చ‌దువుల కోసం చేసే ఖ‌ర్చుపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు తెలుసా? - Income Tax Benefits available for Education
close

Updated : 06/10/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చ‌దువుల కోసం చేసే ఖ‌ర్చుపై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్య.. ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం. ఈ పోటీ ప్ర‌పంచంలో కోరుకున్న ఉద్యోగం లేదా వ్యాపారంలో రాణించాలంటే చదవుకోవడం చాలా ముఖ్యం. నాణ్య‌మైన విద్య అంటే అందుకు అయ్యే ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే భార‌త్‌లో విద్య‌కు సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద‌ ప్ర‌భుత్వం కొన్ని మిన‌హాయింపులు ఇస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సెక్ష‌న్ 80సి కింద మిన‌హాయింపు.. 
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం గ‌రిష్ఠంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చెల్లించే ట్యూష‌న్ ఫీజుపై ఏటా సెక్ష‌న్ 80సి కింద రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిడ‌క్ష‌న్‌ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీంతో పాటు పీపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్‌, గృహ రుణ తిరిగి చెల్లింపులు, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు వంటివి కూడా ఈ సెక్ష‌న్ కింద‌కి వ‌స్తాయి. సెక్ష‌న్ 80సి కిందకు వ‌చ్చే పెట్ట‌బ‌డులు, వ్య‌యాల‌పై మొత్తంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. 
విద్యాపరంగా ఈ మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం భార‌త్‌లోని స్కూలు, కాలేజ్‌, యూనివ‌ర్సిటీ, ఇత‌ర విద్యాసంస్థ‌ల‌కు చెల్లించే ట్యూష‌న్ ఫీజుల‌పై ల‌భిస్తుంది. విద్య కోసం చెల్లించే ట్యూష‌న్ ఫీజుపై మిన‌హాయింపు వ‌ర్తించ‌దు. అంతేకాకుండా పూర్తి స‌మయం విద్య కోసం చెల్లించిన ఫీజుల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ల‌భిస్తుంది. పూర్తి ఫీజులో ట్యూష‌న్ ఫీజు ఒక భాగం మాత్ర‌మే. ఈ భాగం వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. క‌ళాశాల అభివృద్ధి, ఇత‌ర ఖ‌ర్చుల కోసం చెల్లించే డొనేష‌న్‌పైనా, అలాగే కోచింగ్ సంస్థ‌లు, ఇత‌ర క్లాసుల‌కు చెల్లించే ఫీజుల‌పై, లేదా ఏదైనా కరస్పాండెన్స్ కోర్సుల‌కు చెల్లించే ఫీజుల‌పై ఈ మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

ఇద్ద‌రి కంటే ఎక్కువ పిల్ల‌లుంటే..
ఈ మిన‌హాయింపు గ‌రిష్ఠంగా ఇద్ద‌రు పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజుల‌పై మాత్ర‌మే క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఒక‌వేళ మీకు ముగ్గురు పిల్ల‌లుంటే ఎవ‌రైనా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చెల్లించే ఫీజుపై డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ భార్యాభర్తలు పనిచేసేవారైతే మూడో వారికి చెల్లించే ఫీజుపై మ‌రొక‌రు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు చెల్లించే ఫీజు రూ.1.50 ల‌క్ష‌ల ప‌రిమితి కంటే ఎక్కువ ఉంటే మిగిలిన మొత్తంపై రెండో వారు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంది. ఒకే పిల్ల‌ల‌పై  భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు గానీ ఒకే మొత్తంపై ఇద్ద‌రు క్లెయిమ్ చేయ‌కూడ‌దు.

విద్యారుణం చెల్లింపుల‌పై ప‌న్ను మిన‌హాయింపు..
ఉన్న‌త విద్య కోసం అయ్యే ఖ‌ర్చు భారీగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది విద్యా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటారు. ఇలా విద్యారుణం తీసుకున్న వారు.. చెల్లించే వ‌డ్డీపై సెక్ష‌న్ 80ఈ ప్ర‌కారం డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇక్క‌డ ఉన్న‌త విద్య అంటే సీనియర్ సెకండ‌రీ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన తర్వాత చేప‌ట్టే ఏదైనా విద్యా కోర్స్‌. ఇది మీరు సొంతంగా లేదా మీ పిల్ల‌ల చ‌దువు కోసం, భ‌ర్త లేదా భార్య కోసం, మీ సంర‌క్ష‌ణ‌లో పెరుగుతున్న పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల కోసం కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

రుణం తిరిగి చెల్లించ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి వ‌రుస‌గా 8 సంవ‌త్స‌రాలు ఈ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. మీరు చెల్లిస్తున్న వ‌డ్డీని బ‌ట్టి ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఒక‌వేళ మీరు ఒక నిర్దిష్ట సంవ‌త్స‌రంలో విద్యా రుణ వ‌డ్డీ బ‌కాయిల‌ను చెల్లిస్తే.. మీరు ఏ సంవ‌త్స‌రానికి సంబంధించిన వ‌డ్డీని చెల్లించారనే విష‌యంతో సంబంధం లేకుండా చెల్లించిన సంవ‌త్స‌రంలో మొత్తం వ‌డ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. గృహ రుణంలో పేర్కొన్న ప‌రిమితి వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. కానీ విద్యా రుణంలో అలా కాదు. రుణ మొత్తంతో సంబంధం లేకుండా చెల్లించిన వ‌డ్డీ మొత్తంపై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

సెక్ష‌న్ 80సిలో డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. పూర్తి స‌మ‌యం హాజ‌ర‌వుతూ విద్యాసంస్థ‌కు చెల్లించే ట్యూష‌న్ ఫీజుపై మాత్ర‌మే డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అది కూడా భార‌త్‌లోని విద్యా సంస్థ‌లో విద్య‌ను అభ్య‌సిస్తుండాలి. కానీ విద్యారుణంపై ప‌న్ను మిన‌హాయింపు విష‌యానికి వ‌స్తే.. పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ ఏ కోర్సు కోసం రుణం తీసుకున్నా దేశ విదేశాల్లో ఎక్క‌డ చ‌దివినా విద్యారుణ వ‌డ్డీపై డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

వడ్డీని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు దేశంలోని బ్యాంకులు, ప్ర‌భుత్వం ఆమోదం పొందిన‌ ఆర్థిక సంస్థలు లేదా కేంద్రం ఆమోదించిన స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ల నుంచి రుణం తీసుకొని ఉండాలి. బంధువుల నుంచి గానీ స్నేహితుల నుంచి గానీ రుణం తీసుకుంటే క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు. ఒక‌వేళ మీరు భార‌త్‌లో పూర్తి స‌మ‌యం విద్య కోసం రుణం తీసుకుంటే.. ఆ రుణం వ‌డ్డీ చెల్లింపుల‌పై సెక్ష‌న్ 80ఈ ప్ర‌కారం, అలాగే ట్యూష‌న్ ఫీజుపై సెక్ష‌న్ 80సి ప్రకారం డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

వేత‌న జీవుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు..
పైన వివ‌రించిన‌ ప్ర‌యోజనాతో పాటు.. వేత‌న జీవుల‌కు, స్వ‌యం ఉపాధి క‌లిగిన వారు వారి సంస్థ నుంచి మ‌రిన్ని అలవెన్సులు పొందొచ్చు. అవి ఏంటంటే మొద‌ట‌గా ఇద్ద‌రి పిల్ల‌ల విద్య కోసం సంస్థ నుంచి నెల‌కు రూ.100 చొప్పున అంద‌జేస్తారు. రెండోది హాస్ట‌ల్ ఖ‌ర్చుల కోసం రూ.300 చొప్పున ఇద్ద‌రి పిల్ల‌ల‌కు ఇస్తారు. అయితే ఇప్ప‌టికే మీ వేత‌నంలో వీటిని క‌లిపి ఇస్తుంటే మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఇవ్వరు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని