Tax on Gold: బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ప‌న్ను ఎంత‌ ప‌డుతుందో తెలుసా? - Income-Tax-on-gold-and-gold-products
close

Updated : 03/11/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tax on Gold: బంగారం కొనుగోలు చేస్తున్నారా.. ప‌న్ను ఎంత‌ ప‌డుతుందో తెలుసా?

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధ‌న‌ త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని భార‌తీయులు భావిస్తారు. అలాగే పెట్టుబ‌డుల ప‌రంగా చూసినా పోర్ట్‌ఫోలియోలో బంగారం పెట్టుబ‌డులు ఉండాలి. అయితే గ‌రిష్ఠంగా 5-10 శాతం ఉంటే స‌రిపోతుంది. అంత‌కంటే ఎక్కువ‌గా బంగారం కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాదు. ఒక‌వేళ పెళ్లి కోసం ఎక్కువ బంగారం కొనుగోలు చేయాల్సి వ‌స్తే పర్వాలేదు గానీ, సాధార‌ణంగా అయితే ఎక్కువ పెట్టుబ‌డులు కేటాయించ‌క‌పోవ‌డం మంచిదని ఆర్థిక స‌ల‌హాదారులు చెప్తున్నారు.

ఈ సంప్రదాయానికి తోడు త‌నిష్క్‌, జోయలుక్కాస్‌, మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమెండ్స్ వంటి ప్రముఖ న‌గ‌ల విక్రయ సంస్థలు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు బంగారంపై అనేక ఆఫ‌ర్లను ప్రకటిస్తున్నాయి. మ‌రి మీరు కూడా ఈ ధ‌న‌త్రయోదశికి బంగారం కొనుగోలు చేశారా? అయితే, బంగారంపై ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌ను తెలుసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఒక‌వేళ భ‌విష్యత్‌లో బంగారం విక్రయిస్తే దీనిపై అవ‌గాహ‌న ఉండాలి. బంగారంపై క్యాపిట‌ల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారో దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. దాంతో పాటు ఎంత‌కాలం బంగారం నిల్వ ఉంచుతున్నారనే విషయం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొనుగోలు చేసిన మూడేళ్లలోపు తిరిగి విక్రయిస్తే దాన్ని స్వల్పకాలిక, అంతకంటే ఎక్కువ కాలం అట్టిపెట్టుకుంటే దీర్ఘకాలికంగా లెక్కిస్తారు.

దీర్ఘకాలిక, స్వల్ప కాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌: బంగారం విక్రయంపై స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ మీ మొత్తం ఆదాయానికి క‌లిపి దాని ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలిక క్యాపిట‌ల్ గెయిన్స్‌పై ప‌న్ను 20.8 శాతం (సెస్‌తో క‌లిపి) ప‌డుతుంది. ఇండెక్సేష‌న్ ప్రయోజనాలు ఉంటన్నాయి. ద్రవ్యోల్బణం లెక్కించిన తర్వాత బంగారం అమ్మిన ధ‌ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

భౌతిక బంగారంపై..: బంగారం నాణేలు, ఆభ‌ర‌ణాలు, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక క్యాపిట‌ల్ గెయిన్స్‌గా లెక్కించి దాని ప్రకారం ప‌న్ను లెక్కిస్తారు. మూడేళ్ల త‌ర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ ప‌న్ను ప‌డుతుంది.

గోల్డ్ ఈటీఎఫ్‌, గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు: గోల్డ్ ఈటీఎఫ్‌లకు సెక్యూరిటీల ఆధారంగా ధ‌ర‌లు నిర్ణయిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇవి ట్రేడ‌వుతాయి. బంగారం మ్యూచువ‌ల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లు విక్రయిస్తే వ‌చ్చే లాభాల‌పై ప‌న్ను ఫిజిక‌ల్ గోల్డ్ మాదిరిగానే ప‌రిగ‌ణిస్తారు.

సార్వభౌమ ప‌సిడి బాండ్లు: ఇవి ప్రభుత్వ సెక్యూరిటీలు. బాండ్ల రూపంలో గ్రాముల‌ను కొనుగోలు చేస్తారు. కాలానుగుణంగా ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ వీటిని జారీ చేస్తుంది. మెచ్యూరిటీ గ‌డువు 8 సంవ‌త్సరాలు. ఐదో ఏడాది నుంచి వీటిని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. మెచ్యూరిటీ పూర్తయ్యేంత వరకు కొన‌సాగిస్తే మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను ఉండ‌దు. గోల్డ్ ఈటీఎఫ్‌, మ్యూచువ‌ల్ ఫండ్లలో ఈ సదుపాయం లేదు. ఈ పసిడి పథకాల్లో వార్షికంగా 2.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. టీడీఎస్ వ‌ర్తించ‌దు. జారీ చేసిన 15 రోజుల్లోపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్‌ చేయొచ్చు. మెచ్యూరిటీ కంటే ముందు ఉప‌సంహ‌రించుకుంటే దీర్ఘకాలిక క్యాపిట‌ల్ గెయిన్స్ ఉన్నప్పటికీ ఇండెక్సేష‌న్‌ ప్రయోజనాలు లభిస్తాయి.

ఫిజిక‌ల్ గోల్డ్ కంటే బాండ్ల రూపంలో కొనుగోలు చేస్తే మేల‌ని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం నిల్వ చేయ‌డంలో రిస్క్ ఉండ‌దు. అలాగే భద్రత, మార్కెట్‌లో బంగారం విలువను బ‌ట్టి బాండ్ల ధ‌ర‌లు పెరుగుతాయి. వ‌డ్డీ కూడా ల‌భిస్తుంది. బంగారం స్వచ్ఛత, నాణ్యత, త‌యారీ ఛార్జీలు వంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో పాటు పెట్టుబ‌డుల‌కు, వ‌డ్డీ హామీ కూడా ఉంటుంది. సార్వభౌమ పసిడి బాండ్లపై జీఎస్టీ కూడా ఉండ‌దు. సాధార‌ణంగా అయితే బంగారం విక్రయాలపై 3 శాతం జీఎస్టీ ఉంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని