close

ఆంధ్రప్రదేశ్

వికీలీక్స్‌ అసాంజ్‌ అరెస్టు

రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్న ఈక్వెడార్‌
లండన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెయిలు షరతులను ఉల్లంఘించారని తేల్చిన కోర్టు
అమెరికాకు అప్పగించేందుకు చర్యలు ప్రారంభం

లండన్‌: వికీలీక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ను బ్రిటన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బెయిలు షరతులను ఉల్లంఘించిన అభియోగంపై ఈ చర్యను చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఏడేళ్లుగా అసాంజ్‌ ఆశ్రయం పొందుతున్న లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. బెయిలు షరతులను ఉల్లంఘించారని న్యాయమూర్తి తేల్చారు. అమెరికాకు ఆయనను అప్పగించే అంశంపై మే 2న విచారణ జరుగుతుందని తెలిపారు. అసాంజ్‌ (47) ఆస్ట్రేలియాలో జన్మించారు. రహస్య పత్రాలు, ఫొటోల ప్రచురణ ఉద్దేశంతో ఆయన 2006లో వికీలీక్స్‌ను ఏర్పాటుచేశారు. 2010లో ఆయన అమెరికాకు చెందిన రహస్య సైనిక, దౌత్య పత్రాలను వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సంచలనం సృష్టించింది. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈలోగా అసాంజ్‌పై స్వీడన్‌లో లైంగిక వేధింపుల అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై ఆయన బ్రిటన్‌లో అరెస్టయ్యారు. బెయిలుపై విడుదలయ్యారు. తనను స్వీడన్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ బ్రిటన్‌లో న్యాయ పోరాటం చేశారు. కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమెరికా రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో తనను ఆ దేశానికి అప్పగించే ప్రమాదం ఉందని, అక్కడ తనను చిత్రహింసలపాల్జేయవచ్చని, మరణ శిక్ష ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. ఈలోగా స్వీడన్‌ ప్రభుత్వం ఆయనపై కేసును ఉపసంహరించుకుంది. అయితే బెయిలు షరతులను ఉల్లంఘించారని, కోర్టు ఎదుట లొంగిపోవడానికి నిరాకరించారంటూ ఆయనపై బ్రిటన్‌ కోర్టు 2012 జూన్‌ 29న వారెంటు జారీ చేసింది. రాయబార కార్యాలయానికి దౌత్యపరమైన మినహాయింపు ఉండటంతో ఆ ప్రాంగణంలోకి పోలీసులు వెళ్లడానికి సాధ్యం కాలేదు. ఇలా ఏడేళ్లుగా ఆయన లోపలే ఉండిపోయారు. తాజాగా ఈక్వెడార్‌ ప్రభుత్వం అసాంజ్‌కు ఆశ్రయాన్ని ఉపసంహరించింది. ఆయన అరెస్టు కోసం బ్రిటన్‌ పోలీసులను తమ రాయబార కార్యాలయానికి ఆహ్వానించింది. ఈ మేరకు అక్కడి వచ్చిన పోలీసులు అసాంజ్‌ను అరెస్టు చేసి, వెలుపలికి తెచ్చారు. దీంతో ఏడేళ్ల తర్వాత ఆయన బయటి ప్రపంచానికి కనిపించారు. ఆయనకు 12 నెలల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

షరతులను ఉల్లంఘించడం వల్లే..
షరతులను, అంతర్జాతీయ ఒప్పందాలను పదేపదే ఉల్లంఘించడం వల్లే ఆయనకు ఆశ్రయాన్ని ఉపసంహరించినట్లు ఈక్వెడార్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోర్నియో చెప్పారు. ఇది తమ సార్వభౌమ నిర్ణయమన్నారు. చిత్రహింసలు, లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉన్న దేశాలకు అసాంజ్‌ను అప్పగించబోమని బ్రిటన్‌ ప్రభుత్వం తమకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని తెలిపారు. ఈక్వెడార్‌ చర్య అక్రమమని వికీలీక్స్‌ ఆరోపించింది.

కేసుపై స్పష్టత
2010లో సైనిక, దౌత్య పత్రాల భారీ లీకేజీలో అసాంజ్‌ పాత్రకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయని, దానికింద అరెస్టు వారెంటు జారీ చేసినట్లు అమెరికా న్యాయశాఖ తాజాగా తెలిపింది. ప్రభుత్వ రహస్య కంప్యూటర్‌లోకి చొరబడేందుకు కుట్రపన్నినట్లు పేర్కొంది. దీనికింద ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు అసాంజ్‌ చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతున్న స్వీడన్‌ మహిళ ఈ అరెస్టును స్వాగతించినట్లు ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తును పునఃప్రారంభించాలని స్వీడన్‌ ప్రాసిక్యూషన్‌ విభాగాన్ని కోరినట్లు వివరించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు