Health Insurance : ఆరోగ్య బీమా.. నచ్చలేదా... మార్చుకోండి
close

Updated : 24/09/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Health Insurance : ఆరోగ్య బీమా.. నచ్చలేదా... మార్చుకోండి

ఆరోగ్య బీమా ప్రాధాన్యం ఇప్పుడు ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సంస్థ నుంచి పాలసీ తీసుకున్న తర్వాత అది నచ్చకపోతే.. అలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు. కావాలంటే మరో సంస్థకు పాలసీని మార్చుకోవచ్చు. ఇలాంటప్పుడు అంతవరకూ పాత పాలసీ నుంచి వచ్చిన ప్రయోజనాలేమీ దూరం కాకుండానే కొత్త సంస్థ నుంచి పాలసీ లభిస్తుంది. దీన్ని బీమా పరిభాషలో పోర్టబులిటీ అంటారు. బోనస్‌, ముందస్తు వ్యాధులకు ఇచ్చిన వ్యవధిలాంటివీ కొత్త పాలసీకి మారిపోతాయి. మరి ఈ పాలసీని ఎలా మార్చుకోవాలి... తెలుసుకుందాం.

ప్రస్తుతం కొనసాగుతున్న పాలసీ నుంచి కొత్త పాలసీకి మారాలంటే.. పునరుద్ధరణకు 45 రోజులకు ముందుగానే సిద్ధం అవ్వాలి. కొత్త బీమా సంస్థలోకి మారేందుకు ప్రతిపాదిత పత్రంతోపాటు, పోర్టబిలిటీ పత్రాన్నీ జత చేయాలి. వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రం, క్లెయింల చరిత్ర, ఆరోగ్య వివరాలనూ బీమా సంస్థకు అందించాలి. మీ దగ్గర్నుంచి పోర్టబిలిటీ దరఖాస్తు వచ్చిన తర్వాత కొత్త బీమా సంస్థ మీ పాత పాలసీ ఉన్న సంస్థను సంప్రదిస్తుంది. మీ ఆరోగ్య వివరాలు, క్లెయిం చరిత్ర తదితరాల గురించి ఆరా తీస్తుంది. అన్ని వివరాలనూ సరిచూసుకున్నాకే.. కొత్త బీమా సంస్థ మీ ప్రతిపాదనను   అంగీకరించవచ్చు. లేదా పాలసీ నిబంధనలు, సంస్థ విచక్షణ మేరకు తిరస్కరించే అవకాశమూ లేకపోలేదు.

ఒకవేళ మీరు పాత పాలసీకన్నా అధిక మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలని అనుకుంటే.. అలా పెంచిన మొత్తానికి కొన్నాళ్లపాటు వేచి ఉండే వ్యవధి నిబంధన వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు ఏ అనే బీమా సంస్థ దగ్గర రూ.5లక్షల పాలసీ తీసుకున్నారు. దీన్ని బి అనే సంస్థకు మార్చుకునేటప్పుడు రూ.7లక్షల పాలసీ తీసుకోవాలని భావించారు. అప్పుడు పాత పాలసీ రూ.5లక్షలకు వర్తించే నిబంధనల్లో తేడా రాదు. కానీ, మీరు పెంచుకున్న రూ.2లక్షలకు మాత్రం వేచి ఉండే వ్యవధి నిబంధన వర్తిస్తుందన్నమాట.

మినహాయింపులు తెలుసుకున్నాకే..

కొత్త సంస్థకు మారే ముందుగా.. ఆ పాలసీకి సంబంధించిన నియమ నిబంధనలను కచ్చితంగా తెలుసుకోండి. మినహాయింపుల గురించి ఆరా తీయండి. కొన్నిసార్లు మీ పాత పాలసీతో పోలిస్తే కొత్త సంస్థకు మారినప్పుడు నిబంధనల్లో మార్పులు ఉంటాయి. కేవలం ప్రీమియం తగ్గుతుందన్న కారణంగా బీమా సంస్థను మారడమూ సరికాదు. పరిమితులు, ఉప పరిమితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. క్లెయింల సందర్భంలో గందరగోళం ఏర్పడుతుంది.

ప్రతి పాలసీకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కేవలం వేచి ఉండే వ్యవధి, నో క్లెయిం బోనస్‌లాంటివి చూసి నిర్ణయం మారాలనే నిర్ణయం తీసుకోవద్దు. రెండు పాలసీలనూ పోల్చి చూడండి. ప్రత్యేకతలను విశ్లేషించండి. కొత్త పాలసీకి మారడం ద్వారా మీకు వస్తున్న కొత్త ప్రయోజనాలేమిటో చూసుకోండి. మీ ఆరోగ్యం, ఇప్పటి వరకూ తీసుకున్న చికిత్సల విషయంలో ఎలాంటి దాపరికం వద్దు. ఆరోగ్య బీమా విషయంలో పారదర్శకత ఎంతో ముఖ్యం అన్న సంగతి మర్చిపోవద్దు.

- టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని