close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సాహసంతో పట్టుకున్నారు

నలుగురు... యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) మహిళా ఆఫీసర్లు. ఎవరూ చేయని సాహసానికి పూనుకున్నారు. అడవిలో ఏడాదిగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఓ హంతకుడిని వెంటాడి, పట్టుకుని సీబీఐకి అప్పగించారు. వారే శాంతోక్‌బెన్‌ ఒడెడరా, అరుణాబెన్‌ గామేటి, నీతామిక, శకుంతల మాల్‌. అసలేం జరిగిందంటే... గుజరాత్‌కు చెందిన జూసబ్‌ అల్లారఖా ఓ హంతకుడు. పోలీసులకు పట్టుబడ్డాడు కానీ... గతేడాది జూన్‌లో పెరోల్‌పై బయటకు వచ్చి బొతాడ్‌ జిల్లా సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. హత్య కేసుతోపాటు, జూసబ్‌పై జునాగఢ్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌ తదితర జిల్లా పోలీసుస్టేషన్లలో దోపిడీ, దొంగతనాల కేసులు దాదాపు 23 ఉన్నాయి. స్థానిక పోలీసులు తీవ్రంగా గాలించినా దొరకలేదు. దీంతో ఈ కేసును ఏటీఎస్‌కు అప్పగించారు. ఈ విభాగం డీఐజీ హిమాన్షు శుక్లా నేతృత్వంలో జిగ్నేష్‌ అగ్రావత్‌ సహా నలుగురు మహిళా ఆఫీసర్లు కలిసి జూసబ్‌ కేసు విచారణ మొదలుపెట్టారు. అతడు తప్పించుకుని తిరుగుతున్న అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఈ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఆదివారం ఈ మహిళా అధికారులకు ఆ హంతకుడు దొరికాడు. అతడిని అదుపులోకి తీసుకుని, సీబీఐకి అప్పగించారు.  ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్న హంతకుడి కోసం అడవిలో గాలింపు చర్యలు చేపట్టడంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన నలుగురు ఏటీఎస్‌ మహిళా ఆఫీసర్లను ఉన్నతాధికారులు ప్రశంసించారు.


మరిన్ని