close

ఆంధ్రప్రదేశ్

మోదీ అజేయుడేమీ కాదు

శక్తిశాలి అయిన వాజ్‌పేయే ఓడిపోయారు: సోనియాగాంధీ
ఎన్నికల తరువాత అది రుజువవుతుంది: రాహుల్‌

రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ ఓడించలేనంత అజేయ నాయకుడేమీ కాదని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం వారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ విలేకరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ విషయం రుజువవుతుందని చెప్పారు. భారత్‌ వెలిగిపోతోందంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన 2004 ఎన్నికల్లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఓడిపోయారని గుర్తుచేశారు. ‘‘2004లో వాజ్‌పేయీ శక్తిశాలిగా ఉండేవారు. కానీ మేం గెలిచాం. దాన్ని మరచిపోవద్దు. మోదీ అంతకన్నా గొప్పవారేమీ కాదు’’ అని సోనియా అన్నారు. రాహల్‌ మాట్లాడుతూ ‘‘భారత చరిత్రలో చాలా మంది తామే ప్రజలకన్నా గొప్పవారమన్న అహంభావంతో ఉండేవారు. నరేంద్ర మోదీ గత అయిదేళ్లలో ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఎన్నికల తరువాత ఆ విషయం వెల్లడవుతుంది’’ అని చెప్పారు. రఫేల్‌లో అవినీతిపై తాను రేస్‌కోర్స్‌రోడ్‌లోని ప్రధాని అధికార నివాసానికి వెళ్లి చర్చించడానికి సిద్ధమేనని అన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక వాద్రా ట్వీట్‌ చేస్తూ ‘‘ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రజల పట్ల ఎలా అంకితభావంతో ఉండాలో మా అమ్మను చూసి తెలుసుకోవాలి. రాజకీయం అంటే ప్రజాసేవ, అంకితభావం. ఇలాంటి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రజలకు కృతజ్ఞులై ఉండాలి’’ అని తెలిపారు.

సోనియా ఆస్తులు రూ.11.82 కోట్లు
తనకు రూ.11.82 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సోనియా గాంధీ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. చరాస్తులు రూ.4.29 కోట్లు ఉన్నాయి. కుమారుడు రాహుల్‌ గాంధీకి రూ.5 లక్షలు రుణంగా ఇచ్చారు. రూ.60 వేల నగదు ఉండగా, బ్యాంకులో రూ.16.5 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పెట్టిన క్రిమినల్‌ కేసు ఆమెపై ఉంది. 2014 ఎన్నికల్లో మొత్తం ఆస్తులు రూ.9.28 కోట్లు అని పేర్కొనగా, ప్రస్తుతం పెరిగాయి.

అత్త ఇందిర నెలకొల్పిన సంప్రదాయం కొనసాగింపు
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ గురువారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఆమె ఇక్కడ నుంచి అయిదో సారి పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్‌ వాద్రా, మనుమడు, మనుమరాలు పాల్గొన్నారు. నామినేషన్ల సందర్భంగా అత్త ఇందిరాగాంధీ 52 ఏళ్ల క్రితం నెలకొల్పిన సంప్రదాయాన్ని ఆమె కొనసాగించారు. 1967లో ఇందిర తొలిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు తన ఎన్నికల ప్రతినిధిగా వ్యవహరించిన గయా ప్రసాద్‌ శుక్లా ఇంట్లో హోమం చేసిన అనంతరమే నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తరువాత ప్రతి ఎన్నికల్లోనూ ఆమె ఈ పూజలు చేసేవారు. సోనియా కూడా ఆ ఇంట్లోనే హోమం జరిపించడాన్ని సంప్రదాయంగా మార్చుకున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు