close

ఆంధ్రప్రదేశ్

అంతేగా.. అంతేగా..

సారెలైనా... చీరలైనా... లెక్కచెప్పాల్సిందే

లోక్‌సభా... అసెంబ్లీనా... స్థానమేదైనా సరే... ప్రస్తుతం ఎన్నికలంటేనే ‘పంపిణీ’ వ్యవహారంలా మారిపోయిందాయె. నోట్ల కట్టలయినా... చీరసారెలైనా ఇప్పటి నుంచి... సేకరించి పెట్టుకుంటే కానీ... పోలింగ్‌ ముందు రోజుల్లో పంపకాలకు వీలుకాదని కొంతమంది సేకరించి పెట్టేసుకుంటున్నారు. వివిధ మార్గాల్లో వాటిని తరలించుకుంటున్నారు. పోలీసు సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసేశారు. ఎన్నికల తాయిలాల కోసం రవాణా అవుతున్న డబ్బూదస్కాలను పట్టేసుకుంటున్నారు. సరైన ఆధారాలు చూపకపోతే పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సామాన్యులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివాహ క్రతువును ముగించుకుని కాకినాడ నుంచి విశాఖపట్టణానికి కొందరు సారె తీసుకుని కారులో బయలుదేరారు. గాజువాక దగ్గర పోలీసులు ఆ వాహనాన్ని ఆపేశారు. తనిఖీకి ఉపక్రమించారు. సారె పెట్టెతో పాటు వారి దగ్గర రూ.500, రూ.50 నోట్ల కట్టలు కనిపించాయి. అంతా కలిపి రూ.2 లక్షలని తేలింది. ఇంకేముంది పోలీసులు డబ్బుకు సంబంధించిన లెక్కాపత్రాలు చూపాల్సిందేనని పట్టుపట్టారు. తెల్లమొహాలు వేసిన పెళ్లి బృందాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి... మూడు గంటల పాటు విచారించారు. అందరి చేతా సంతకాలు చేయించుకుని, ఆ తర్వాత ఇంటికి పంపించేశారు.

అనంతపురం జిల్లా బత్తలపల్లి నుంచి  12,000 చీరలతో ఓ లారీ చెన్నై బయలుదేరింది. మార్గమధ్యంలో కడప జిల్లా బాలపల్లె తనిఖీ కేంద్రం దగ్గర పోలీసులు ఆపారు. తరలింపునకు సంబంధించిన పత్రాలను చూపమనేసరికి... లారీలో ఉన్నోళ్లు నోర్లెళ్లబెట్టేశారు. ఇంకేముంది డ్రైవరుతో పాటు వాహనంలో ఉన్న ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర రూ.1 లక్ష డబ్బు ఉండటం విశేషం. ఎన్నికలప్పుడే కాదు... ఎప్పుడైనా సరే... ఏదైనా సరే... ఎంతైనా సరే... తరలించేటప్పుడు... మీ దగ్గర సరైన పత్రాలు, రుజువులు తప్పని సరిగా ఉండాలని పోలీసులు సెలవిస్తున్నారు.

- ఈనాడు ఎన్నికల విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు