close

ఆంధ్రప్రదేశ్

యుద్ధానికి అంతా సిద్ధం 

ఈనాడు - అమరావతి

ఎన్నికల సమరం మొదలైంది.. 
ప్రజాస్వామ్య క్షేత్రంలో హోరాహోరీ రాజకీయ పోరు ఆరంభమైంది. ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా.. విమర్శ ప్రతివిమర్శలు.. వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎత్తులు పైఎత్తులతో పాచికలు వేస్తూ ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా సాగే ‘ఓట్ల’ సంగ్రామమిది. 
ఓటరు మహాశయుణ్ని ఆకట్టుకుని నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాలని ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో సర్వం సిద్ధమయ్యాయి. అర్థ బలం, అంగ బలాలే ఆయుధాలుగా అధికార,  ప్రతిపక్షాలు బలమైన అభ్యర్థుల్ని ఎన్నికల క్షేత్రంలో సిద్ధం చేశాయి. బరిలో ఎన్నో పార్టీలు ప్రతినబూనుతున్నా.. పోరు మాత్రం అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షం వైకాపా మధ్యే సాగనుంది. కోణం ఏదైనా, ఏ మార్గంలోనైనా ప్రత్యర్థిని దెబ్బకొట్టి పీఠమెక్కటమే ధ్యేయంగా పార్టీలు పోరుకు దిగుతున్నాయి. వామపక్షాలు, బీఎస్‌పీల దన్నుతో పోటీ ఇవ్వాలని జనసేన రంగంలోకి దిగుతోంది. ఇక కాంగ్రెస్‌, భాజపాలు ఎలాగైనా ఉనికి చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 
‘సమయం లేదు మిత్రమా..!!’ అనేందుకు కూడా తీరిక లేని సమయమిది. పోరు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా .. ఉత్కంఠభరితంగా మారిపోతున్నాయి. 


పోరు ముంగిట రాజకీయ కాక 
గతంలో ఏ ఎన్నికల్లో చూడనటువంటి రసవత్తర రాజకీయ చిత్రాలు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆవిష్కృతమవుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడిన కొద్దీ తెరపైకి వస్తున్న ఒక్కో అంశం వేడిని మరింత పెంచాయి. హత్యల నుంచి కప్పదాట్ల వరకు.. ఎన్నో అంశాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. 


నెల్లూరు జిల్లా నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెదేపా తరఫున నెల్లూరు రూరల్‌ టికెట్‌ పొంది సాయంత్రం వరకు పసుపు కండువా వేసుకుని ప్రచారం చేసి.. మర్నాడు కండువా, ఇంటిపైన జెండా మార్చేయడం.. 


ఓట్ల తొలగింపు పేరిట దాదాపు 8లక్షల ఫారం-7 దరఖాస్తులు రావడం.. ఆ దరఖాస్తులు తామే చేశామని వైకాపా ప్రకటించడం.. 


‘డేటా చోరీ’ వివాదం చినికిచినికి గాలివానగా మారి అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసిన తీరు.. 


తాజాగా వైకాపా నాయకుడు, జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం రాజకీయంగా పెనుసంచలనంగా మారింది. వైకాపా, తెదేపా మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 


నవ్యాంధ్ర రథ సారథ్యం కోసం..

భవిత- బాధ్యత.. తెదేపా నినాదం.. 

త కొన్ని ఎన్నికల నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న తెదేపా.. ఈసారి ఒంటరిగా బరిలో దిగుతోంది. ‘మీ భవిష్యత్తు- నా బాధ్యత’ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబు అనుభవం, పాలన దక్షతపై భరోసా ఉంచి పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ అయిదేళ్లలో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆర్థిక వనరుల కొరత వేధిస్తున్నా.. కేంద్రం నుంచి ఆశించిన సహకారం రాకున్నా.. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగారు.  
పోలవరం ప్రాజెక్టు 63శాతం పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో రాజధాని కోసం 35 వేల ఎకరాల్ని రైతుల నుంచి స్వచ్ఛందంగా సేకరించింది. రూ.48 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నిధులకు ఇబ్బంది పడుతున్నా పింఛన్లను రూ.2 వేలకు పెంచడం, డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా రూ.20వేల ఆర్థికసాయం, నిరుద్యోగ భృతి రూ.2 వేలు వంటి ప్రజాకర్షక నిర్ణయాలు ప్రకటించారు. ఇప్పటికే 9లక్షల గృహనిర్మాణాలు పూర్తి కాగా.. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు, వెనకబడిన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, పెళ్లికానుక, అన్నదాతా సుఖీభవా.. ఇలా గత ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చుతాయన్న ధీమాలో ఉంది.  
విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో విసుగుచెంది ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. కేంద్రంలోని బలంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నారు. ఓవైపు రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తూ.. మరోవైపు జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీల్ని కాంగ్రెస్‌తో సహా ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యత భుజానికెత్తుకున్నారు. 
అభ్యర్థుల ప్రకటనలో తెదేపా దూకుడు ప్రదర్శించింది. తొలివిడతలో 126 మంది.. రెండో విడతలో 15మంది అభ్యర్థుల్ని అసెంబ్లీ స్థానాలకు ప్రకటించి ఎన్నికల ప్రచార శంఖం పూరించారు. గతానికి భిన్నంగా ఆశావహులు, నియోజకవర్గాల ముఖ్యనేతలతో చర్చించి అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలామందికి టిక్కెట్లు దక్కాయి. కొందరికి స్థానాలు మారాయి.

భాజపాది ఒంటరి పోరు

భాజపా ఒంటరిగా పోటీకి దిగుతోంది.  ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. గుంటూరు, విశాఖ సభల్లో పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వంపై ఎదురుదాడే లక్ష్యంగా ఆ పర్యటన సాగింది. కేంద్రంలో అయిదేళ్లలో అమలు చేసిన పథకాలు, రైతులకు ప్రకటించిన పెట్టుబడి సాయంతో నెగ్గుకురాగలమని భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

జనసేన.. సత్తా ఎంత..?

2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించారు పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో తెదేపా-భాజపా కూటమికి మద్దతు ఇచ్చారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. సినీ నటుడిగా తనకున్న ఇమేజ్‌, యువతలో ఉన్న అభిమానం, కొన్ని సామాజిక వర్గాల అండతో ఈ ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమాతో పవన్‌ ఉన్నారు.  వామపక్షాలతో కలసి వివిధ రూపాల్లో గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేపట్టారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిశారు. ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారన్న విషయంలో సీపీఎం మినహా మిగిలిన రెండు పార్టీలతో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జనసేన తన అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల ప్రణాళికనూ ఆవిష్కరించింది.

ఉనికి కోసం.. హస్తం ఆరాటం..!

కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో 173 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటూ గెలవలేకపోయింది. కేవలం 2.77 శాతం ఓట్లే సాధించింది. ఈ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకు కొంత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని విస్తృత ప్రచారం చేస్తోంది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిశోర్‌చంద్రదేవ్‌, పనబాక లక్ష్మి తదితరులు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు చెదరలేదనే ధీమాతో రాష్ట్ర నాయకత్వం  ఉంది.

విజయ యాత్ర కోసం.. 


ఫ్యాన్‌ గాలి.. వేగంగా వీస్తుందా..?

ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వైకాపా ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడా మొహమాటానికి తావివ్వకుండా గెలుపుగుర్రాలను వైఎస్‌ జగన్‌ ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయించారు. అభ్యర్థుల సమర్థతను అంగ, అర్థబలాల పరంగా  బేరీజు వేసుకున్నాకే ఎంపిక చేశారు. ‘ప్రత్యేక హోదా’ కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాడింది తానేనని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే కేంద్రంలో వారికే మద్దతిస్తామని చెబుతున్నారు.  
‘నవ రత్నాలు’ పేరిట ఎన్నికల ప్రణాళికను రెండేళ్ల కిందటే జగన్‌ ప్రకటించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర సెంటిమెంట్‌పైనే జగన్‌ నమ్మకం పెట్టుకున్నారు. తన పర్యటనలో నవరత్నాలను ప్రధానంగా ప్రచారం చేశారు.  
2004 ఎన్నికలకు ముందు వైఎస్‌, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన దరిమిలా.. సెంటిమెంట్‌ పనికివస్తుందని వైకాపా భావిస్తోంది. ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి అధికారానికి చేరువ చేస్తుందన్న నమ్మకంతో ఉంది. 
ఎన్నికలకు ముందు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు జగన్‌ తెరలేపారు. అధికార పార్టీయే లక్ష్యంగా గడిచిన నెల రోజుల్లో పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహించారు. ఒకే విడతలో 175 అసెంబ్లీ స్థానాలు, రెండు విడతల్లో 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెదేపా నుంచి చేరిన వారికి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్లలో చాలా మందికి టిక్కెట్లు దక్కాయి. జగన్‌కు తెరాస నుంచి ప్రత్యక్షంగా, బీజేపీ నుంచి పరోక్షంగా వ్యూహాత్మక, రాజకీయ మద్దతు లభించడం అదనపు బలంగా మారింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు