close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ శాస్త్రవేత్తల్లో ఆమె!

చిన్నారులకు వచ్చే అనారోగ్యాలను నిరోధించే టీకాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందామె. ఆ కష్టమే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన రాయల్‌ సొసైటీ ఫెలోకు ఎంపికయ్యేలా చేసింది. ఆమే ప్రముఖ శాస్త్రవేత్త 57 ఏళ్ల గగన్‌దీప్‌ కంగ్‌. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...

వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ అయిన గగన్‌దీప్‌ ప్రస్తుతం ఫరీదాబాద్‌, ట్రాన్సిలేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. అలాగే చిన్నారుల జీర్ణాశయానికి సంబంధించి ట్రాన్స్‌మిషన్‌ డెవలప్‌మెంట్‌, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎంటరిక్‌ ఇన్‌ఫెక్షన్‌పై పరస్పరాధారిత పరిశోధనలు చేపట్టింది. ఇన్‌ఫెక్షన్‌, గట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఫిజికల్‌, కాగ్నిటివ్‌ డెవలప్‌మెంట్‌కు మధ్య ఉండే సంబంధాలపై పరిశోధన చేస్తోంది. క్లినికల్‌ రీసెర్చికి చెందిన పలు  అంశాలపై విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. గగన్‌తోపాటు మరో 50 మంది ‘ది రాయల్‌ సొసైటీ ఫెలోస్‌’ (ఎఫ్‌ ఆర్‌ ఎస్‌)గా ఎంపికకాగా, వారిలో అయిదుగురు మనదేశ శాస్త్రవేత్తలు ఉండటం గమనార్హం. ఆ ఆరుగురిలో గగన్‌దీప్‌ కూడా ఉంది. ‘పరిశోధనా రంగంలో మహిళలకు అందే ప్రభుత్వ పథకాలను పెంచాలి. శాస్త్ర, సాంకేతిక రంగంలో మహిళల సంఖ్య తక్కువే. దీనికి కారణం సామర్థ్య లోపం మాత్రం కాదు. కేవలం శాస్త్ర సాంకేతికతపరంగా మహిళలకు అవసరమయ్యే చేయూత, ప్రోత్సాహంతోపాటు పనిచేసే వేళల్లో తగినన్ని సౌకర్యాలు లేకపోవడమే. ఈ రంగంలో మహిళల్ని ప్రోత్సహిస్తే గనుక... అద్భుతాలు సృష్టిస్తారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి... ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందుబాటులో తెస్తారు..’ అని అంటారామె.


మరిన్ని