close

ఆంధ్రప్రదేశ్

మొండికేసిన ఈవీఎంలు

4,583 చోట్ల మొరాయించిన యంత్రాలు
618 కేంద్రాల్లో 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం దాకా సతాయింపులే
ఎన్నికల సంఘంపై ఓటర్ల ఆగ్రహం
అర్ధరాత్రి వరకూ ఓటింగ్‌

సీఈసీని బదిలీ చేస్తారా?

ఈవీఎం పనిచేయకపోవడంతో వంద మందికిపైగా ఓటర్లు వెనక్కిపోయారు. ఇంతసేపు నిలబడలేక కొంతమంది కళ్లు తిరిగి పడిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మోదీ వచ్చి వెనక్కి తెప్పిస్తారా వాళ్లను? మేమంతా ఓటేయకుండా వెనక్కి పోవాలని ఇలా చేస్తున్నారా? ఈ తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారు. నిన్నటిదాకా ఎస్పీ, సీఎస్‌లను బదిలీ చేశారు. ఈ తప్పిదాలకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ)ని బదిలీ చేస్తారా? విజయవాడ నడిబొడ్డునే ఇలా జరిగితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? ఇదంతా దుష్టచతుష్టయం పనే. వెనకెప్పుడో కురుక్షేత్రంలో విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం.
- విజయవాడలోని పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారిని నిలదీసిన మహిళా ఓటరు

2 గంటలకు పైగా మొరాయిస్తే మర్నాడు పోలింగ్‌

పోలింగ్‌ ప్రారంభించడంలో రెండు గంటలు జాప్యం జరిగితే.. మరుసటి రోజు ఇంతే సమయం పోలింగ్‌ నిర్వహించేందుకు వీలుందని ఎన్నికల సంఘం 2009 జనవరి 21న చేసిన 25వ నంబరు సూచన చెబుతోంది. రాష్ట్రంలో గురువారం ఉదయం 9 గంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 622 కేంద్రాల్లో 2 గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరుసటి రోజు పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రధానాధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. ఎన్నికల సంఘం దీన్ని పరిశీలిస్తామంటూనే సాయంత్రం దాకా సాగదీసింది.  ఫలితంగా అర్ధరాత్రి దాటే దాకా పోలింగ్‌ కొనసాగింది. కనీసం విధుల్లో ఉండే ఎన్నికల అధికారులు, సిబ్బందికి మంచినీళ్లు, ఆహారం గురించి కూడా పట్టించుకోలేదని తెదేపా నేతలు మండిపడుతున్నారు. పలుచోట్ల ఓటర్లు కూడా ఎన్నికల సంఘం పనితీరును దుయ్యబట్టారు.

ఈనాడు - అమరావతి, ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకోవడానికి గురువారం ఉదయాన్నే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఈవీఎం పని చేయడం లేదని గుర్తించారు. పాత సమాచారం తొలగించకుండానే వాటిని పోలింగ్‌కు తెచ్చినట్లు సిబ్బంది అరగంట తర్వాత గుర్తించారు. అందులోనే మాక్‌ పోలింగ్‌ నిర్వహించడంతో నిండిపోయినట్లు తేల్చారు. దీంతో సీఈఓ ఓటేయకుండానే తిరిగివెళ్లారు. సమస్య పరిష్కరించాక మధ్యాహ్నం వచ్చి ఓటేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 4,583 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ద్వివేది ప్రధాన ఎన్నికల అధికారి కాబట్టి మరోసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓటర్ల గోడు మాత్రం ఎవరికీ పట్టలేదు. సరిచేశాక వచ్చి ఓటేయండి అన్నట్లు సిబ్బంది వ్యవహరించారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావడమే ఆలస్యం.. ఎక్కడికక్కడ ఈవీఎంలు మొరాయించాయనే ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. సాయంత్రం దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. సగటున మూడింట ఒక ఈవీఎం పనిచేయడం లేదని పలుచోట్ల బూత్‌ ఏజంట్లు స్పష్టం చేశారు. ఒక్కో కేంద్రంలో 45 నిమిషాల నుంచి 7గంటల వరకు పోలింగ్‌ నిలిచిపోయింది. సమస్యను ముందుగా గుర్తించడంతోపాటు, ఇబ్బంది తలెత్తిన వెంటనే సరిదిద్దడంలోనూ పోలింగ్‌ సిబ్బంది, సాంకేతిక బృందాలు విఫలమయ్యాయి. దీంతో ఓటర్లలో అసహనం మొదలైంది. అవి ఎందుకు పనిచేయడం లేదో, ఎప్పటి నుంచి పనిచేస్తాయో చెప్పేవారు లేక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి పోలింగ్‌ కేంద్రాల ముందు నిరీక్షించలేక కొందరు సొమ్మసిల్లారు. ఎండ వేడి, ఉక్కపోతలు తట్టుకోలేక మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయి సాయంత్రం వచ్చారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు ఎన్నో అవస్థలు పడ్డారు. వీళ్లలో చాలామంది మళ్లీ ఓటేయడానికి రాలేదు.ఈవీఎంలు మొరాయించిన చోట్ల చాలా కేంద్రాల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ఓటర్లు లైన్లో ఉండటంతో టోకెన్లు ఇచ్చి పోలింగ్‌ కొనసాగిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి దాకా ఓటర్లు నిలబడాల్సి వచ్చింది. ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది రాష్ట్రంలో 381 ఈవీఎంలే పనిచేయడం లేదని చెప్పడం గమనార్హం.

ఓటేయడానికి ఎదురుచూపులు
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్‌, ఆయన భార్య జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ఓటేసేందుకు ఉదయమే 7 గంటలకు వచ్చారు. ఈవీఎంలు మొరాయించడంతో మూడు గంటలు వేచిచూశారు.  విశాఖపట్నం 227 పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 8.20 గంటలకు కూడా పోలింగ్‌ ప్రారంభం కాలేదని లోక్‌సభ అభ్యర్థి లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 6.45 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినా సరైన సమాధానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 40 శాతం ఈవీఎంలు పనిచేయలేదని సీపీఐ అభ్యర్ధి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోలింగ్‌ కేంద్రం ఎదుట బైఠాయించారు.
* గుంటూరు జిల్లాలో 30 పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించగా.. సగటున మూడింట ఒకటి మొరాయించాయి. మంగళగిరి పట్టణంతోపాటు తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో పలుచోట్ల ఈవీఎంలు పనిచేయలేదు.
* మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. అరకు మండల మంజగుడ, అనంతగిరి మండలం సూకూరుపుట్టల్లో  10 వరకు జరిగింది.
* విజయనగరం జిల్లా సాలూరులో వీవీపాట్లు పనిచేయక గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. కడప జిల్లాలో చాలాచోట్ల వీవీప్యాట్ల విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి.
* గుంటూరు జిల్లాలో అత్యధికంగా 725 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గుంటూరు తూర్పులో 75, మాచర్ల నియోజకవర్గంలో 62, మంగళగిరిలో 56 పనిచేయకపోవడంతో పోలింగ్‌ నిలిచింది. చిలకలూరిపేటలో ఆరు గంటల వరకు పోలింగ్‌ నిలిపేశారు.
* చిత్తూరు జిల్లాలో అధిక నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయక  కొన్నిచోట్ల 11 గంటలు దాటినా పోలింగ్‌ మొదలుకాలేదు.
* అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 250కిపై పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించాయి. మడకశిర, పుట్టపర్తి, రాప్తాడు, పెనుగొండల్లో 2 గంటల వరకు పోలింగ్‌ ఆగింది.
* విజయనగరం జిల్లాలో 150 పోలింగ్‌ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో 9.30 వరకు పోలింగ్‌ ప్రారంభమే కాలేదు.

* ప్రకాశం జిల్లాలో కొన్నిచోట్ల ఉదయం తొమ్మిది గంటల వరకు మాక్‌ పోలింగే పూర్తి కాలేదు. కనిగిరి నియోజకవర్గంలో కొన్నిచోట్ల నాలుగు గంటలు, కందుకూరులో 3 గంటల వరకు పోలింగ్‌ నిలిచింది.
* తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో 2గంటలకు పైగా పోలింగ్‌ ఆగింది. మండపేటలో ఈవీఎం మొరాయించడంతో 6.20 గంటలు నిలిపేశారు. వరరామచంద్రాపురం మండలం రాజపేటలోని పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 390లో అసెంబ్లీ, పార్లమెంట్‌ మధ్య 3ఓట్లు తేడా వచ్చాయి.
* కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 50, జమ్మలమడుగులో 43, రాజంపేటలో 40 పైగా ఈవీఎంలు పనిచేయలేదు.
* కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో 90, అవనిగడ్డలో 45 ఈవీఎంలు మొరాయించాయి. 7గంటలు ఈవీఎం పనిచేయకపోవడంతో విజయవాడ మొగల్రాజపురంలో పోలింగ్‌ కేంద్రానికి తాళం వేశారు.
* విశాఖ జిల్లాలో 1300 కేంద్రాల్లో సాంకేతిక సమస్యలొచ్చాయి. మన్యంలో ఉదయం పదింటికీ పోలింగ్‌ మొదలుకాలేదు..
* శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో 72 చోట్ల యంత్రాలు పనిచేయలేదు. పాతపట్నంలో 36 చోట్ల 2 నుంచి 6 గంటల వరకు ఓటర్లకు నిరీక్షణ తప్పలేదు.
* నెల్లూరు జిల్లాలో 110 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయగిరిలో కొన్నిచోట్ల రెండున్నర గంటలు పోలింగ్‌ నిలిపేశారు.
* పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా ఒక్కో నియోజకవర్గంలో 50 కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. గంటన్నర నుంచి 3 గంటల వరకు పోలింగ్‌ నిలిపేయాల్సి వచ్చింది.
* గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల పరిధిలోనూ చాలా ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకూ నడిచింది.
* శ్రీకాకుళం జిల్లా 390 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.  ఎల్‌ఎన్‌పేటలోని 164వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం పని చేయక 6గంటలు ఓటర్లు పడిగాపులు పడ్డారు.
* కర్నూలు జిల్లాలో 3,781 పోలింగ్‌ కేంద్రాలుండగా ఉదయం 9 గంటల వరకు కేవలం 587 కేంద్రాల్లోనే పోలింగ్‌ జరిగింది.  మంత్రాలయం, ఆదోని బనగానిపల్లె, ఆలూరు తదితర నియోజకవర్గాల్లో 2.30 గంటల వరకు పోలింగ్‌ నిలిపేశారు.
* విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో నాలుగో నెంబరు పోలింగ్‌ కేంద్రంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం ఉదయం నుంచి రెండుసార్లు మొరాయించడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడ ఓటు నమోదు కాలేదు. ఓటర్లు కొందరు వెళ్లిపోవడంతో 1350 మంది ఓటర్లున్న ఈ పోలింగ్‌ కేంద్రంలో సాయంత్రం 6 గంటల వరకు 950 మంది మాత్రమే ఓటేయగలిగారు.

ఎమ్మెల్యేలూ నిరీక్షణే

శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఆమదాలవలస ఎమ్మెల్యే కూనరవికుమార్‌, కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్‌, టీజీ వెంకటేష్‌ కుటుంబం, బనగానపల్లెలో తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి, కల్లూరులో కాటసాని రామిరెడ్డి(వైకాపా పాణ్యం అభ్యర్థి) సైతం ఓట్లు వేయడానికి గంటల కొద్దీ నిరీక్షించారు.

గాజువాకలో రాత్రి 11 గంటలకూ..

నసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గం యాదవజగ్గరాజుపేట 129 నంబరు పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 11 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతూనే ఉంది. ఈ కేంద్రంలో ఉదయం సుమారు 3 గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమవడంతో రాత్రి వరకు ఓటర్ల రద్దీ కొనసాగింది. అగనంపూడి సమీపంలోని ఫార్మాకాలనీ 2, 3వ పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించడంతో రాత్రి 10 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.

ఒకరికి ఓటేస్తే మరో పార్టీకి..

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాలపాలెం కేంద్రంలో ఏ పార్టీకి ఓటేసినా భాజపాకు పడుతున్నాయని ఫిర్యాదు చేయడంతో ఈవీఎం మార్చారు. అన్ని ఓట్లు తెదేపాకే పడుతున్నాయంటూ గుంటూరు జిల్లా వినుకొండలో మండలం పానకాలపాలెంలో వైకాపా ఏజంట్లు ఈవీఎంలు ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చిగనలగురికిలో మాక్‌ పోలింగ్‌ సందర్భంగా సైకిల్‌కు ఓటేస్తే ఫ్యాన్‌కు పడుతున్నాయంటూ తెదేపా ఏజంట్లు అభ్యంతరం తెలిపారు.

ఈవీఎంల ధ్వంసం

గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి బాలికోన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో జనసేన అభ్యర్ధి మధుసూదన్‌ గుప్తా నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఈవీఎంను నేలకేసి కొట్టారు. రాప్తాడులోని సనపలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. టెక్కలి నియోజకవర్గం చవితిపేటలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఐరాల మండలం కట్టకిందపల్లిలో వైకాపా అభ్యర్థి ఎంఎస్‌బాబు, అనుచరులు  ఈవీఎంను పగలగొట్టారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు