close

ఆంధ్రప్రదేశ్

కర్ణాటకలో ఓట్లకోసం పాట్లు

మిత్రపక్షాలకు సవాలుగా మారిన పొత్తు
సమన్వయం, సయోధ్య ప్రశ్నార్థకం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కన్నడనాట జనతాదళ్‌- కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరినా ఆయా స్థానాల్లో కలసికట్టుగా ఓట్లు సాధించటం సవాలుగా మారింది. కాంగ్రెస్‌ 20, దళ్‌ ఎనిమిదిచోట్ల పోటీకి సిద్ధమయ్యాయి. ఇరుపక్షాల మధ్య సమన్వయాన్ని ఓట్లుగా మలచుకోవటం కష్టంగా మారింది. పాత మైసూరు ప్రాంతంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌, దళ్‌ ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికలను ఎదుర్కొన్నారు. హఠాత్తుగా ఆ పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయటం అంత సులభం కాదని జేడీఎస్‌ సీనియర్‌ నాయకుడు వై.ఎస్‌.వి.దత్త విశ్లేషించారు. పార్టీ ప్రచార బాధ్యులుగానూ ఉన్న ఆయన పాత మైసూరులో ఇరు పార్టీల మధ్య సయోధ్య కష్టమని భావిస్తున్నారు. మైసూరును కాంగ్రెస్‌కు కేటాయిస్తే అక్కడ పార్టీ విజయానికి దళ్‌ సహకారం ప్రశ్నార్థకంగా మారింది. అయితే, మున్ముందు అంతా సర్దుకుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రామలింగారెడ్డి ధీమా ప్రకటించారు.

భాజపాకు లాభం?
జనతాదళ్‌కు దక్కిన ఎనిమిది నియోజకవర్గాల్లో.. మండ్య, హాసనలో గెలుపుపై అనుమానాలు లేవు. మిగిలిన ఆరింటిలో తుమకూరు మినహా మిగిలిన చోట్ల భాజపా ఎంపీలున్నారు. తుమకూరులో కాంగ్రెస్‌కు, దళ్‌కు సమాన బలం ఉంది. కలసికట్టుగా సాగితే భాజపాను ఓడించడం సంకీర్ణ భాగస్వాములకు కష్టం కాకపోవచ్చు. ఉడుపి, బెంగళూరు ఉత్తర, విజయపుర, శివమొగ్గ, ఉత్తర కన్నడలో భాజపాకు ఎదురులేదు. ఇక్కడ కాంగ్రెస్‌ కూడా ఓట్లు రాబట్టుకోవటం తలకు మించిన భారం. ఈ నియోజకవర్గాల్లో దళ్‌ అభ్యర్థుల గెలుపుకష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మండ్య కూడా మొన్నటి వరకు దళ్‌ఖాతాలో సులువుగా చేరే స్థానమైనా.. సుమలత రాకతో అక్కడా శ్రమించక తప్పని పరిస్థితి తలెత్తింది. తమ మద్దతు సుమలతకేనని కొందరు కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేయటంతో దళ్‌ డోలాయమానంలో పడింది. ఆ పార్టీకి చెందిన పర్యాటకమంత్రి మహేశ్‌ స్పందిస్తూ ‘మండ్యలో కాంగ్రెస్‌ మాకు మద్దతివ్వకుంటే మిగిలిన చోట్ల కాంగ్రెస్‌కు సహకరించబోం’ అంటూ హెచ్చరించటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జేడీఎస్‌ అధినేత దేవేగౌడ తుమకూరు, బెంగళూరు ఉత్తరలో ఏదొకచోట పోటీచేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల లెక్కలు మిత్రపక్షాలను ఏ దరికి చేరుస్తాయో వేచి చూడాల్సిందే.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు