close

ఆంధ్రప్రదేశ్

ఈసీ.. ఇబ్బందుల పాలుచేసె..

ఓటర్ల సహనానికి అడుగడుగునా పరీక్ష

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అత్యంత ఘోరంగా విఫలమైంది. మొరాయించిన ఈవీఎంలను వెంటనే సరిచేయలేకపోవటం, పోలింగ్‌ కేంద్రాల్లో తగినంత మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయలేకపోవటం కనీస సదుపాయాలు కల్పించకపోవటం  ఇలా  ప్రతీ అంశంలోనూ ఎన్నికల అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒకే ప్రాంగణంలో నాలుగైదు పోలింగ్‌ కేంద్రాలను పెట్టటం, పోలింగ్‌ కేంద్రాల సంఖ్యకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో గందరగోళం నెలకొంది. తాగునీటి వసతి ఎక్కడా సరిగ్గా లేదు. ఇరుకుగా ఉన్న ఒకే ప్రాంగణంలో నాలుగైదు పోలింగ్‌ కేంద్రాలను పెట్టటంతో బాగా రద్దీ నెలకొంది. సాధారణంగా ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1200 మంది వరకూ మాత్రమే ఓటర్లను చేర్చామని చెప్పిన ఎన్నికల సంఘం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్‌ పేట పరిధిలోని 37వ పోలింగ్‌ కేంద్రంలో 2,097 మంది ఓటర్లను చేర్చారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంలోని ఆర్‌ అండ్‌బీ కార్యాలయం పక్కన ఉన్న ఓ ప్రాంగణంలో నాలుగు పోలింగ్‌ కేంద్రాలు పెట్టారు. వాటి పరిధిలో దాదాపు 5 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ లోపలికి వెళ్లేందుకు, బయటకొచ్చేందుకు ఒకే మార్గం ఉండటంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు స్థానిక అధికారులు దృష్టికి తీసుకురాగా ఓ ప్రొక్లయిన్‌ తీసుకొచ్చి ప్రహారీ గోడను కూల్చి నాలుగు మార్గాలను ఏర్పాటు చేశారు. ఈటీవీలు మొరాయించటం వల్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగింది. మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు, ఐదు గంటలు ప్రాంతాల్లో పోలింగ్‌ పూర్తికావలసి ఉన్నా అక్కడ కూడా పోలింగ్‌ ఆలస్యమైంది.

బలగాల కొరత
రాష్ట్రంలో ఎన్నికల భద్రత, బందోబస్తు కోసం 1,06,468 మంది సిబ్బంది అవసరమని ఏపీ పోలీసులు ప్రతిపాదనలు ఇచ్చినా తగినంత మంది సిబ్బందిని కేటాయించలేదు. కేంద్ర సాయుధ బలగాల నుంచి 392 కంపెనీలు కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరగా 197 కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి 5,666 మంది మాత్రమే వచ్చారు. 2014 ఎన్నికల కంటే ఈ సారి దాదాపు 45 వేల మంది భద్రతా సిబ్బంది తక్కువగా వచ్చారు. దీంతో సాధారణంగా పది మంది భద్రతా సిబ్బంది ఉండాల్సిన చోట అయిదారుగురితోనే సరిపెట్టాల్సి వచ్చింది. సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో అయితే హోంగార్డులతోనే మమ అనిపించారు. దీంతో ఘర్షణలు అదుపు చేయటం భారంగా పరిణమించింది. ఎన్నికల విధులతో సంబంధం లేని వారు పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్లు ఆవలే ఉండాలన్న కనీస నిబంధన కూడా  అమలు కాలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు