Education Inflation: విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా..
close

Updated : 27/08/2021 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Education Inflation: విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా..

* ఇటీవలే డీమ్యాట్‌ ఖాతా తీసుకున్నాను. నెలకు రూ.5 వేల చొప్పున షేర్లలో క్రమానుగత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇది సాధ్యమవుతుందా? ఎలాంటి షేర్లను ఎంపిక చేసుకోవాలి?

- వేణుగోపాల్‌

షేర్లలోనూ క్రమానుగతంగా పెట్టుబడి పెట్టడానికి వీలుంది. దీన్ని సిస్టమేటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ (ఎస్‌ఈపీ)గా పేర్కొంటారు. మంచి పనితీరు, వృద్ధికి అవకాశం ఉన్న షేర్లను ఎంపిక చేసుకొని, మదుపు చేసుకోవాలి. వాటిని క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. 6 - 8 కంపెనీల షేర్లను ఇందుకోసం ఎంచుకోవచ్చు. షేర్ల విలువ ఎక్కువగా ఉంటే తక్కువ కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టగలరు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సమయం లేకపోతే.. ప్రత్యామ్నాయంగా రెండు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేసేందుకు ప్రయత్నించండి.

*మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వయసు 10 ఏళ్లు. అమ్మాయికి 8 ఏళ్లు. వీరిద్దరికీ ఉపయోగపడేలా నెలకు రూ.10 వేలు మదుపు చేద్దామని అనుకుంటున్నాను. కాస్త సురక్షితంగా ఉండే పథకాల్లో వేటిని ఎంచుకోవాలి? ఏడాదికి రూ.2లక్షల వరకూ ఫీజులు చెల్లించాలి. దీనికోసం నెలనెలా మదుపు చేసి, ఒకేసారి వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి?

- నారాయణ

ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంది. మీరు ఎక్కడ మదుపు చేసినా.. దీన్ని అధిగమించేలా రాబడి రావాలి. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం 4-5 మంచి పనితీరున్న ఫండ్లను ఎంచుకొని, క్రమానుగత విధానంలో మదుపు చేయండి. ఏడాదికోసారి అవసరమైన ఫీజు కోసం బ్యాంకు రికరింగ్‌ డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో నెలకు రూ.16,700 వరకూ జమ చేయాలి. ఫీజలు చెల్లించే సమయానికి ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

*నా వయసు 57 ఏళ్లు. ప్రైవేటు  ఉద్యోగిని. మరో ఏడాదిలో పదవీ విరమణ చేస్తున్నాను. ఇప్పుడు నేను టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా? ఎంత వ్యవధికి తీసుకోవాలి? ప్రీమియం వెనక్కిచ్చే పాలసీలు మంచివేనా?

- మోహన్‌

మీరు టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చు. అయితే, కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్య పరీక్షల నివేదికల ఆధారంగా, కంపెనీ విచక్షణ మేరకు పాలసీని జారీ చేస్తారు. మీ బాధ్యతలు తీరడం, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉన్న సమయం తదితరాల ఆధారంగా వ్యవధి నిర్ణయించుకోండి. కనీసం 70 ఏళ్ల వరకూ ఉంటే మంచిది. ప్రీమియం వెనక్కిచ్చే పాలసీలకన్నా.. పూర్తి రక్షణకు పరిమితం అయ్యే పాలసీలనే ఎంచుకోండి.

* రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇటీవలే ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి మొత్తం డబ్బును తీసుకున్నాను. ఈ మొత్తాన్ని ఈపీఎఫ్‌ రాబడికి సమానంగా ఇచ్చే పథకాల్లో మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. కనీసం 7-8 ఏళ్లపాటు ఈ మొత్తంతో నాకు అవసరం లేదు. ఏం చేస్తే బాగుంటుంది?

- స్వప్న
మీకు 7-8 ఏళ్ల సమయం ఉంది అంటున్నారు కాబట్టి.. కాస్త నష్టభయం వచ్చినా ఇబ్బంది లేదు అనుకుంటే.. హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసుకోండి. ఇందులో 9-10 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. దీర్ఘకాలంలో నష్టభయమూ అంతగా ఉండదు.

 

- తుమ్మ బాల్‌రాజ్‌


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని