో పదవీ విరమణ చేశారు. అదే ఏడాది జూన్‌ 29 నుంచి మానవ హక్కుల సంఘం సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. 
అన్నా హజారే హర్షం 
ప్రథమ లోక్‌పాల్‌ నియామకానికి ఏర్పాట్లు జరుగుతుండడంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌ను నియమించాలంటూ గత 48 ఏళ్లుగా సాగుతున్న ప్రజా ఉద్యమం దీంతో సాకారం దాల్చనుందని తెలిపారు. ఆయన కూడా జాతీయస్థాయిలో పలు ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేయడం గమనార్హం.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు