ఉద్యోగం నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్నారా? - Take these steps to avoid financial stress before taking Break from Job
close

Updated : 25/06/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగం నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్నారా?

ఆర్థిక ఇబ్బందులు రావొద్దంటే ఇవి పాటించండి!

ఉద్యోగంలో తీరిక లేకుండా గడుపుతాం. ఈ క్రమంలో ఇంటిపై కాస్త శ్రద్ధ తగ్గుతుంది. అలా కొన్ని పనులు వాయిదా పడిపోయి కాలం గడుస్తున్న కొద్దీ పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మరికొన్ని సార్లు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే వారిని చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇవీ కాకపోతే.. కుటుంబ సంతోషం కోసం సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ఉద్యోగానికి కాస్త ఎక్కువ సమయమే విరామం ఇవ్వాల్సి రావొచ్చు. ముఖ్యంగా మహిళలకైతే విరామం తప్పనసరి కావొచ్చు. ఎందుకంటే ఎదుగుతున్న పిల్లల బాధ్యత వారిపైనే ఎక్కువ ఉంటుంది. మరి ఇలా విరామం తీసుకుంటే ఆదాయ వనరులు ఒక్కసారిగా దెబ్బతింటాయి. అలాంటప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంత మేర ఉపశమనం లభిస్తుంది.. అవేంటో చూద్దాం..

అత్యవసర నిధి..

అనుకోని పరిస్థితుల్లో ఉపయోగపడే అత్యవసర నిధి ఎప్పుడూ మన దగ్గర ఉండాల్సిందే. ఆదాయం, ఖర్చులను బట్టి.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తం.. ముందే పొదుపు చేసుకోవాలి. ఈఎంఐలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, ఇంట్లో మీ బాధ్యతలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జమ చేసుకోవాలి. అందుకనుగుణంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. వీలైనంత వరకు అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే అనారోగ్య ఖర్చులకు సైతం ముందుగానే కొంత తీసి పక్కన పెడితే మంచిది. అత్యవసర నిధి ఎంత ఎక్కువగా ఉంటే అంత శ్రేయస్కరం.

మీ విరామ అవసరాలకు...

అసలు  మీరు ఎందుకు విరామం తీసుకుంటున్నారో ఆ అవసరానికి సరిపడా డబ్బును ముందే సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు విహారయాత్ర కోసం విరామం తీసుకుంటే.. ఏయే  ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారు? వాటిని చుట్టేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది?ఎంత మందితో వెళ్లాలనుకుంటున్నారు?వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని డబ్బును రెడీ చేసుకోవాలి. లేదంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి కోసం ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవడం కోసం విరామం తీసుకోవాలనుకుంటే.. దానికి ఎంత ఖర్చవుతుంది? వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సొమ్మును సిద్ధంగా ఉంచుకోవాలి.

మీపైన మీరు పెట్టుబడి పెట్టుకోండి..

మీరు ఉద్యోగం నుంచి సుదీర్ఘ విరామం తీసుకోవాలనుకుంటే.. ఆ సమయంలో మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకునే మార్గాలను అన్వేషించండి. వీలైతే  రోజులో కొంత సమయాన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడానికి వెచ్చించండి. ఉన్న ఉద్యోగంలోనే కొత్తగా వచ్చిన పోకడలు ఏంటో తెలుసుకొని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించండి. దీంతో ఈ  పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దాని కోసం కూడా కొంత డబ్బు వెచ్చించక తప్పదు. అందుకే కొంత మొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవడం ఉపయోగకరం.

పరిచయాలను కోల్పోవద్దు..

ఉద్యోగం నుంచి విరామం తీసుకున్నా.. ఉద్యోగంలో మీతోటి సహచరులు, మీ బాస్‌లు, యాజమాన్యంతో నిరంతరం టచ్‌లో ఉంటే మేలు. అప్పుడే ఆఫీసులో జరుగుతున్న మార్పులేంటో తెలుస్తాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సహచరుల నుంచి అప్‌డేట్లు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగంలో మనకు సహకరించే వాళ్లు మనకు దూరం కాకుండా చూసుకోవాలి. దీనికి డబ్బు అసవరం లేకపోయినా.. సమయం మాత్రం వెచ్చించాల్సిందే. అయితే అందరితో టచ్‌లో ఉండడం వల్ల అత్యవసర సమయంలో వారి నుంచి ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని