close

ఆంధ్రప్రదేశ్

కమలదళప్రచారాస్త్రంగా చౌకీదార్‌

ట్విటర్‌లో ప్రధాని పేరు  ‘చౌకీదార్‌ నరేంద్ర మోదీ’గా మార్పు

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తరచూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేస్తోన్న ‘కాపలాదారే దొంగ’ అనే ఆరోపణను గట్టిగా తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) సమాయత్తమయ్యింది. ‘నేనూ కాపలాదారుడినే’ అంటూ ప్రతిజ్ఞ తీసుకోవాలని తన మద్దతుదారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మరుసటి రోజే ఈ ప్రచార కార్యక్రమాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలనాథులు నిర్ణయించారు. దీనిలో భాగంగా తమ పేర్లకు ముందు ‘చౌకీదార్‌’ అనే పదాన్ని చేర్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు తమ ట్విటర్‌ ప్రొఫైళ్లలో ఆ విధంగా పేర్లను మార్చుకున్నారు. ట్విటర్‌ ఖాతాలను చూస్తే.. చౌకీదార్‌ నరేంద్ర మోదీ, చౌకీదార్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌, చౌకీదార్‌ అమిత్‌ షా అని కనిపిస్తున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు చిన్న చిన్న వీడియో దృశ్యాలను తమ ట్వీట్లతో జత చేసి..వివిధ వర్గాల ప్రజలు పరిసరాల శుభ్రత, అవినీతి నిర్మూలన, నగదు రహితలావాదేవీలకు చేయూతనిస్తూ దేశానికి ఎలా కాపలాదారులుగా నిలుస్తున్నారో విశదీకరిస్తున్నారు. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ అయితే ‘చౌకీదార్‌ మళ్లీ రావాలి’ అని ట్వీట్‌ చేశారు.

ట్విటర్‌లో మాటల యుద్ధం
భాజపా చేపట్టిన ‘చౌకీదార్‌’ ఉద్యమాన్ని పరిహసిస్తూ కాంగ్రెస్‌ పలు ట్వీట్లు చేసింది. నీరవ్‌ మోదీ పేరుతో సృష్టించిన ఓ ఖాతా ద్వారా..‘మోదీ సాబ్‌ నా రుణాన్ని మాఫీ చేయండి’ అని అభ్యర్థిస్తున్నట్లుగా ఓ పోస్టు పెట్టారు. దీనిని తిప్పి కొడుతూ భాజపా... తమపై చురకలకు దీటుగా జవాబిస్తూ కాంగ్రెస్‌...ఇలా ట్విటర్‌ వేదికగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఎన్నికల ప్రకటనకు ముందే..
సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడక (ఈనెల పదో తేదీకి) ముందే ప్రధాని మోదీ కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా 100కు పైగా లోక్‌సభ స్థానాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. 22 రాష్ట్రాల పరిధిలో ఇవి జరిగాయని, వీటిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు, బహిరంగ సభలు ఉన్నాయని భాజపా ఒక ప్రకటనలో తెలిపింది. మేరా పరివార్‌, భాజపా పరివార్‌, విజయ్‌ సంకల్ప్‌ వంటి కార్యక్రమాలతో సుమారు 10 కోట్ల మంది ప్రజలను తమ శ్రేణులు కలిశాయని భాజపా మీడియా హెడ్‌, రాజ్యసభ ఎం.పి. అనిల్‌ బులానీ వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు