close

ఆంధ్రప్రదేశ్

మనోహర్‌ పారికర్‌ అస్తమయం 

ఏడాదిగా అస్వస్థతతో బాధపడ్డ గోవా ముఖ్యమంత్రి 
నిజాయతీపరుడిగా ప్రశంసలు అందుకున్న నేత 
పారికర్‌ అస్తమయం 
ఏడాదిగా అస్వస్థతతో బాధపడ్డ గోవా ముఖ్యమంత్రి 
నిజాయతీపరునిగా ప్రశంసలు అందుకున్న నేత 
నేడు సంతాప దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 
రాష్ట్రపతి, ప్రధాని  ఇతర ప్రముఖుల శ్రద్ధాంజలి 
పనాజీ

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు.  పారికర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో శనివారం ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా, మితవాద నేతగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం సోమవారం ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం సంతాపదినంగా ప్రకటించింది. దేశ రాజధానితో పాటు అన్ని చోట్లా జాతీయ పతాకాన్ని అవనతం చేయనుంది. సోమవారం సాయంత్రం పనాజీలో పారికర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

అంకిత భావానికి ప్రతీక: రాష్ట్రపతి

పారికర్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. ఆయన అంకితభావానికి ప్రతీక అని కొనియాడారు. ‘‘ప్రజాజీవితంలో అంకితభావానికి, నిజాయతీకి మారుపేరుగా మారారు. అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన సేవలను దేశంతో పాటు గోవా రాష్ట్రం ఎప్పటికీ మరచిపోవు’’ అని పేర్కొన్నారు. 

ఆధునిక గోవా నిర్మాత: మోదీ

మనోహర్‌ పారికర్‌ ఆధునిక గోవా నిర్మాత అని ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘‘నిజమైన దేశభక్తుడు, నిరుపమాన నాయకుడు, పరిపాలనా దక్షుడు. దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుంటాయి. అందుబాటులో ఉండే గుణం కారణంగా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు అయ్యారు’’ అంటూ ఆయన సేవలను గుర్తు చేశారు. 

నిజమైన దేశభక్తుడు: అమిత్‌ షా

పారికర్‌ నిజమైన దేశభక్తుడంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘‘కష్టసమయంలోనూ ‘మొదట దేశం, ఆ తరువాత పార్టీ, చిట్టచివరనే వ్యక్తిగతం’ అన్న సూత్రాన్ని విడవలేదు. తుది శ్వాస వరకు దేశానికి, పార్టీకి ఎనలేని సేవలు అందించారు’’ అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సంతాపం తెలుపుతూ సైన్యం ఆధునికీకరణకు ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు.

గోవా ముద్దుబిడ్డ: రాహుల్‌

పారికర్‌ మృతికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనను గోవా రాష్ట్ర ముద్దుబిడ్డగా అభివర్ణించారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారని, అందరి మన్ననలనూ పొందారని తెలిపారు. భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, విపక్షనేతలు సంతాపం తెలిపారు. పారికర్‌ ఐఐటీ- బొంబాయి పూర్వ విద్యార్థి కావడంతో ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ఆ విద్యాసంస్థ సంతాపం తెలిపింది. 2017లో ఐఐటీ- బొంబాయి 55వ స్నాతకోత్సవంలో పాల్గొన్న పారికర్‌ బోధనా రంగంలోకి వచ్చి నాణ్యమైన విద్యను అందించాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

పిలిస్తే పలికే నేత

చిన్నతనంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా చేరి, కేంద్రమంత్రి వరకు ఎదిగిన పారికర్‌  తన జీవన ప్రస్థానంలో అడుగడుగునా అంకితభావం ప్రదర్శించారు. మన పొరుగునే ఉంటారేమో అన్న భావం కలిగేలా పిలిస్తే పలికే నేతగా ఖ్యాతి గడించారు. ఒక్క భాజపాలోనే కాదు, ఇతర పార్టీల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇదే ఆయనకు విపత్తు పరిష్కారకర్త అన్న పేరును సంపాదించిపెట్టింది. కాంగ్రెస్‌ కంచుకోటలాంటి గోవాలో భాజపా బలపడడానికి కారణభూతమయింది.  
1955 డిసెంబరు 13న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పారికర్‌ పాఠశాల దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ముంబయి ఐఐటీలో మెటలర్జీలో ఇంజినీరింగ్‌ను చదివినప్పుడు కూడా ఆ అనుబంధాన్ని వీడలేదు. ఖాకీ నిక్కరు ధరించి, లాఠీ పట్టుకొని వార్షిక ‘సంచాలన్‌’లో పాల్గొనడాన్ని గర్వంగా భావించి ఫొటోలు తీసుకునేవారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ బోధనలను తాను మరువలేదనీ వాటి ప్రభావం తగ్గలేదని ఆయన అంటూ ఉండేవారు. భారత సైన్యం జరిపిన మెరుపుదాడులకు ఈ బోధనలే కారణమని ప్రకటించారు కూడా.

రాజకీయ దురంధరుడు

గోవాలో ప్రాంతీయ పార్టీ అయిన మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజీపీ) ప్రాబల్యం అధికంగా ఉన్న సమయంలో దాన్ని అడ్డుకట్టవేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న పారికర్‌ను భాజపా రంగంలోకి దించింది. తొలిసారిగా 1994లో పనాజీ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999 జూన్‌ నుంచి నవంబరు వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.  
2000 అక్టోబరు 24న తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పదవీ కాలం 2002 ఫిబ్రవరి 27 వరకే కొనసాగింది. 2002 జూన్‌ 5న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆధిక్యం లేక 2005 జనవరి 29న పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రతాప్‌సిన్హ్‌ రాణె ముఖ్యమంత్రి అయ్యారు. 2007లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు తగినంత మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన దిగంబర్‌ కామత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో మళ్లీ పుంజుకున్నారు. ఆ ఎన్నికల్లో భాజపాకు మొత్తం 40 స్థానాలకుగానూ 21 దక్కడం విశేషం. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ హవా కొనసాగింది. ఆ ఎన్నికలకు ముందు గోవాలో జరిగిన భాజపా సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును ప్రతిపాదించింది పారికరే కావడం విశేషం. ప్రధానికిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు తగిన మెజార్టీ రాకపోవడంతో తిరిగి రాష్ట్రానికి వచ్చి గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎంజీపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చివరివరకు సమర్థతను నిరూపించుకున్నారు.

తుది క్షణం వరకు ప్రజాసేవలోనే..

తీవ్ర అనారోగ్యానికి గురయినప్పటికీ పారికర్‌ తుది శ్వాస వరకు ప్రజాసేవలోనే జీవితాన్ని గడిపారు. 2018 ఫిబ్రవరిలో క్లోమ గ్రంధి చికిత్స నిమిత్తం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. అనంతరం మార్చి మొదటి వారంలో అమెరికా వెళ్లి జూన్‌ వరకు అక్కడి ఆసుపత్రిలో ఉన్నారు. జులై 19 నుంచి ఆగస్టు 3 వరకు జరిగిన అసెంబ్లీ శీతకాల సమావేశంలో పాల్గొన్నారు. రెండో విడత చికిత్స కోసం ఆగస్టు 10న అమెరికా వెళ్లి తిరిగి ఆగస్టు 22న వచ్చారు. సెప్టెంబరు 15న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి నెల రోజుల పాటు చికిత్స పొందారు. అక్కడ నుంచే అధికారిక కార్యక్రమాలను నిర్వహించారు. రెండున్నర నెలల విరామం తరువాత ఈ ఏడాది జనవరి 2న ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. జనవరి 27న మండోవి నదిపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జనవరి 29 నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మరుసటి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన జనవరి 31న తిరిగి దిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో చేరారు. ఫిబ్రవరి 9న అమిత్‌ షాతో కలిసి బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. చివరి రోజుల్లో ప్రయివేటు నివాసంలో ఉంటూ గోవా వైద్య కళాశాలలో చికిత్స పొందారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు