close

ఆంధ్రప్రదేశ్

సమస్యలపై స్పందించని ఈసీ

పోలింగ్‌ కేంద్రంలో బైఠాయించిన లోకేశ్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట 37వ పోలింగ్‌ కేంద్రంలో కనీస వసతులు కల్పించకపోవడంతో గురువారం ఉదయం నుంచి పోలింగ్‌ ప్రక్రియ నత్తనడకన సాగింది. సాయంత్రం 6 గంటలకు వరుస క్రమంలో 450 మంది ఓటర్లున్నారు. సాయంత్రం కావడంతో దీపాలు లేకపోవటంతో పోలింగ్‌ కేంద్రం చీకటిగా మారింది. దాంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ పోలింగ్‌ కేంద్రానికి రాత్రి 6.30 గంటల సమయంలో చేరుకున్నారు. నియోజకవర్గ ఏఆర్వో పద్మావతికి లోకేశ్‌ ఫోన్‌ చేసి ఇక్కడికి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరగా ఆమె సరిగా స్పందించలేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫోన్‌ చేసి సమస్యలు వివరించారు. అటు వైపు నుంచీ స్పందన కనిపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ వైఖరికి నిరసనగా లోకేశ్‌ బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని తెదేపా అభ్యర్థి పోలింగ్‌ కేంద్రం లోపలికి ఎలా వెళతారని ప్రశ్నించి ఆయన్ను అక్కడ నుంచి పంపాలని డిమాండ్‌ చేశారు. దాంతో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకోవటంతో గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ విజయరావు చేరుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఎస్పీ విజయరావు అభ్యర్థులు లోకేశ్‌, ఆర్కేలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో లోకేశ్‌ నిరసన విరమించి వెళ్లిపోయారు. ఆర్కే మాత్రం అక్కడే బైఠాయించి నిరసనను కొనసాగించటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు