షియామీ విద్యుత్తు వాహనాలు!
close

Updated : 27/03/2021 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షియామీ విద్యుత్తు వాహనాలు!

గ్రేట్‌వాల్‌ ప్లాంటులో తయారీకి సన్నాహాలు

దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజ సంస్థ షియామీ, విద్యుత్తు వాహనాల తయారీలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం చైనాకే చెందిన పికప్‌ ట్రక్‌ దిగ్గజ సంస్థ గ్రేట్‌వాల్‌ మోటార్‌ కంపెనీ ప్లాంట్లను వినియోగించుకునేందుకు సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్తాసంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ ఏజీతో కలిసి చైనాలో విద్యుత్తు వాహనాల ప్లాంటును గ్రేట్‌వాల్‌ నెలకొల్పుతోంది. తమ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తరహాలోనే అత్యధికులకు చేరువయ్యేలా విద్యుత్తు వాహనాలు రూపొందించాలనేది షియామీ ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఇంజినీరంగ్‌ కన్సల్టెన్సీ సేవలను గ్రేట్‌వాల్‌ అందిస్తుందని సమాచారం. వచ్చే వారంలో ఇరు సంస్థలు ఈ విషయమై అధికారిక ప్రకటన చేయొచ్చని ఆ వర్గాలు వివరించాయి.
భిన్న రంగాలకు విస్తరించేందుకే..: ప్రస్తుతం షియామీ ఆదాయంలో ఎక్కువ వాటా స్మార్ట్‌ఫోన్‌ విభాగం నుంచే వస్తోంది. అయితే విపణిలో పోటీకి తోడు అత్యధికులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో తక్కువ ధరలే నిర్ణయిస్తున్నందున, షియామీకి మార్జిన్లు పరిమితంగా ఉంటున్నాయని చెబుతున్నారు. దీంతోపాటు చిప్‌సెట్‌ కొరత వల్ల తయారీ కూడా అనుకున్న మేర చేయలేకపోతున్నారు. అంతర్జాతీయంగా కూడా విద్యుత్తు వాహనాల రూపకల్పన కోసం వాహన తయారీ సంస్థలు, టెక్నాలజీ సంస్థలు కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయి. స్మార్ట్‌ క్యాబిన్లు, ఆటోడ్రైవ్‌ వాహనాల రూపకల్పనలో టెక్నాలజీ సంస్థలూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చైనాకు చెందిన సెర్చ్‌ఇంజిన్‌ బైదు కూడా విద్యుత్తు వాహనాలను గీలి ప్లాంటులో తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. షియామీ కూడా ఇంటర్‌నెట్‌తో అనుసంధానం చేయగల స్కూటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్లు, రైస్‌కుక్కర్లను రూపొందిస్తున్న సంగతి గమనార్హం. అన్నీ సానుకూలమైతే 2023కు విద్యుత్తు వాహనాన్ని షియామీ విడుదల చేసే వీలుందని సమాచారం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని