close

ఆంధ్రప్రదేశ్

మంచి పాలన తెస్తాం 

జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడి

ఈనాడు అమరావతి: జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌తో కలిశానని, ఆయన ఆధ్వర్యంలో పని చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన తీసుకువస్తామని సీబీఐ పూర్వ జేడీ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. సాధారణంగా ఒకటి, ఒకటి కలిస్తే రెండు అని.. మేం ఇద్దరం కలిస్తే 11 అని, ఇద్దరం కలిసి మార్పు సాధిస్తామని వెల్లడించారు. జనసేన పార్టీ స్థాపనకు ముందే తామిద్దరం మాట్లాడుకున్నామని, కలిసి పనిచేయాలని అప్పట్లోనే అనుకున్నామని, ఇన్నాళ్లకు అది సాధ్యమయిందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు అంటే గుండె ధైర్యం, ప్రజావిధానాలపై అవగాహన ఉండేదని.. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేయాలంటే రూ.200 కోట్లు, శాసనసభకు పోటీ చేయాలంటే రూ.50 కోట్లు ఉండాలని చూస్తున్నారని పవన్‌ పేర్కొంటూ జనసేన ఈ రాజకీయాలకు పూర్తి వ్యతిరేకమని అన్నారు. జీరో బడ్జెట్‌ రాజకీయాలే తమ లక్ష్యమని ప్రకటించారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, ఆయన తోడల్లుడు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి రాజగోపాల్‌ జనసేనలో చేరారు. జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ వారి మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘జనసేన పార్టీ ఏర్పాటుకు నాలుగైదు రోజుల ముందు లక్ష్మీనారాయణ, తానూ కలుసుకుని నాటి రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నాం. జనసేనలో కలిసి పనిచేద్దామని ఆహ్వానించా. అప్పట్లో ఆయన కుటుంబ పరిస్థితుల వల్ల కుదరలేదు. ఐదేళ్ల తర్వాత ఇద్దరం కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’ అని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. లక్ష్మీనారాయణను తనకైతే రాయలసీమ నుంచి పోటీ చేయించాలని ఉందని, ఆయనతో మాట్లాడాక నిర్ణయిస్తామని పవన్‌ చెప్పారు. లక్ష్మీనారాయణ, రాజగోపాల్‌లు ఎక్కడినుంచి పోటీ చేసేది వెల్లడిస్తామని, వామపక్షాలతోనూ చర్చిస్తున్నామని చెప్పారు. 
జనసేనలోకి గంటా బంధువు 
విశాఖకు చెందిన వ్యాపారవేత్త పరుచూరి భాస్కరరావు జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన బంధువని జనసేన ప్రకటనలో పేర్కొంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులు నిర్వహించారని పేర్కొంది. విజయవాడకు చెందిన వ్యాపారి బత్తిన రాము కూడా జనసేనలో చేరారు.

పవన్‌కల్యాణ్‌ వంటి వారే మార్పు తేగలరు: లక్ష్మీనారాయణ 

సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘కొంతమందిలో జ్ఞానం ఉంటుంది. మరికొందరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటాయి. ఇంకొందరిలో జనాదరణ ఉంటుంది. ఇవన్నీ కలగలసిన వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఇలాంటివారు సమాజంలో అరుదు. అలాంటివారే మార్పు తీసుకురాగలరు’ అని అన్నారు. ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో ఒకరంటే ఒకరికి అభిమానమని చెప్పారు. జనసేన ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాలకూ భరోసానిచ్చేలా ఉందని అన్నారు. పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో పని చేస్తూ వారు తమపై పెట్టుకున్న ఆశలను చేతల్లో చూపిస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టో, సిద్ధాంతాలు, ప్రజలతో పవన్‌ మమేకమయ్యే తీరు చూసి పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఉపకులపతి రాజగోపాల్‌ ప్రకటించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు