close

ఆంధ్రప్రదేశ్

సీబీఎస్‌ఈ బడిపై మోజు!

ఏటేటా పెరుగుతున్న అనుబంధ పాఠశాలల సంఖ్య
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
నగరాల్లో ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి తల్లిదండ్రులు అధికంగా మొగ్గు
ఈనాడు - హైదరాబాద్‌

కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి(సీబీఎస్‌ఈ) అనుబంధ పాఠశాలల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాటి సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. గత ఏడు సంవత్సరాల్లో దేశంలో ఆ బడులు 71 శాతం పెరగడం విశేషం. నగరాల్లో సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో విద్యనందించే పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించేందుకు ఎగువ మధ్యతరగతితోపాటు మధ్యతరగతి కుటుంబాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు తమ పిల్లలు చదివేది సీబీఎస్‌ఈ సిలబస్‌ అని చెప్పుకోవడం ఒక హోదాగా...గొప్పగా భావిస్తుండటం కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్‌ బడులు...ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూతపడుతున్నాయి. అదే సమయంలో సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య అధికమవుతోంది. మెట్రో నగరాలతోపాటు చిన్న నగరాల్లోనూ అవి విస్తరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో సీబీఎస్‌ఈపై అవగాహన పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వాటి సంఖ్య తక్కువగా ఉన్నా వృద్ధి శాతం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఏపీలో 2016- 2018 మధ్య 28 శాతం పాఠశాలలు పెరిగి వృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌ తదితర ప్రాంతాల్లోనూ సీబీఎస్‌ఈ బడులున్నాయి. ఏపీలో ముఖ్యమైన నగరాలతోపాటు భీమవరం, ఒంగోలు తదితర చోట్లా ఏర్పాటు చేస్తున్నారు. 2011లో దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య 12,504 ఉండగా 2018-19 నాటికి 21,400కు చేరాయి. 2018 మార్చి నాటికి అత్యధిక బడులతో ఉత్తర్‌ప్రదేశ్‌ (3113) మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో దిల్లీ (2109), హరియాణా(1522), కేరళ(1341) ఉన్నాయి

ఎందుకు పెరుగుతున్నట్లు?
జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించే సిలబస్‌ను సీబీఎస్‌ఈ అనుసరిస్తుంది. అందుకే సీబీఎస్‌ఈ సిలబస్‌గా పిలుస్తారు. వాటిని కొన్నేళ్లుగా రాష్ట్రాలూ అనుసరిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగరాల్లో ఎకరం, గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఎకరాల స్థలం తప్పనిసరి. దానికి తోడు గ్రంథాలయం, ప్రయోగశాలలు లాంటి ఇతర నిబంధనలను పాటించాలి. ఆట స్థలం, భవనాలు, తరగతి గదులు ఉండటంతో బడి వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్ర, సీబీఎస్‌ఈ సిలబస్‌లు ఒకటే అయినా సీబీఎస్‌ఈ అంటే తల్లిదండ్రుల్లో ఒక మోజు ఉందని విద్యా నిపుణుడు వాసిరెడ్డి అమరనాథ్‌ చెప్పారు.
* రాష్ట్ర సిలబస్‌(ఎస్‌సీఈఆర్‌టీ)ను పాటించే పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు ఉన్నా వాటిల్లో అధిక శాతం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలున్నాయి. ఆట స్థలం, గ్రంథాలయం, ప్రయోగశాలలు లేకున్నా తరగతి గదులు ఉంటే చాలు అనుమతులు ఇస్తున్నారు. దానివల్ల బడి వాతావరణం కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
* సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చేర్పిస్తే ఆంగ్లం, హిందీ బాగా వస్తాయని, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెరుగుతాయని సీబీఎస్‌ఈ బోర్డు ఏర్పాటు నుంచి ఉన్న భావనేనని విజ్ఞాన్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ వందన చెప్పారు. ఈ రెండుమూడు సంవత్సరాల్లో ఇతర బోర్డులకు, సీబీఎస్‌ఈ బోధనకు తల్లిదండ్రులు తేడాను గమనిస్తున్నారని పేర్కొన్నారు. సిలబస్‌ ఒకటేనని, కాకుంటే ఒక పాఠం విద్యార్థులకు బాగా అర్థం కావాలంటే ఎలాంటి బోధనా పద్ధతిని వాడతారన్నదే ప్రధానమన్నారు. అందుకే సీబీఎస్‌ఈ.. ఏటా ప్రతి పాఠశాల నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుందని, అది తప్పనిసరి తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు