close

ఆంధ్రప్రదేశ్

మేధస్సుకు ‘స్వయం’ పదును

నూతన కోర్సుల కేంద్రం
ఓపెన్‌ స్కూల్‌ నుంచి క్లౌడ్‌ టెక్నాలజీ వరకు
ధ్రువీకరణ పత్రాలు, క్రెడిట్స్‌ పొందేందుకు అవకాశం
ఐఐటీ, ఐఐఎం, విదేశీ విశ్వవిద్యాలయాల బోధన
ఈనాడు - హైదరాబాద్‌

ెరుగైన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలంటే సంబంధిత రంగంలో నిరంతర విజ్ఞాన సముపార్జన అవసరం. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికత, కోర్సులు, అంశాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. వీటిని కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి నేర్చుకోలేని వారికోసం కేంద్ర మానవ వనరుల విభాగం ‘స్వయం’ పేరిట ప్రత్యేక ఆన్‌లైన్‌ విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి రుసుము చెల్లించకుండా ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి ఆధునిక కోర్సులు నేర్చుకునేందుకు వీలు కల్పించింది. క్రెడిట్స్‌, ధ్రువపత్రాలను సైతం మంజూరు చేస్తోంది. ‘స్వయం’ వెబ్‌పోర్టల్‌ ద్వారా ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు కోర్సులు పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

ఏమిటీ స్వయం...
బడిమానేసిన, డిగ్రీ, ఇతర ఉన్నత కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు నిరంతర విద్యలో భాగంగా
(https://swayam.gov.in) ‘స్వయం’ పేరిట ఆన్‌లైన్‌ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొమ్మిదో తరగతి నుంచి ఇంజినీరింగ్‌ చదివేవారికి అవసరమైన కోర్సులు ఉచితంగా ఇక్కడ లభిస్తాయి. ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలు వినడంతో పాటు బోధనలో ఎదురయ్యే సమస్యలను అధ్యాపకుడితో ప్రత్యేకంగా చర్చించి పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. ఐఐటీ, ఐఐఎం, ఇగ్నో లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల సహకారంతో ఉన్నత విద్య, సాంకేతిక విద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విజయవంతంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రత్యేక క్రెడిట్స్‌, ధ్రువీకరణ పత్రాలు లభిస్తాయి. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఈ కోర్సులు అదనపు అర్హతగా ఉపయోగపడుతున్నాయి. కోర్సులు పూర్తిచేసిన తర్వాత ప్రతి ఒక్కరికీ ప్రతిభ మదింపు పరీక్షలు ఉంటాయి. ఇందులో ప్రతిభచూపిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నారు.

రెండువేలకు పైగా కోర్సులు
పాఠశాల విద్య, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, న్యాయవిద్య తదితర విభాగాలకు సంబంధించి రెండు వేలకు పైగా కోర్సులు నిర్వహించేందుకు, దాదాపు 80వేల గంటల మెటీరియల్‌ అందుబాటులో ఉండేలా స్వయం వ్యవస్థను సిద్ధం చేసింది. పాఠశాల విద్య పూర్తిచేయలేని వారికోసం ఓపెన్‌స్కూల్‌ విద్య అందుబాటులో ఉంది. ఇందులో వివిధ సబ్జెక్టులపై పాఠాలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, న్యాయవిద్య, ఉపాధ్యాయవిద్య లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో నూతన అంశాలపై విజ్ఞానం పెంపొందించేలా ఐఐటీ బొంబాయి, దిల్లీ, ఐఐఎంతో పాటు రాష్ట్రస్థాయి, విదేశీ విశ్వవిద్యాలయాలు తరగతులు నిర్వహిస్తున్నాయి. కొత్తగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించేవారికి ప్రాథమిక కోర్సులు ఉన్నాయి. సాంకేతిక రంగంలో బ్లాక్‌చైన్‌, క్లౌడ్‌ టెక్నాలజీ తదితర సర్టిఫికెట్‌ కోర్సులను ఐఐటీ నిర్వహిస్తోంది. ఆయా కోర్సుల్లో చేరేందుకు కొన్ని ప్రత్యేక అర్హతలను నిర్దేశించారు.

నమోదు ఎలా....
ఈ కోర్సులను అభ్యసించేందుకు ఎలాంటి రుసుమునూ చెల్లించనవసరం లేదు. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా స్వయం పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి పేరును రిజిస్టరు చేసుకోవాలి. ఆ తర్వాత ఆసక్తి కలిగిన రంగాలను ఎంచుకోవాలి. ఎంచుకున్న కోర్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ముందుగానే సరిచూసుకుని పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్నవారికి కోర్సు ప్రారంభానికి ముందుగా ఒక సంక్షిప్త, ఈ-మెయిల్‌ సందేశం వస్తుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో పాఠాలకు హాజరుకాలేని పక్షంలో, ఆ రోజు జరిగిన తరగతి పాఠాల వీడియో అందుబాటులో ఉంటుంది. కోర్సుల నిర్వహణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత పరీక్షకు హాజరై, ఆ ఫలితాలను వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు