close

ఆంధ్రప్రదేశ్

నిర్దిష్ట చిరునామాల్లేకుండా ఓటు దరఖాస్తులు

తెలంగాణ నుంచి రప్పించి ఓటర్లుగా చేరుస్తున్నారు..
తెదేపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘తెలంగాణ నుంచి కొంతమందిని రప్పించి ఇక్కడ ఓటర్లుగా చేర్పించే పనులు చేస్తున్నారు. నిర్దిష్టమైన చిరునామాలు కూడా ఇవ్వడం లేదు. భారతీ సిమెంట్‌, పత్రికా సంస్థ వ్యాన్లలో డబ్బు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా కార్యకర్తలకు సూచించారు. ఈ డ్రామాలన్నీ తెరాస ఆడిస్తోందని ధ్వజమెత్తారు. మిషన్‌ 150 ప్లస్‌ టెలికాన్ఫరెన్స్‌లో భాగంగా ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది లక్షల ఓట్లు తొలగించేందుకు వైకాపా కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓటు ద్వారా అరాచక శక్తుల్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రాన్ని మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఎవరికీ రక్షణ లేదు. కరడుగట్టిన నేరగాళ్లకు ఓటేస్తే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది’ అని స్పష్టం చేశారు. చిన్నాన్న హత్యను రాజకీయం చేస్తున్న దగాకోరులు వీరని దుయ్యబట్టారు. వీరిపై నమ్మకం లేకనే తానొచ్చేదాకా పోస్టుమార్టం చేయొద్దని కుమార్తె కోరారని చెప్పారు. హిందూజా కేసు గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

అయారాం.. గయారాంలున్నారు
అన్యాయం జరిగినా, కష్టాలొచ్చినా నిజాయతీపరులే పార్టీతో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరైన బాపిరాజుకు న్యాయం చేస్తానని హామీనిచ్చారు. కొంతమంది స్వార్థపరులు తెదేపాను ఉపయోగించుకొని మళ్లీ వెళ్లిపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో పరపతి లేకపోయినా ఎన్నికల్లో నిలిచేందుకు అటూఇటూ పారిపోతున్నారని విమర్శించారు. వారు తెదేపాలో ఉన్నపుడు పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదని వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు