close

ఆంధ్రప్రదేశ్

ఓటర్ల స్ఫూర్తికి ఈసీ తూట్లు

వేల సంఖ్యలో మొరాయించిన ఈవీఎంలు
రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తతలు, దాడులు
తెదేపా, వైకాపాలకు చెందిన ఇద్దరి మృతి
పలువురు కార్యకర్తలు, పోలీసు సిబ్బందికి గాయాలు
ఓటర్ల జాబితాలో గల్లంతయిన పలువురి పేర్లు
మండుటెండల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందిపడ్డ ప్రజలు
అర్ధరాత్రి 12.30 తర్వాతా 14 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌
సాయంత్రం 6 గంటల వరకు పోలైన ఓట్లు 71.43 శాతం
ఈసీ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలిచింది. ప్రజలు గెలిచారు. ఎన్నికల సంఘం మాత్రం ఘోరంగా విఫలమైంది...! ఆంధ్రప్రదేశ్‌ శాసనసభతో పాటు, రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్‌ ప్రక్రియ ఘర్షణలు, హింసాత్మక సంఘటనల మధ్య ముగిసింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపా కార్యకర్త చింతా భాస్కర్‌రెడ్డి మరణించారు. వైకాపా కార్యకర్త పుల్లారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని టి.సదుంలో జరిగిన ఘర్షణల్లో వైకాపా కార్యకర్త వెంకట రమణారెడ్డి మరణించారు. రాష్ట్ర్రంలో కొన్ని చోట్ల తెదేపా, వైకాపా అభ్యర్థులపైనే దాడులు జరిగాయి. సత్తెనపల్లె నియోజకవర్గంలో ఏకంగా శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుపైనే వైకాపా కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. రాత్రి పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో పలు చోట్ల తెదేపా, వైకాపా కార్యకర్త మధ్య దాడులు కొనసాగాయి. ప్రజలు మండే ఎండల్నీ లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80 శాతానికిపైగా పోలింగ్‌ నమోదవడం ఈసారి విశేషం. ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చిన ప్రజల సహనానికి ఈసీ నిర్వాకం పరీక్ష పెట్టింది. రాష్ట్రంలో కొన్ని వేల పోలింగ్‌ బూత్‌లలో ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించాయి. చాలా చోట్ల రెండు మూడు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట, రెండు గంటలకు పోలింగ్‌ మొదలైన కేంద్రాలూ ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలోని దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోను పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్నారు. రాత్రి బాగా పొద్దు పోయేంత వరకు పోలింగ్‌ కొనసాగింది. రాత్రి 10 గంటల సమయానికి కూడా 726 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అవసరమైన సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించడంలోనూ ఎన్నికల సంఘం అత్యంత ఘోరంగా విఫలైంది.

ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం..!
ఈసారి ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున తమ హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకే పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈవీఎంలు మొరాయించడంతో రెండు మూడు గంటలు క్యూలైన్లలో వేచి చూశారు. కొందరు చాలా సేపు నిలబడి  ఇక నిలబడే ఓపిక లేక  ఇళ్లకు వెళ్లిపోయారు.  కాసేపు ఆగి మళ్లీ వచ్చి క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండే ఎండలుగానీ  పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడం గానీ ఓటర్ల సంకల్పాన్ని సడలించలేకపోయాయి. అర్ధరాత్రి కూడా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిలబడి ఉన్నారంటే వారెంత కృతనిశ్చయంతో ఉన్నారో అర్ధమవుతోంది.  ఉదయం 9 గంటల సమయానికి కేవలం 9 శాతం ఓట్లే పోలయ్యాయి. 11 గంటలకు 23.22 శాతం, ఒంటి గంటకు 40.53 శాతం, మూడు గంటలకు 54.66 శాతం, 5 గంటలకు 65.96 శాతం, సాయంత్రం ఆరు గంటల సమయానికి 70 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పటికి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఉండటం, రాత్రి 10 గంటల సమయానికి కూడా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో... పోలింగ్‌ 80 శాతానికి పైగా నమోదయ్యే అవకాశముందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. వృత్తి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వేల సంఖ్యలో సొంత గ్రామాలు, పట్టణాలకు తరలి వచ్చినవారిలో చాలా మంది ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈసీ నిర్వాకం ఎంత చెప్పినా తక్కువే!
ఈ సారి పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈవీఎంల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి కనీన శిక్షణ కూడా ఇవ్వలేదని అర్ధమైంది. ఒకటో రెండో లేదా ..పది చోట్లో ఈవీఎంలు పనిచేయలేదంటే, సాంకేతిక సమస్య అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఈవీఎంలు మొరాయించాయంటే అది ముమ్మాటికీ నిర్లక్ష్యమే..! ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో పాటు, వాటిని ఆపరేట్‌ చేయడంలో సిబ్బందికి తగిన పరిజ్ఞానం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గురువారం ఉదయం గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఓటు వేయడానికి వెళ్లిన పోలింగ్‌ కేంద్రంలోనే ఈవీఎం మొరాయించింది. ఈవీఎంను ఆయనే స్వయంగా పరిశీలించారు. అరగంటపాటు ప్రయత్నించినా... ఈవీఎం సిద్ధం కాకపోవడంతో ఆయన ఓటు వేయకుండానే తిరిగి వెళ్లారు. సంబంధిత ఇంజినీర్లు వచ్చి ఈవీఎంను సరిచేసిన తర్వాతే పోలింగ్‌ ప్రక్రియ మొదలైంది. ద్వివేదీ మధ్యాహ్నం మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, మంచి నీటి వసతి కూడా సరిపడినంత లేదు. ఓటర్ల క్యూలు షామియానాలను దాటి బయటకు రావడంతో ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల క్యూల్లో రెండు మూడు గంటలపాటు నిలబడాల్సి వచ్చింది. కనీసం కుర్చీలు లేకపోవడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కావటంతో సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జింకుభద్ర గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో  10 ఓట్లు నమోదయ్యాక ఈవీఎం మొరాయించింది. దాన్ని మార్చేసి కొత్తది పెట్టారు. 17 ఓట్లు వేశాక  అదీ పాడైంది. మరో యంత్రంపెట్టారు. 173 ఓట్లు వేశాక అదీ మొండికేసింది. సాయం త్రం 6.30 గంటల సమయంలో ఆ యంత్రాన్నీ మార్చి, మరో ఈవీఎం ఏర్పాటు చేశారు.

లెక్కల్లో తేడా
పోలింగు పూర్తయ్యాక చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొన్ని ఈవీఎంలలో అధిక ఓట్లు చూపటం ఉద్రిక్తతలకు దారితీసింది. నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఈవీఎంలో అధిక ఓట్లు నమోదయ్యాయి. అక్కడున్న ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోని 11 నెంబరు పోలింగు కేంద్రంలో 485 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి సంఖ్య కంటే పోలైనవి 50 ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించి వైకాపా శ్రేణులు ఆందోళనకి దిగారు. తెదేపా వర్గీయులు దీన్ని అడ్డుకున్నారు.పరస్పరం రాళ్లు, సీసాలు రువ్వుకున్నారు. అలాగే చిలకలూరిపేట మండలం పసుమర్రు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 129 పోలింగ్‌ కేంద్రంలో అసెంబ్లీకి 1053 ఓట్లు చూపిస్తుండగా, పార్లమెంట్‌కు 1098 ఓట్లు చూపిస్తుంది. అసెంబ్లీ కన్నా 45 ఓట్లు పార్లమెంట్‌కు ఎక్కువగా చూపిస్తున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వీవీప్యాట్‌లో 1053 చూపిస్తున్నాయి. కాని పార్లమెంట్‌కు ఎందుకు ఎక్కువ ఓట్లు చూపిస్తుందనేది అర్థంగాక సెక్టార్‌ అధికారులకు వివరించాలని పోలింగ్‌ అధికారి నిర్ణయించారు.

వైకాపా కార్యకర్తలపై చర్య తీసుకోవాలి
ఈసీ వైఖరిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కూడా తన నిరసన తెలిపారు. ఈసీకి రెండు, డీజీపీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల మూడు గంటలకుపైగా పోలింగ్‌ ఆలస్యమైందని, అక్కడ రీపోలింగ్‌ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. గంటకుపైగా పోలింగ్‌  ఆలస్యమైన చోట్ల పోలింగ్‌ సమయం పెంచాలని కోరారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన, ఈవీఎంలను ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. మరోపక్క తెదేపా జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకర్గంలోని క్రిస్టియన్‌పేట పోలీసు స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి నిరసన తెలిపారు.ఈవీఎంలు పనిచేయక, పోలింగ్‌ ఆలస్యమవుతోందని తెలియడంతో అక్కడకు లోకేష్‌ను వైకాపా కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేష్‌, తెదేపా నాయకులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈసీ వైఖరిపైనా లోకేష్‌ తీవ్రంగా మండిపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు