close

ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ హింసాత్మకం

సభాపతి డాక్టర్‌ కోడెలపై దాడి
చేయి విరిగిన నరసరావుపేట తెదేపా అభ్యర్థి
కురుపాం ఎమ్మెల్యే, ఆమె భర్త, అనుచరులపై దాడి
అనంత, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరి మృతి
పలు చోట్ల లాఠీఛార్జి... ఆందోళనలు
రాయలసీమ, పల్నాడు ప్రాంతాలు ఉద్రిక్తం

న్నికల వేళ పలు గ్రామాలు, పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఏకంగా పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థులపైనే దాడుల విధ్వంసం కొనసాగింది. తెదేపా, వైకాపా మధ్యే చాలాచోట్ల ఘర్షణలేర్పడ్డాయి. సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుతోపాటు నరసరావుపేట తెదేపా అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబుకు రక్తగాయాలయ్యాయి. నరసరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కురుపాం వైకాపా అభ్యర్థిని పుష్పశ్రావణి, ఆమె భర్త, అనుచరులపై ప్రత్యర్థులు దాడి చేసి పాఠశాల భవనంలో నిర్బంధించారు. అనంతపురం జిల్లాలో తెదేపా కార్యకర్త మృతి చెందగా, వైకాపా కార్యకర్త మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా కార్యకర్త మృతి చెందారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం భగ్గుమంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
* గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబుపై ఉప్పలపాడులో వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన చేయి విరిగింది. కారు ధ్వంసమైంది.
* గురజాల వైకాపా అభ్యర్థి కాసు మహేశ్వర్‌రెడ్డిపై కొత్తగణేశునిపాలెంలో తెదేపా కార్యకర్తలు దాడికి యత్నించిన ఘటనలో పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
* అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో ఘర్షణలో తెదేపా కార్యకర్త చింతా భాస్కర్‌రెడ్డి మృతి చెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన వైకాపా కార్యకర్త పుల్లారెడ్డి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఇదే జిల్లా ఎల్లనూరు పరిధిలోని జంగంపల్లిలో వైకాపా. తెదేపా కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పదిమందికి గాయాలయ్యాయి. రాప్తాడు పరిధిలోని సిద్ధరాంపురంలో ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. సనపలో తెదేపాకు చెందిన 10 మందికి గాయాలయ్యాయి. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌, గ్రామరెవెన్యూ అధికారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తోపుదుర్తిలో రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ వాహనశ్రేణిపై రాళ్లతో దాడిచేశారు. గుత్తిలోని జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా ఓటేసే ప్రాంతంలో ఎంపీ, ఎమ్మెల్యే అని తెలిపే పేర్లు చిన్నవిగా ఎందుకు రాశారంటూ ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ను పగలగొట్టారు.

* కడప జిల్లా ఖాజీపేట మండలం శాంతినగరంలో ఐదుగురు గాయపడ్డారు. పొన్నతోటలో ప్రధాన పక్షాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. ఎర్రగుంట్లలో తనపై ఎంపీ సీఎం రమేష్‌ చేయి చేసుకున్నారంటూ ఓ వ్యక్తి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు.
* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో భూమా, గంగుల వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో స్పెషల్‌పార్టీ పోలీసు ఒకరు, రెండు పార్టీలకు చెందిన ఆరుగురు గాయపడ్డారు. పోలింగ్‌కేంద్రానికి మంత్రి అఖిలప్రియ సోదరి నాగమౌనిక, వైకాపా అభ్యర్థి బ్రిజేంద్రరెడ్డి చేరుకున్నపుడు తలెత్తిన గొడవ ఘర్షణకు దారి తీసింది. సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సందీప్‌, స్వతంత్ర అభ్యర్థి రామిరెడ్డికి గాయాలయ్యాయి. ఆ తర్వాత రుద్రవరంలోనూ నాగమౌనిక, బ్రిజేంద్రరెడ్డి ఎదురుపడగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాత్రి ఆళ్లగడ్డ బాలికల ఉన్నత పాఠశాల వద్ద అఖిలప్రియకు, గంగుల ప్రతాప్‌రెడ్డికి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానపల్లెలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో రెండువైపులా నలుగురు చొప్పున ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

* చిత్తూరు జిల్లా ఐరాల మండలం కట్టకిందపల్లెలో వైకాపా కార్యకర్తలు ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తెదేపా, వైకాపా మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో పోలింగ్‌ కేంద్రం వద్ద తోపులాటలో వైకాపా కార్యకర్త, వృద్ధుడు వెంకట్రమణారెడ్డి మృతి చెందారు. ఆయన్ను తెదేపావారే హత్య చేశారంటూ వైకాపావారు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
* కృష్ణా జిల్లా గన్నవరం మండలం మడిశర్లలో వైకాపాకు ఓటేయాలంటూ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా కార్యకర్తలపై స్పెషల్‌బ్రాంచి కానిస్టేబుల్‌ జ్యోతిప్రకాశ్‌ తుపాకీ చూపించి బెదిరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
* విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజాసెంటర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై వైకాపా కార్యకర్తలు దాడికి దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
* పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా అభ్యర్థి బడే టి బుజ్జి వైకాపా కార్యకర్త మట్టరాజుపై దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఏలూరులో నాలుగుచోట్ల వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ప్రత్తికోళ్లలంకలో ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. కొయ్యలగూడెం మండలంలోని కొన్ని గ్రామాల ఓటర్లు పోలింగును బహిష్కరించారు.
* నరసరావుపేట ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు పోలింగ్‌బూత్‌ల వద్ద వీరంగం సృష్టించారు. శ్రీనివాస గిరిజన కాలనీలో ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలింగ్‌బూత్‌లో నుంచి తెదేపా ఏజెంట్లను తరిమారు. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఎమ్మెల్యే స్వయంగా కర్ర చేతబట్టుకొని హల్‌చల్‌ చేశారు. అదనపు పోలీసు బలగాలు వచ్చి అల్లరిమూకపై లాఠీలు ఝుళిపించారు. మరో ప్రాంతంలో తెదేపా అభ్యర్ధి అరవిందబాబు, ఆయన అనుచరులు వైకాపా ఎమ్మెల్యే వైఖరిని ఖండిస్తూ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించి పరస్పర ఆరోపణలతో నినాదాలు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు సిబ్బందితో అక్కడికి వచ్చి నచ్చజెప్పడంతో అరవిందబాబు వెనుదిరిగారు. పోలింగ్‌కేంద్రం ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యే పోలింగ్‌ సమయం ముగిసేవరకు అక్కడే బైఠాయించారు. ఎస్పీ వారిని అక్కడినుంచి పంపకుండానే వెనుదిరిగారు. బూత్‌ వద్ద ఎమ్మెల్యే అనుచరులు పెద్దపెట్టున నినదిస్తున్నా సమీపంలో ఉన్న పోలీసులు చోద్యం చూశారు.

* పిడుగురాళ్లలోని పుల్లారెడ్డి పాఠశాల వద్ద ఓ పోలింగ్‌ బూత్‌లో వైకాపా వర్గీయులు వీరంగం సృష్టించటంతో తెదేపావారు గాయపడ్డారు.
* మాచర్లలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డి వాహనశ్రేణిలో వెనక వస్తున్న ఆయన మామ ఎం.వెంకట్రామిరెడ్డిని నిలిపేసి మరీ కొట్టారు. దీంతో ఆయన తలపగిలి రక్తమోడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అంజిరెడ్డి గురజాలకు బయలుదేరగా అక్కడి వరకు వైకాపావారు వెంబడించారు.
* చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో వైకాపా దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నించగా అడ్డుకున్న తెదేపా కార్యకర్తలను వెంటాడి కొట్టారు. గ్రామానికి చెందిన ఏడుగురు తెదేపా కార్యకకర్తలకు తలలు పగిలాయి.
* తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ వాహనంపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఉప్పాడ పోలింగ్‌ కేంద్రంలోకి ఎమ్మెల్యే వర్మ కారులో వెళ్లడాన్ని నిరసిస్తూ వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఇంతలో కొందరు వైకాపా వాళ్లు గోడదూకి పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి రాళ్లు, కొబ్బరిబొండాలతో దాడికి పాల్పడ్డారు.
* నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి, తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటన తర్వాత తెదేపా కార్యకర్తలు ఆవేశంతో ఎమ్మెల్యేపై దాడికి పాల్పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.

* గుంటూరు జిల్లా కొల్లూరు మండలం రావికంపాడులో తెదేపా అభ్యర్థి నక్కా ఆనందబాబుపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. గురజాలలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పోలుకొండలో తెదేపా సానుభూతిపరుడు శ్రీనివాస్‌పై వైకాపా నేత జి.రవిచంద్‌ కత్తితో దాడిచేశాడు.
* గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు, బృందావన్‌గార్డెన్స్‌లో గురువారం రాత్రి 11 గంటల సమయంలో నల్లచెరువులోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారని తెదేపా నాయకులకు సమాచారం అందింది. తెదేపా నాయకులు పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. గుంటూరు తెదేపా, వైకాపా ఎంపీ అభ్యర్థులు గల్లా జయదేవ్‌, మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా వచ్చారు. పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు.

- ఈనాడు, ఈనాడు డిజిటల్‌,న్యూస్‌టుడే బృందం

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు