close

ఆంధ్రప్రదేశ్

తమిళనాట వాడీ వేడీ

అభ్యర్థుల జాబితాలను వెల్లడించిన అన్నాడీఎంకే, డీఎంకే

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలతోపాటు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ఆదివారం ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఉదయం నుంచి రాత్రి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకత్వంలోని కూటములు నియోజకవర్గాలు, అభ్యర్థుల ఖరారు కార్యక్రమాలతో ఎన్నికల ఊపు పెంచాయి.

అన్నాడీఎంకే జోరు
ఆదివారం ఉదయం  నియోజకవర్గాల జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే.. రాత్రికి 20 లోక్‌సభ , 18 శాసనసభ ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఉదయం ముఖ్యమంత్రి పళనిస్వామి (పార్టీ సంయుక్త సమన్వయకర్త), ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (పార్టీ సమన్వయకర్త) కూటమి పోటీ చేసి స్థానాల జాబితాను విడుదల చేశారు. ఇందులో భాజపాకు  కన్యాకుమారి, శివగంగై, కోయంబత్తూరు, రామనాథపురం, తూత్తుకుడి నియోజకవర్గాలు కేటాయించారు. ఇదివరకే డీఎంకే పోటీ చేసే స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత అన్నాడీఎంకే జాబితా మేరకు ఈ రెండు పార్టీలు 8 చోట్ల ప్రత్యక్షంగా పోటీ పడనున్నాయి. 18 శాసనసభ ఉప ఎన్నికలకు దరఖాస్తు చేసుకున్న ఆశావహులతో అన్నాడీఎంకే అధిష్ఠానం ముఖాముఖి నిర్వహించింది.

వేగం పెంచిన డీఎంకే
ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా వేగం పెంచింది. ఇప్పటికే కూటమి పార్టీలు బరిలో నిలిచే నియోజకవర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఆదివారం తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా (నీలగిరి), కనిమొళి (తూత్తుకుడి), కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్‌ (దక్షిణ చెన్నై), టీఆర్‌ బాలు (శ్రీపెరుంబుదూర్‌)కు చోటు దక్కింది. తమిళనాడులో 39, పుదుచ్చేరిలో ఒకటి కలిపి మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ... మిగతా నియోజకవర్గాలను కూటమి పార్టీలకు కేటాయించడం గమనార్హం.

మాజీలనే అభ్యర్థులుగా.. ఏఎంఎంకే
అన్నాడీఎంకే చీలిక వర్గమైన ఏఎంఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ కూడా తన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. లోక్‌సభకు 24, శాసనసభ ఉప ఎన్నికలకు 9 మందితో కూడిన జాబితా విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామికి ఇచ్చిన మద్దతు వెనక్కు తీసుకుంటున్నట్టు గవర్నర్‌కు లేఖలు సమర్పించి ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన ‘మాజీ’లనే ఆయన శాసనసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులుగా ప్రకటించడం గమనార్హం.

డీఎంకేకు 2014నాటి ఫలితాలే: అళగిరి
ఈ లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు 2014నాటి ఫలితాలే ఎదురవుతాయని ఆ పార్టీ బహిష్కృత నేత, కేంద్ర మాజీ మంత్రి ఎం.కె.అళగిరి వ్యాఖ్యానించారు. తన రాజకీయ వైఖరి గురించి వారం తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు