close

ఆంధ్రప్రదేశ్

ఈ ఎన్నికలతో రాజకీయం ముగించాలనుకున్నా 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్వేగానికి లోనయ్యారు.. 40 ఏళ్లకు పైబడిన తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 2019 ఎన్నికలతో రాజకీయ జీవితం ముగించి.. 2020 నాటికి దిల్లీ ఖాళీ చేయాలని భావించినట్లు తెలిపారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రమేయం లేకుండా, మాట్లాడకుండా, కనపడకుండా ఉండాల్సి రావడం తనను ఉద్వేగానికి గురి చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌ పొందిన తొలి భారతీయుడు వెంకయ్యనాయుడికి పలువురు మిత్రులు జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఆదివారం ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేటి రాజకీయాలు, ఉగ్రవాదం, భారతదేశ ప్రగతి తదితర అంశాలపై మాట్లాడారు. ‘‘ఈ రోజుల్లో డాక్టరేట్‌ అంటే గతంలో మాదిరిగా గౌరవం లేదన్న భావన సమాజంలో ఉంది(ఉపరాష్ట్రపతిగా నేను మాట్లాడకూడదనుకంటా)... అందువల్ల చాలా వాటిని తిరస్కరించాను. ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి లభిస్తున్న ఈ గౌరవం ప్రపంచానికి, భారతీయులకు వెళ్లాలనే ఆలోచనతో స్వీకరించా’ అని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, భాజపాలో వివిధ హోదాల్లో ఒళ్లు ఒంచి పనిచేయడం వల్లనే ఈ స్థితికి వచ్చానని ఆయన వెల్లడించారు. ఉపరాష్ట్రపతి పదవి అంటే దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తొలుత మిశ్రమ స్పందన వచ్చిందని, బాధ్యతలు స్వీకరించిన తరువాత తనలోనూ మిశ్రమ ఆలోచనలు కలిగాయని చెప్పడానికి ఇబ్బంది లేదన్నారు. వాస్తవానికి తాను ఈ పదవి కోరుకోలేదన్నారు.ప్రత్యామ్నాయం లేక పార్లమెంటరీ బోర్డు తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని, దీంతో క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా స్వీకరించానన్నారు. తాను రాజకీయాల్లో లేకపోవడం మంచిదైందని గత రెండు, మూడు నెలలుగా చాలామంది అంటున్నారు... కొందరు నేతలు ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం మరో పార్టీ, రాత్రి ఇంకోపార్టీ జెండా పట్టుకుంటున్నారని ... ఈ రాజకీయం ఏంటని జనం వ్యాఖ్యానిస్తున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 
‘ఎన్నికల్లో వ్యక్తుల గుణగణాలను చూసి, పార్టీల గత చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలని.. కులం, ధనం, మతం ప్రాధాన్యతల నుంచి బయటపడాలన్నారు. హామీలు ఆకాశాన్ని దాటుతున్నాయని... 2022లో మనిషిని అంతరిక్షంలోకి పంపేలా ఉన్నారన్నారు. పార్టీలు ఎన్నికల ప్రణాళికలను ప్రకటించే సమయంలో నిధుల సమీకరణ, ఉన్న అప్పులు, సాధ్యాసాధ్యాలు, కార్యాచరణ తదితర అంశాలను.. విధానాలను ప్రజల ముందు పెట్టాలన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు