close

ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు చేస్తున్న సాక్షి పత్రిక, టీవీలపై చర్య తీసుకోవాలి

జగన్‌ది నేరచరిత్ర
వివేకా హత్యతో ఎన్నికల్లో  లబ్ధి పొందాలని చూస్తున్నారు
కేంద్రఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారికి తెదేపా ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో తెదేపా భాగస్వామ్యం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని యత్నిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాక్షి చానల్‌, పత్రికలపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు కె.రవీంద్ర]కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్యలు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరకముందే వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంతోపాటు ‘సాక్షి న్యూస్‌ ఛానల్‌’లో గుండెపోటుతో మృతి చెందారని ప్రసారం చేశారని ఆరోపించారు. సంఘటన స్థలంలో రక్తపు మరకలను తొలగించడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సిట్‌ దర్యాప్తుపై వివేకానందరెడ్డి కుటుంబం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోగా జగన్మోహన్‌రెడ్డి మాత్రం సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండు చేయడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశం ఉన్నట్లు కనపడుతోందని ఆరోపించారు.  పోలీసు అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఈ సంఘటనలో వాస్తవాలేమిటో గమనిస్తారని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. సాక్షి పత్రిక, ఛానల్‌లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరచరిత్ర కలిగి ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అనేక హత్య కేసులతో ఆయనకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

వివేకాతో జగన్‌కు నామమాత్రపు సంబంధాలు
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి తరువాత వివేకానందరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, వివేకానందరెడ్డితో ఎంపీ పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని, ఇదే సందర్భంలో ఆయనపై జగన్మోహన్‌రెడ్డి చేయి కూడా చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌కు తాత వైఎస్‌ రాజారెడ్డి నుంచి జన్యుపరంగా ఫ్యాక్షన్‌ భావాలు ఉన్నాయన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు