ఇలా అయితే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌! - The benefits of Having accounts in multiple banks is Huge
close

Published : 20/07/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇలా అయితే బ్యాంకుల్లో ఉన్న మీ డబ్బు సేఫ్‌!

‘డిపాజిట్ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ చట్టం(డీఐసీజీసీ)-1961’ ప్రకారం బ్యాంకుల్లో ఉండే మన సొమ్ములో రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. అంటే ఏదైనా అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని బ్యాంకు నుంచి డబ్బు తస్కరణకు గురైనా.. లేదా బ్యాంకు దివాలా తీసి ఖాతాదారులకు చెల్లించలేకపోయినా.. ఈ బీమా వల్ల రూ.5 లక్షల వరకు మనకు తిరిగి వస్తాయి. మిగతా సొమ్ముకు ఒకరకంగా చెప్పాలంటే రక్షణ లేనట్లే. అయితే, బ్యాంకుల్లో ఉండే డబ్బుకు పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. బ్యాంకులు దివాలా తీయడం అరుదైన సందర్భమనే చెప్పాలి. అయినప్పటికీ.. ఎక్కువ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..


ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు

బ్యాంకుల్లో ఉన్న మొత్తం విలువ రూ.5 లక్షలు మించితే.. వీలైనంత వరకు దాన్ని విభజించి వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలి. ఒక్కో బ్యాంకులో రూ.5 లక్షలకు మించి ఉంచొద్దు. అప్పుడు ప్రతి బ్యాంకులో ఉన్న సొమ్ము మొత్తానికి బీమా రక్షణ వర్తిస్తుంది. డీఐసీజీసీ ప్రకారం.. బీమా రక్షణకు ఒక్కో బ్యాంకులో ఉండే మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న సొమ్మును కాదు. కాబట్టి మీ వద్ద రూ.50 లక్షలు ఉంటే.. 10 బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయండి. అప్పుడు మొత్తం రూ.50 లక్షలకు బీమా రక్షణ ఉంటుంది. 

ఒక బ్యాంకులో రూ.5 లక్షలు అంటే కేవలం పొదుపు ఖాతాలో ఉన్నవి మాత్రమే కాదు. సేవింగ్స్‌తో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రికరింగ్‌ డిపాజిట్‌, మీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని కూడా బీమా రక్షణ పరిధిలోకి వచ్చే సొమ్ములోనే లెక్కిస్తారు.


వివిధ హోదాల్లో ఖాతాలు

ఒకవేళ ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ఇష్టం లేకపోతే.. ఒకటి లేదా రెండు బ్యాంకుల్లో వివిధ హోదాల్లో ఖాతాలు తెరవండి. ఉదాహరణకు మీ వ్యక్తిగత ఖాతాతో పాటు జాయింట్‌ అకౌంట్‌, ఓ సంస్థలో భాగస్వామిగా, ఓ మైనర్‌ చిన్నారికి గార్డియన్‌గా.. ఇలా పలు హోదాల్లో ఖాతాలు తెరవొచ్చు. వీటన్నింటికీ ఒకే పాన్‌ నెంబరు ఉన్నప్పటికీ.. వీటిని వేర్వేరు ఖాతాలుగా పరిగణిస్తారు. అలా ఒక్కో ఖాతాలో కొంత సొమ్మును డిపాజిట్‌ చేస్తే.. ఎక్కువ మొత్తం సొమ్ముకు బీమా రక్షణ లభించే అవకాశం ఉంది.


* అయితే, ఒక బ్యాంకులో ఖాతా తెరిచి డబ్బులు డిపాజిట్‌ చేయడానికి కేవలం బీమా రక్షణను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దు. ఆ బ్యాంకు విశ్వసనీయత, ట్రాక్ రికార్డు, వడ్డీరేట్లు తదితర అంశాలనూ పరిశీలించాలి.

* డీఐసీజీసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాంకులు దివాలా తీసిన సమయంలో వీలైనంత వేగంగా ఖాతాదారులకు బీమా వర్తించే సొమ్మును అందేలా చట్టంలో సవరణలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో సవరణ బిల్లును తేనున్నట్లు గత మార్చిలో వార్తలు వచ్చాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని