close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బామ్మగారు... పోత్లీబ్యాగుల డిజైనరు!

నైపుణ్యం, దృఢమైన లక్ష్యం ఉండాలేకానీ మనం చేసే పనికి... వయసుకు సంబంధం లేదంటారు ఈ బామ్మ. ఆమే అసోంకి చెందిన ఎనభై తొమ్మిదేళ్ల లతికా.  అలుపెరగకుండా ఈ వయసులో కూడా ఆమె తన చేతిపనితనాన్ని చూపిస్తున్నారు. అందమైన పోత్లీబ్యాగులను తయారుచేసి అందరితోనూ వావ్‌ అనిపించుకుంటున్నారు.

లతికా అసోంలోని దుబ్రీలో జన్మించారు. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత కృష్ణలాల్‌ చక్రవర్తితో ఆమె వివాహం జరిగింది. ఆయన సర్వే ఆఫ్‌ ఇండియాలో అధికారిగా పనిచేసేవారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివశించారు. అలా వారు వెళ్లిన ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకతను గుర్తించి అక్కడి వస్త్రాలను సేకరించేవారు. ఇక, ఆ సమయంలో ఆమె తన ఒత్తిడిని తగ్గించుకునేందుకు కుట్టుమిషనునే తన ఆయుధంగా ఉపయోగించుకునేవారామె. చిన్నప్పుడు పిల్లాడికి ఆమె స్వయంగా దుస్తులు కుట్టేవారు. అతడు కాస్త పెద్దయ్యాక బొమ్మలు తయారుచేయడం మొదలుపెట్టారు. భర్త చనిపోయినా, కొడుకు నేవీలో ఉన్నతోద్యోగం చేస్తున్నా కూడా ఆమె తన కుట్టుమిషన్‌ను వదల్లేదు. ఎక్కువ సమయం దాంతోనే గడిపేవారు. నాలుగేళ్ల కిందట కోడలు సుమిత సాయంతో చిన్న చిన్న పోత్లీ బ్యాగులు తయారుచేయడం మొదలుపెట్టారు లతిక. ఆ బ్యాగులు వైవిధ్యంగా తయారుచేయడానికి ఆమె పాత చీరలు, కుర్తీలను ఉపయోగిస్తారు. ఆమె చేతిలో అవి అందమైన సంచులుగా రూపుదిద్దుకుంటాయి. తయారుచేసిన ప్రతి బ్యాగుకు ఓ పేరు పెడతారు. అలా తాను తయారుచేసిన సంచులను స్నేహితులకు, బంధువులకు కానుకగా అందిస్తుంటారు. ఇప్పటి వరకు లతిక దాదాపు మూడు వందలకు పైగా బ్యాగులను తయారుచేశారు. నాన్నమ్మ తయారుచేస్తున్న అందమైన బ్యాగులను జర్మనీలో ఉంటున్న ఆమె మనవడు జాయ్‌ చక్రవర్తి చూసి మురిసిపోవడమే కాదు వాటిని ‘లతికాస్‌ బ్యాగ్స్‌.కామ్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. ఆ చిట్టి పొట్టి పోత్లీ బ్యాగుల ధర సుమారు రూ.500 నుంచి రూ. 1500 వరకు ఉంటుంది. మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమె బ్యాగులకు ఫిదా అయ్యే వినియోగదారులున్నారు.


మరిన్ని