close

ఆంధ్రప్రదేశ్

జనసేన,బీఎస్పీ,వామపక్షాలు కూటమిగా బరిలోకి 

ఏపీలో బీఎస్పీకి 21 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలు 
సీపీఐ, సీపీఎంలకు ఏడేసి శాసనసభ, రెండేసి లోక్‌సభ స్థానాలు 
3 చోట్ల మాయావతితో కలిసి ప్రచార సభలు 
జనసేన అధ్యక్షుడు పవన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: జనసేన, బీఎస్పీ, వామపక్షాల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. ఆదివారం బీఎస్పీ, సీపీఐ, సీపీఎం నేతలతో జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఎన్నికల పొత్తుపై వారు ఓ నిర్ణయానికొచ్చారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున శాసనసభ, రెండేసి లోక్‌సభ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. తెలంగాణలో బీఎస్పీ, తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది త్వరలో తేలుస్తామని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం బీఎస్పీ, జనసేన నాయకులు సమావేశమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చిన బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్‌సింగ్‌, పార్టీ ఏపీ అధ్యక్షుడు ఆర్డీ మల్లికార్జున్‌, సమన్వయకర్త చిట్టిబాబులతో తొలుత జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, మాదాసు గంగాధరం చర్చించారు. తర్వాత పవన్‌కల్యాణ్‌తో చర్చించి స్థానాల సంఖ్యను ఖరారుచేశారు. బీఎస్పీకి బాపట్ల, తిరుపతి, చిత్తూరు లోక్‌సభ స్థానాలను కేటాయించారు. శాసనసభ స్థానాల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. 
పదేళ్ల క్రితం నుంచే ఆ భావజాలం.. 
2008 నుంచే బీఎస్పీ పట్ల తనకు సానుకూల భావాలున్నాయని, అప్పట్లో తనను బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని కోరారని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. బీఎస్పీతో పొత్తు వల్ల ఇప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. మాయావతి వంటి ఉన్నత వ్యక్తిని ప్రధానిగా చూడాలని కోరుకునే వారిలో తానూ ఒకడినని పవన్‌ వెల్లడించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామన్నారని, ఎందుకది జరగలేదో తెలియదు కానీ మాయావతిని ప్రధానిగా చూడాలని జనసేన కోరుతోందని అన్నారు. లఖ్‌నవూ వెళ్లి మాయావతిని కలిసిన సందర్భంలో ఆమె ప్రేమాభిమానాలు పంచారని, ఆమె తనకు మాతృమూర్తితో సమానమని పవన్‌ అన్నారు. ఆమెతో సమావేశమైనప్పుడు ఎన్ని సీట్లనే అంశానికి బదులు దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపైనా చర్చించామన్నారు. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, తాను కలిసి అమలాపురం, తిరుపతి, హైదరాబాద్‌లలో ఎన్నికల సభల్లో పాల్గొంటామని ప్రకటించారు. 
ఇక్కడా సామాజిక మార్పు అవసరముంది: బీఎస్పీ 
తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మార్పు రావాల్సిన అవసరం ఉందని బీఎస్పీ ఎంపీ వీర్‌సింగ్‌ అన్నారు. మాయావతి, పవన్‌ మధ్య పొత్తు కుదిరిన మార్చి 15 శుభదినమని, ఆ రోజు కాన్షీరాం జయంతి అని చెప్పారు. సామాజిక మార్పునకు పవన్‌కల్యాణ్‌ పోరాడుతున్నారన్నారు. పవన్‌ ఏపీ ముఖ్యమంత్రి కావాలనేది మాయావతి ఆకాంక్ష అని చెప్పారు. తెలుగురాష్ట్రాల్లోని బహుజనులు, ఇతర ప్రజలంతా జనసేనకు, బీఎస్పీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

పొత్తులో భాగంగా వామపక్షాలు పోటీ చేసే స్థానాలివి 
(సీపీఎంకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలు)

కురుపాం (విజయనగరం) 
అరకు (విశాఖపట్నం) 
రంపచోడవరం (తూర్పుగోదావరి) 
ఉండి (పశ్చిమగోదావరి) 
విజయవాడ సెంట్రల్‌ (కృష్ణా) 
సంతనూతలపాడు (ప్రకాశం) 
కర్నూలు (కర్నూలు) 
లోక్‌సభ సీట్లు 
కర్నూలు 
నెల్లూరు 
సీపీఐ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు 
పాలకొండ (శ్రీకాకుళం) 
ఎస్‌.కోట (విజయనగరం) 
విశాఖపట్నం పశ్చిమ 
నూజివీడు (కృష్ణా జిల్లా) 
మంగళగిరి (గుంటూరు) 
కనిగిరి (ప్రకాశం) 
డోన్‌ (కర్నూలు) 
సీపీఐ లోక్‌సభ స్థానాలు 
అనంతపురం 
కడప 


మూడో రాజకీయ శక్తి 

ఆదివారం రాత్రి పవన్‌కల్యాణ్‌, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు మధు, రామకృష్ణలు సమావేశమయ్యారు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ధనవంతులే చట్టసభలకు వెళితే అణగారిన వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. వైకాపా, తెదేపా గుత్తాధిపత్య రాజకీయాలను దెబ్బతీయాలన్న  లక్ష్యంతోనే కూటమి పక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా పోరాడతాయని సీపీఎం కార్యదర్శి మధు చెప్పారు. మూడో రాజకీయ శక్తిని ఆవిష్కరించేందుకు బలంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ జనసేన, బీఎస్పీ, వామపక్ష కూటమి ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళుతోందని తెలిపారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు