రిటర్నులు దాఖలు చేశారా?
close

Updated : 26/10/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిటర్నులు దాఖలు చేశారా?

గత ఆర్థిక సంవత్సర ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ డిసెంబరు 31. ఎంతో వ్యవధి ఉందన్న కారణంతో చాలామంది ఇప్పుడు రిటర్నుల దాఖలును వాయిదా వేసేస్తున్నారు. రిఫండు వచ్చే అవకాశం ఉన్నవారు తొందరగా దాఖలు చేయడమే మంచిది. రిటర్నులను సమర్పించేటప్పుడు సాధారణంగా ఉండే సందేహాలు.. వాటికి సమాధానాలేమిటో చూద్దాం..

సరైన ఫారాన్ని ఎంచుకోండి: ఆదాయానికి ఆధారం ఏమిటి అన్న విషయం ఆధారంగా ఏ ఫారంలో రిటర్నులు వేయాలన్నది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనం అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021-22 (ఆర్థిక సంవత్సరం 2020-21)కి రిటర్నులు సమర్పిస్తున్నాం. ఉద్యోగులు సాధారణంగా ఐటీఆర్‌ 1, ఐటీఆర్‌ 2లో రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుంది. మీకు వర్తించే ఫారం ఏమిటన్నది ఆదాయపు పన్ను వెబ్‌సైటులో వివరంగా ఉంటుంది. సరైన ఫారం ఎంచుకోకపోతే మీ రిటర్నులు చెల్లకుండా పోతాయి.

మినహాయింపు వస్తుందా?: మీరు గత ఆర్థిక సంవత్సరంలో చేసిన పన్ను మినహాయింపు పెట్టుబడులు, బీమా పాలసీల వివరాలు మీ యాజమాన్యానికి ఇవ్వలేదు అనుకుందాం.. రిటర్నుల దాఖలు సమయంలో వీటిని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇలాంటివి ఏమైనా ఉంటే.. ఆలస్యం చేయకుండా రిటర్నులు వేయండి. ప్రధానంగా సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ కింద అన్ని మినహాయింపులూ పొందారా లేదా చూసుకోండి.

ఆదాయాలన్నీ చూపించాలి: ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అన్ని ఆదాయాలనూ రిటర్నులలో చూపించడం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఉద్యోగులు తమ ఫారం-16ను ఒకసారి గమనించాలి. అందులో వేతనం కాకుండా.. ఇతర ఆదాయాలు.. అంటే మూలధన లాభం, ఫిక్స్‌డ్‌, పొదుపు డిపాజిట్లపై వచ్చిన వడ్డీ తదితరాలు ఉండే అవకాశం ఉంది. వీటిని ఇతర ఆదాయాల కింద పేర్కొని, రిటర్నులలో చూపించాలి. అవసరమైతే పన్ను చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.

ఇ-వెరిఫై చేస్తేనే: రిటర్నులు పూర్తి చేయడంతోపాటు.. దానిని ఇ-వెరిఫై చేసి అధీకృతం చేయాలి. అప్పుడే ఆ ప్రక్రియ పూర్తి అయినట్లు లెక్క. దీన్ని ఆధార్‌ ఓటీపీ ద్వారా పూర్తి చేయొచ్చు. లేదా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డీమ్యాట్‌ ఖాతానూ వినియోగించుకోవచ్చు. వెంటనే చేయకపోయినా.. 120 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయడం తప్పనిసరి. ఐటీఆర్‌-5ను డౌన్‌లోడ్‌ చేసుకొని, బెంగళూరుకు పోస్టులో పంపించే అవకాశమూ ఉంది. కానీ, ఇది కాస్త శ్రమతో కూడిన వ్యవహారమే. వీలైనంత వరకూ ఇ-వెరిఫై చేయడమే శ్రేయస్కరం.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని