close

ఆంధ్రప్రదేశ్

అంతా .. ఏడుకొండలవాడి దయ

సాక్షాత్తూ ఆ కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకుని ఒకసారి ఆయన కటాక్షం పొందితే ఇక ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవటం తేలికని భావిస్తున్నారు నేతలు! ఇప్పుడే కాదు.. నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది. ఎన్టీఆర్‌ ప్రతిసారీ వెంకటేశ్వరుడి దర్శనం తర్వాతే ఎన్నికల పనులు మొదలుపెట్టేవాళ్లు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికలకు శంఖారావాన్ని తిరుపతిలోనే పూరించారు. ఇక విపక్ష నేత వైఎస్‌ జగన్‌  ఫిబ్రవరి 6న శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తిరుమలలో 3 రోజులుండి పోరాట యాత్రను మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవలే కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో చిరంజీవి  తన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ వేదికగా తిరుపతినే ఎంచుకోవడం గమనార్హం. నేతలు తిరుపతి నుంచి రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనేక ఇతర అనుకూలతలూ కారణంగా నిలుస్తున్నాయి. నగరం మీదుగా 6 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. రేణిగుంట, తిరుపతి రైల్వేస్టేషన్లకు దేశంలోని ముఖ్య నగరాలన్నింటి నుంచీ రైళ్లు నడుస్తున్నాయి. రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. సభలు నిర్వహించుకోవడానికి నగరంలో 3 పెద్ద, 5 చిన్న మైదానాలున్నాయి. అందుకే తిరుపతి ఆధ్యాత్మిక సౌరభాలతో పాటు రాజకీయ కీలకంగా మారింది.

- ఈనాడు, తిరుపతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు