close

ఆంధ్రప్రదేశ్

పదింటికి నోటిఫికేషన్‌.. 

11 గంటల నుంచి నామినేషన్లు 
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు 
సీఈవో గోపాలకృష్ణ ద్వివేది

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి: సోమవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని తెలిపారు. నామినేషన్ల దాఖలు, ఆ తర్వాత పాటించాల్సిన నిబంధనల గురించి అన్ని పార్టీలు, అభ్యర్థులకు ఇప్పటికే అవగాహన కల్పించామని ఆయన వివరించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో గోపాలకృష్ణ ద్వివేది ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడారు. ‘‘ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకుంటున్నాం. ఉల్లంఘించిన వారికి నోటీసులిస్తున్నాం. వివరణ ఇవ్వాలని ఆదేశిస్తున్నాం’’ అని వివరించారు. ఇప్పటివరకూ రూ.ఏడుకోట్ల ఖరీదైన మద్యాన్ని, రూ.35కోట్ల నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఓటు నమోదుకు భారీగా దరఖాస్తులు వచ్చినందున రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ద్వివేది వివరించారు. ‘‘1400 మంది కన్నా ఎక్కువ ఓటర్లుండే బూత్‌ల పరిధిలో కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తాం. ఓటర్లు పెరిగే అవకాశం ఉన్నందున ఒక్కో జిల్లాకు కనీసం 100 నుంచి 200 పోలింగ్‌ కేంద్రాలు పెరుగుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంపై ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని ద్వివేది వివరించారు. 
31లోగా ఓటరు గుర్తింపు కార్డులు 
కొత్తగా నమోదైన ఓటర్లకు ఈ నెల 31వ తేదీ లోగా గుర్తింపు కార్డులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్‌ సమయంలో ఓటర్లు తమ గుర్తింపును రుజువు చేసుకునేందుకు వీలుగా ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. లేనిపక్షంలో పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డులు, పాన్‌కార్డు, ఉపాధిహామీ గుర్తింపు కార్డు, ఫొటో ఉన్న పింఛను పత్రం, బ్యాంకు, పోస్టాఫీస్‌ జారీ చేసిన పాస్‌ పుస్తకం, ఆధార్‌ తదితర గుర్తింపు కార్డుల్లో ఒక దాన్ని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ అధికారిక గుర్తింపు కార్డులు చూపించవచ్చని పేర్కొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు