Emergency Fund: అత్యవసర నిధి అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? - Importance of Emergency Fund
close

Published : 07/08/2021 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Emergency Fund: అత్యవసర నిధి అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్-19 వ్యాప్తి మనందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రజలందరూ ఆర్థికంగా నష్టపోయారు. మునుపెన్నడూ చూడని విధంగా లాక్‌డౌన్‌ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. ఆరోగ్య సంబంధిత ఖర్చులూ పెరిగాయి. ఈ పరిస్థితులు అత్యవసరనిధి అవసరాన్ని తెలియజేశాయి.

అత్యవసర నిధి అంటే?
అత్యవసర లేదా ఆకస్మిక నిధి.. పేరుకు తగినట్లుగానే సంక్షోభాలు లేదా ఊహించని పరిస్థితుల ప్ర‌భావం ఆదాయంపై ప‌డిన‌ప్పుడు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. అనుకోని వైద్య ఖ‌ర్చులు, త‌ప్పనిస‌రి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవ‌డం, యుద్ధాలు, క‌రోనా వైర‌స్ వంటి విపత్తుల కారణంగా ఆదాయం త‌గ్గ‌డం మొద‌లైన కార‌ణాల‌తో అప్పులు చేయ‌కుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ర‌క్షిస్తుంది.

ఎంత మొత్తం కావాలి?
సాధారణంగా అత్యవసర పరిస్థితులు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఉంటాయి. కాబట్టి 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇవి అందిరికీ ఒకేలా ఉండ‌వు. ఉద్యోగం ప్రారంభ‌మైన తొలినాళ్లలో అంటే 20ల వ‌య‌సులో ఉన్న‌వారు 6 నెల‌ల కాలానికి స‌రిపోయే నిధిని ఏర్పాటు చేసుకుంటే స‌రిపోతుంది. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ ఖ‌ర్చులు, భాద్య‌త‌లు పెరుగుతాయి కాబ‌ట్టి ద‌శ‌ల వారీగా 12 నెల‌ల వ‌ర‌కు స‌రిపోయే నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం మంచిది.

ఎక్క‌డ దాచాలి?
సాధారణంగా అవసరానికి అందుబాటులో ఉంటుందని డబ్బు ఇంట్లో ఉంచుకోవడమో లేదా బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేయడమో చేస్తుంటాం. కానీ డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. అందుకే ఈ నిధిలో కొంత మొత్తం అంటే పది వేల వరకు నగదు రూపంలో ఇంటిలో అందుబాటులో ఉంచుకోవాలి. బ్యాంకు ఏటీఎంకి వెళ్లి డబ్బు తెచ్చే అవకాశం లేని సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు ఖాతా లేదా అల్ట్రా-షార్ట్-టర్మ్ ఫండ్లలో ఉంచొచ్చు. త‌ద్వారా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎటువంటి ఆల‌స్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేంద‌కు వీలుంటుంది. విత్‌డ్రా స‌మ‌యంలో ఎటువంటి పెనాల్టీలు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి. లేదంటే రాబ‌డి త‌గ్గిపోయే అవ‌కాశం ఉంటుంది.

ఈ ఖర్చులు అందులో వద్దు..
అత్య‌వ‌స‌ర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న‌ చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మతు ఖర్చులు వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఆరోగ్యం, మోటారు వంటి వాటికి బీమా ఉంటుంది. అందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను బీమా ద్వారా పొందే అవ‌కాశం ఉన్న‌ప్పుడు, అత్య‌వ‌స‌ర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఉండ‌దు.

తిరిగి స‌మ‌కూర్చ‌డం మ‌రిచిపోవద్దు..
అత్య‌వ‌స‌ర నిధికి ఉన్న‌ ప్రాధాన్య‌ం వ‌ల్ల చాలా మంది దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. నిధిని ఏర్పాటు చేసుకున్నాం.. ఖ‌ర్చు పెట్టేశాం అని కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు పునఃస‌మీక్షించుకుంటూ ఉండాలి. క‌నీసం ఏడాదికి ఒక‌సారైనా చేస్తే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని