close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అనుకున్నంత రావాలంటే... ఎంత దాచాలి?

నాకు నలభై ఏళ్లు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. నాకు నెలకు రూ.40 వేలు వస్తాయి. ఉద్యోగ విరమణ తరువాత నాకు నెలకు కనీసం రూ.40 వేల పింఛను అవసరం. ఇందుకోసం నేను ఇప్పటి నుంచే ఎలాంటి పింఛను పథకాన్ని ఎంచుకోవాలి. సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం  మీరు ఉద్యోగ విరమణ తరువాత ఏడాదికి రూ.4.80 లక్షల పింఛను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మీకు నలభై సంవత్సరాలు. మీరు ఉద్యోగ  విరమణ చేయడానికి ఇంకా 18 ఏళ్లు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మొత్తం  రూ.కోటి వరకు మదుపు చేయగలగాలి. మనిషి సగటు జీవన కాలం సుమారుగా 85 సంవత్సరాలుగా భావించినట్లయితే... ఉద్యోగ విరమణ తరువాత మరో 27 సంవత్సరాల వరకు మీరు పింఛను తీసుకోవాలి. అందుకే ఉద్యోగ విరమణ  ప్రణాళిక కింద మీరు ప్రతి నెల రూ.15,000 మదుపు చేయాల్సి ఉంటుంది.

ఏ పథకాలు ఎంచుకోవాలంటే...
మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఒకే చోట కాకుండా మూడు భాగాలుగా చేసుకుని వివిధ పథకాల్లో మదుపు చేసుకోండి. జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్‌), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌), మ్యూచువల్‌ ఫండ్లు, ఆన్యుటీ, యులిప్‌ లాంటి పథకాలను ఎంచుకోవచ్చు. వాటి ఆధారంగా రాబడి ఉంటుంది.

* పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. పన్ను మినహాయింపు లభిస్తుంది. పోస్టాఫీస్‌, బ్యాంకుల్లో సులువుగా పెట్టుబడి పెట్టొచ్చు. రాబడి 8 శాతం వరకు ఉంటుంది.
* జాతీయపింఛను పథకం- దీనికింద ఈక్విటీ, ప్రభుత్వ బాండ్లలో డబ్బు మదుపు చేస్తారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80 సీసీడీ కింద గరిష్ఠంగా యాభై వేల వరకు పన్ను రాయితీ ఉంటుంది. ఇందులో 8-10 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.

* మ్యూచువల్‌ ఫండ్లు-  ఎక్కువ రాబడి కావాలనుకుంటే మ్యూచువల్‌ ఫండ్లలో మంచి పథకాన్ని ఎంచుకోవాలి. దీని కింద 12 నుంచి 15 శాతం రాబడి రావొచ్చు.
* యులిప్‌ - ఇందులో పెట్టుబడి ప్రయోజనంతో పాటు బీమా ప్రయోజనం కూడా ఉంటుంది. ఇందులో 10 నుంచి 12 శాతం రాబడి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగ విరమణ ప్రణాళికను నిర్ణయించుకోవడంలో మీరు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. దీనివల్ల సంపద సృష్టి తగ్గిపోతుంది. మరిన్ని సందేహాలుంటే దగ్గర్లో ఉండే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.

* మీ ప్రశ్నలు ‌vasufin@eenadu.net కు పంపించగలరు.


మరిన్ని