close

ఆంధ్రప్రదేశ్

అధికారుల బెదిరింపులు

ఏపీ టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మల్లేశ్వరరెడ్డి

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పన్ను కట్టాలంటూ వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఏపీ టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి అన్నారు. వాణిజ్య పన్నుల అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం విజయవాడలో వస్త్ర వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వస్త్రాలపై 2011-2013 ఏడాదికి ముందున్న పన్నును రద్దు చేస్తున్నట్టు ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కానీ అప్పటి పన్ను కట్టాలని ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంలో వస్త్ర వ్యాపారులపై ఒత్తిడి తీసుకురావద్దని, మంత్రివర్గంలో చర్చించి తగిన న్యాయం చేస్తామని, అప్పటి వరకు పన్ను కట్టాలని వ్యాపారులను కోరవద్దని అధికారులకు సూచించినట్లు గుర్తు చేశారు. ఫెడరేషన్‌ కార్యదర్శి బచ్చు ప్రసాద్‌ మాట్లాడుతూ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పన్ను చెల్లించాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో పలుచోట్ల చోటుచేసుకున్నాయని, మరొకసారి బెదిరిస్తే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ సభ్యులు వెలంపల్లి రామచంద్రరావు, ఆంజనేయులు, వల్లంకొండ ప్రసాద్‌, ఉప్పు ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు