close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అలకలకు అడ్డుకట్ట వేద్దాం!

భార్యాభర్తలన్నాక అలకలు ఉంటాయి. కానీ అదే పనిగా... గొడవపడితే మాత్రం మీ ఇంటివాతావరణమే మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మాత్రం ఈ మార్పులకు అనుగుణంగా అడుగులు వేయాలి.

* భాగస్వామి చేసే పనులు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. మరికొన్నిసార్లు...నచ్చినా ఒప్పుకోలేకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయినంత మాత్రాన... నలుగురిలోను అరవడం, తిట్టడం సరికాదు. దీనివల్ల అందరిలోనూ చులకన అవ్వడం, మీ మధ్య మరింత దూరం పెరగడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాకాకుండా ఉండాలంటే...సమస్య ఎలాంటిదైనా ఎదుటివారు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వారు చెప్పేది విని... ఏం చేయాలనేది ఆలోచించండి.
* మీ మాటని ఎదుటివారు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారంటే...అది కొన్నిసార్లు వారి తప్పుకూడా కాకపోవచ్చు. అంత ప్రభావవంతంగా మీరు చెప్పలేకపోతున్నారేమో! వీలైతే..మీ మాటతీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చిన్న మాట చాలు...ఇద్దరి మధ్యా ఎడం పెంచడానికి. కాబట్టి మీ భావాన్ని ఓ కాగితంపై రాసి ఎదుటివారికి ఇవ్వండి. కోపతాపాలు పక్కదారి పట్టకుండా ఉంటాయి.
* మీ దృష్టిలో సరైనది అవతలివారికి కాకపోవచ్చు. దానికి కారణాలు విశ్లేషించాలే తప్ప...నీకేం తెలియదని తీసిపాడేయడం సరికాదు. అవతలివారి మాటకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనక్కర్లేదు కానీ... మీరనుకున్న విషయాన్ని భాగస్వామిని ఒప్పించడం కూడా ముఖ్యమే. అలానే వారికి ప్రాధాన్యం ఇస్తూ పనులు చేయడం వల్ల చిన్న చిన్న తగదాలు సమసిపోతాయి.


మరిన్ని