close

ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ శాతం తగ్గించేందుకు బాబు కుట్ర

ఓటర్లు ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు
  వైకాపా అధ్యక్షుడు జగన్‌

ఈనాడు, హైదరాబాద్‌ : ‘‘ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. దేవుని దయ వల్ల 80 శాతానికి పైగా ప్రజలు ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావడం హర్షించదగిన విషయం’’ అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఓడిపోతున్నానని తెలిసి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌ను బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అయినా పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నందుకు ప్రజలకు  ధన్యవాదాలు. ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని వైకాపా తరపున నిలబడ్డ ప్రతికార్యకర్తను, నాయకుడిని అభినందిస్తున్నా. వైకాపా కార్యకర్తల్లో కొంతమందికి గాయాలు తగిలాయి. ఇద్దరి ప్రాణాలు పోయాయి. పార్టీ సానుభూతిపరులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. ఓడిపోతున్నారు కాబట్టి బురద చల్లాలని చూస్తున్నారు. చిలకలూరిపేటలో మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఒక పోలింగ్‌ కేంద్రంలో సిబ్బందిని బెదిరించారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌ నిబంధనలు ఉల్లంఘించి 10 మందితో కలసి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడం చూశాం. వేమూరు నియోజకవర్గం బూతుమల్లిలో వైకాపా అభ్యర్థి ఎం.నాగార్జునపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇన్ని ఘటనలు జరిగాయి. 3.93 కోట్ల మంది ఓటర్లలో 80 శాతం పోలింగులో పాల్గొన్నారు. ఏ పార్టీకి ఓటేసింది. వీవీప్యాట్‌లో కనిపిస్తోంది. అంతపెద్ద సంఖ్యలో ఓటేసి వారంతా సంతృప్తిగా ఉన్నప్పుడు ఎవరైనా దానిపై ఎలా నెగెటివ్‌గా కామెంట్‌ చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌తో సంబంధాలపై ఎన్నిసార్లు చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో జరిగిన చివరి సభలో దానికి సమాధానం చెప్పా. ఏపీలో పోలింగ్‌ ముగిసినందున హాలిడే తీసుకునే ఆలోచనలో ఉన్నా. నేను ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్లడం లేదు.’’ అని జగన్‌ స్పష్టం చేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు