close

ఆంధ్రప్రదేశ్

98 లక్షల మంది చెల్లెమ్మలే అండ 

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆయుధాలు 
కార్యకర్తలే పార్టీకి రక్ష 
యుద్ధం ఏదైనా గెలుపు తెదేపాదే 
ఎవరెన్ని కుట్రలు చేసినా  ఏమీ చేయలేరు 
హత్యా రాజకీయాలు చేయం 
పార్టీ గెలుపు చరిత్రాత్మక అవసరం 
కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబు వ్యాఖ్యలు 

న్నికల కదన రంగానికి కార్యకర్తలను తెదేపా సన్నద్ధం చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ఆయుధాలనిచ్చి రంగంలోకి దింపుతోంది. ఎన్ని యుద్ధాలొచ్చినా తెదేపాదే విజయమని, 65 లక్షల మంది కార్యకర్తల సైన్యమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొంటోంది. మోదీ, కేసీఆర్‌, జగన్‌ లాంటివారు ఎన్ని కుట్రలు చేసినా తెదేపానే గెలుస్తుందని, జగన్‌లా హత్యా రాజకీయాలు చేయబోమని స్పష్టం చేస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో మాట్లాడారు. ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ నినాదంతో వారిని ఉత్తేజపరిచారు. కేసీఆర్‌ అంటే జగన్‌కే భయమని, తనకేం భయం లేదని స్పష్టం చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తెదేపాకే ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ సభల్లో ఏం మాట్లాడారంటే..

యుద్ధానికి వెళ్లాలంటే ఆయుధాలు అవసరం. మన పథకాలే మనకు పదునైన ఆయుధాలు. వాటితో మనం ధైర్యంగా ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడగొచ్చు. 

- విశాఖలో...

రాష్ట్రంలో తెదేపా గాలి ఉద్ధృతంగా వీస్తోంది. మనల్ని ఎవరూ ఆపలేరు. మనం చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చేశారా..? వేరే వారికి ఓటు అడిగే హక్కుందా..? 

- కాకినాడలో...

వైకాపా నేతలు ముందు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి తరువాత బందిపోట్లలా దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వారిని మన రాష్ట్రంలోకి రానిస్తామా?

  - విజయనగరంలో...

ప్రపంచమంతా తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. మనపై నమ్మకంతో వారొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అదే కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు చేసే జగన్‌ అధికారంలోకి వస్తే ఎవరైనా నమ్ముతారా? 

- భీమడోలులో...

ఏ యుద్ధంలోనైనా గెలుపు తెదేపాదే..

ఈనాడు, విశాఖపట్నం: మోదీ, కేసీఆర్‌, జగన్‌ జగత్‌ కిలాడీలని, తెదేపాను ఓడించేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అవకాశమున్నప్పుడల్లా వారు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జగన్‌ భయపడొచ్చేమోగానీ తాను కాదని స్పష్టం చేశారు. వైకాపా ఫ్యాన్‌కు హైదరాబాద్‌లో స్విచ్‌ ఉందని, దిల్లీ నుంచి కరెంటు రావాలని, అటువంటి ఫ్యాన్‌ను రాష్ట్రంలో తిరగనివ్వకూడదని విశాఖ సభలో పిలుపునిచ్చారు. 
‘ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబులా పని చేయాలి. రాష్ట్రంలో 65 లక్షల మంది కార్యకర్తలు 65 లక్షల మంది చంద్రబాబులతో సమానం. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవంతో ముందుకెళ్తే నేను ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నా. తెదేపా సైన్యం ఎన్నికల్లో పెను తుపాను సృష్టించి వైకాపాను చిత్తుగా ఓడించాలి. తెదేపా ఒక చరిత్ర ఉన్న పార్టీ. మంచి సమయంలో దీనిని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. 98 లక్షల మంది చెల్లెమ్మలు నాకు అండగా ఉన్నారు. అన్నగా నాకు ఇది సంతోషాన్ని కలిగిస్తోంది. కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే అన్ని స్థానాల్లో మనమే గెలుస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో 25 ఎంపీ స్థానాలు, అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందాలి. ఇందుకు ప్రతి కార్యకర్త పోరాటానికి సిద్ధం కావాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

హత్యా రాజకీయాలు మనకొద్దు 
వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనే


 

ఈనాడు, విజయనగరం: ‘వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనే. ఇలాంటి హత్యా రాజకీయాలు మనకొద్దు. రాష్ట్ర అభివృద్ధే మనకు ముద్దు..’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఎన్నికల యుద్ధానికి వెళ్లేటప్పుడు సర్వశక్తుల్ని కూడగట్టుకోవాలి. అన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి. అభ్యర్థుల ఎంపికలో నేను రాగద్వేషాలకు తావివ్వకుండా ఐవీఆర్‌ఎస్‌, అభ్యర్థి పనితీరు ఆధారంగా శాస్త్రీయంగా సమర్థులకే పట్టం కట్టా. ఈ ఎన్నికల్లో కనీసం 150+ సీట్లు గెలిపించాలి’ అని విజయనగరం సభలో ఆయన పిలుపునిచ్చారు. ‘అనుమానం లేదు గెలుపు తెదేపాదే. మనకు కావాల్సింది డబ్బులు కాదు ప్రజాసేవే. వైకాపాలో అభ్యర్థుల ఎంపికకు వేలం పెట్టారు. ఒకసారి పోటీ చేసినవాళ్లు రెండోసారి చేయరు. జేబులు ఖాళీ అయిపోయి దివాళా తీస్తారు. ఒకరు రూ.5 కోట్లు, ఇంకొకరు రూ.10 కోట్లు, మరొకరు రూ.20 కోట్లు అంటే రూ.20 కోట్లు ఇచ్చిన వారికే వైకాపాలో టికెట్లిస్తారు. నేను, అశోక్‌ గజపతిరాజు 40ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చాం. ఇంత దివాళాకోరు రాజకీయం ఎప్పుడూ చూడలేదు. అది కోడికత్తి పార్టీతోనే ప్రారంభమైంది. వాళ్లు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఛిన్నాభిన్నమైపోతుంది. నేను రాష్ట్రంలో బద్ధవైరమున్న నాయకులందరినీ కలుపుకుంటూ వెళుతున్నా. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, సుజయ్‌కృష్ణ రంగారావుల కుటుంబాలతో పాటు ఇదే జిల్లాలో కిషోర్‌ చంద్రదేవ్‌, శత్రుచర్ల విజయరామరాజుల్ని కలిపా. కర్నూలులో కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిల్ని, కడపలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల్ని, అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, పరిటాల సునీత కుటుంబాల్ని ఒకటిగా చేశా. నేను అందరినీ కలుపుకొంటూ పోతుంటే జగన్‌ అందరినీ చంపుకుంటూ వస్తున్నారు. మనకు ఈ హత్యా రాజకీయాలు కావాలా? నేరస్థులు కావాలా? అలాంటి పార్టీకి ఓట్లేస్తే ధైర్యంగా నిద్రపోగలమా? వాళ్లకు అవకాశమిస్తే రాష్ట్రాన్ని మరో పులివెందులగా మార్చేస్తారు. తెలంగాణలో ఏమీ పని చేయని వ్యక్తి 85 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో మనం ఎన్ని గెలవాలి? తెదేపాకు వేసే ఓటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులంతా ప్రచార సారథులుగా మారాలి. ప్రతిపక్షానికి డిపాజిట్‌ గల్లంతయ్యేలా ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. 
పెద్ద కొడుక్కి పెద్దమ్మ ఆశీర్వాదం.. 
చంద్రబాబు విజయనగరం బహిరంగ సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జనం మధ్యలో ఉన్న విజయనగరం మండలం గాజులరేగకు చెందిన సుమారు 80ఏళ్ల వృద్ధురాలు పిన్నింటి పెంటమ్మ ఉత్సాహాన్ని చూసి ఆమెను ముఖ్యమంత్రి వేదికపైకి రమ్మన్నారు. ఆమె వచ్చి చంద్రబాబును ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఉద్వేగానికి ముచ్చటపడిన ఆయన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో 2వేల పింఛను ఇచ్చి చంద్రబాబు తనకు పెద్ద కుమారుడయ్యారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అంతా చంద్రబాబును గెలిపించాలని.. దొంగలకు ఓటేయొద్దని గట్టిగా నినదించారు. చంద్రబాబు ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపూ ఆమె విక్టరీ సింబల్‌ చూపుతూ చిరునవ్వులు చిందించారు.

కుట్రలూ కుతంత్రాలూ చేసేవారిని నమ్ముతారా? 
హిందూజా కేసులో జగన్‌ అడ్డంగా దొరికిపోయారు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ‘అలెగ్జాండర్‌ ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించడానికి కారణాలేమిటని మేధావులు ఆయనను ప్రశ్నించారు. దానికి ఆయన చెప్పిన సమాధానం... నా వెనుక 10 లక్షల మంది సైన్యం ఉందని. ఆ సైన్యంవల్లే విజయం సాధించానని. అలెగ్జాండర్‌కు 10 లక్షల మంది సైన్యముంటే నా వెనుక 65 లక్షల మంది కార్యకర్తల సైన్యముంది’ అని పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సభలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడిలా పని చేయాలని, కొండవీటి సింహం, బొబ్బిలిపులిలా మారాలని, అప్పుడు మన గెలుపును ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో 150కిపైగా సీట్లు గెలుస్తున్నాం. జగన్‌ మన డేటానే చోరీ చేస్తారు. ఆయన వస్తే మన ఆస్తులకు భద్రత ఉంటుందా? మనం ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలమా? ఇలాంటి పార్టీ మనకు అవసరమా? ఇలాంటి ప్రతిపక్షం అవసరమా? రౌడీలు, డబ్బులున్నోళ్లూ ఆ పార్టీలోకి వెళ్తున్నారు. అందరికీ ఒకరిద్దరు చెల్లెళ్లు ఉంటారు. 98 లక్షల మంది చెల్లెళ్లు ఉన్న నాయకుడిని నేను. కోడికత్తి పార్టీ వస్తే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. నాయకులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యం. చిన్నచిన్న భేదాభిప్రాయాలు మరిచిపోవాలి. మన చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తు ఉంది. భావితరాల భవిష్యత్తు ఉంది. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు. మూడు పార్లమెంటు స్థానాలు గెలిపించారు. ఈ సారి అదే పునరావృతం కావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
పార్టీలో చేరిన పలువురు నాయకులు 
కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ గంగా భవానీ, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విశ్వనాథం, ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన వలవల బాబ్జీ, భాజపా నాయకుడు పోతుల అన్నవరం భీమడోలు సభలో పార్టీలో చేరారు. వీరందరికీ కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

కాపులకు భరోసా ఇవ్వలేని జగన్‌కుఓటెందుకు వేయాలి 
వైకాపా గెలిస్తే రౌడీల రాజ్యమే..

ఈనాడు, కాకినాడ: ‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత.. మన విజయం ఖాయం.. ఘన విజయం ధ్యేయం’ అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘విజయాలు తెదేపాకు కొత్త కాదు. రాష్ట్రంలో నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వచ్చే పార్టీ మనదే. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్‌ను గుర్తుంచుకున్నట్లే.. ఇన్ని పనులు చేసిన తెదేపాను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలి. తూర్పుగోదావరి జిల్లాలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చాం. డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను మోసం చేశారు. కాపలాదారుడనని అంటున్న ఆయన నేరస్థులకు, అవినీతిపరులకు కాపలాగా ఉంటున్నారు. నా దగ్గర పని చేసిన కేసీఆర్‌ నాపైనే దాడికి చేస్తున్నారు. తెదేపాను, ఆంధ్రపద్రేశ్‌ రాష్ట్రాన్ని అగౌరవ పరిచినా, ప్రజలను కించపరిచినా వదిలిపెట్టను. కేసీఆర్‌పై అంత ప్రేమ ఉంటే జగన్‌ లోటస్‌పాండ్‌లో శాశ్వతంగా ఉండిపోవాలి. మాకెందుకు తలనొప్పి. వైకాపా వస్తే రౌడీల రాజ్యమే. తూర్పుగోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్‌ పోరాట సమయంలో గొడవలను పులివెందుల రౌడీలే చేశారు. కాపు రిజర్వేషన్‌పై హామీ ఇవ్వని జగన్‌కు కాపులు ఓట్లు ఎందుకు వేయాలి?. రాష్ట్రంలో 9 లక్షల ఓట్లు తీసేశారు. ఈ కేసుల్లో నిందితులందరినీ జైలుకు పంపుతాం.  
తెదేపాలో చేరిన హర్షకుమార్‌ 
అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ తెదేపాలో చేరారు. కాకినాడ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు